సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం/విజయవాడ: భారీ వర్షాల కారణంగా శుక్రవారం కూడా దక్షిణమధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. పలుచోట్ల పట్టాల మీదుగా వరద నీరు పారుతుండడంతో ఆయా మార్గాల గుండా వెళ్లే రైళ్లకు తీవ్ర అంతరాయం ఎదురైంది. దారి మళ్లింపుతో రైళ్లు గంటలకొద్దీ ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులకు సరైన సమాచారం తెలియక తీవ్ర ఇక్కట్లు పడ్డారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. హౌరా-మైసూరు ఎక్స్‌ప్రెస్‌ను శుక్రవారం రద్దు చేశారు. సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లు నాలుగు గంటలు ఆలస్యంగా నడిచాయి. యశ్వంతపూర్-హౌరా ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గౌహతి ప్రత్యేక రైలు, బెంగళూరు-గౌహతి ఎక్స్‌ప్రెస్‌లను వరంగల్, బలార్షా, నాగ్‌పూర్, ఖరగ్‌పూర్‌ల మీదుగా మళ్లించారు. ఆ రైళ్లన్నీ 20 నుంచి 24 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. నల్లగొండ-తిప్పర్తి మధ్య వరద ఉధృతి కారణంగా లైన్ బలహీనపడడంతో ఆ మార్గం గుండా రైళ్ల రాకపోకలను నిలిపేశారు. గుంటూరు-సికింద్రాబాద్ రైళ్లను విజయవాడ మీదుగా మళ్లించారు.
శబరి ఎక్స్‌ప్రెస్‌ను చాలాసేపు నల్లగొండలో నిలిపివేశారు. సికింద్రాబాద్-విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను వెనక్కు రప్పించి మళ్లించారు. కాగా, తూర్పు కోస్తా రైల్వే పరిధిలో శుక్రవారం కూడా పదకొండుకుపైగా రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పలాస-ఖుర్దారోడ్డు మార్గంలో పలు చోట్ల రైలుమార్గాలు దెబ్బతిన్నందున ఒడిశా, కోల్‌కతా వైపు వెళ్లాల్సిన రైళ్లు ఆగిపోయాయి. శుక్రవారం విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన సమైక్య శంఖారావం స్పెషల్ రద్దయింది. అలాగే 12703 ఫలక్‌నుమా, 12839 హౌరా-చెన్నై సెంట్రల్ మెయిల్ రైళ్లను పూర్తిగా రద్దుచేశారు. విశాఖ నుంచి వెళ్లే 12864 యశ్వంత్‌పూర్-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి 7.35 గంటలకు బదులుగా శనివారం ఉదయం 7 గంటలకు బయలు దేరుతున్నట్లు ప్రకటించారు. 18464 బెంగుళూర్‌సిటీ-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు బదులుగా శనివారం తెల్లవారుజామున ఒంటిగంటకు బయలుదేరనుంది. 12864 యశ్వంత్‌పూర్-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి 7.35 గంటలకు బదులుగా శనివారం ఉదయం 7 గంటలకు బయలుదేరుతుంది. 12702 హౌరా-సికింద్రాబాద్-ఫలక్‌నుమా శనివారం గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉండగా ఆదివారం ఉదయం చేరుకుంటుందని అధికారులు ప్రకటించారు.
హెల్ప్‌లైన్ సెంటర్ల వివరాలు
నల్లగొండ : 0868 2224392
మిర్యాలగూడ: 08689 242627
నడికుడి : 08649 257625
గుంటూరు : 0863 2222014
పిడుగురాళ్ల : 08649 252255