చోడవరం, న్యూస్‌లైన్ : మార్కెట్‌లో చక్కెర ధరలు పెరగకపోవడంతో సుగర్ ఫ్యాక్టరీలకు తీవ్ర నష్టం ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది మొలాసిస్ ధరలు ఆశాజనకంగా ఉండి ఫ్యాక్టరీలను కొంత ఆదుకున్నా చక్కెర ధర మాత్రం ఆందోళన కలిగిస్తోంది. రెండు నెలలుగా క్వింటాలు ధర రూ. 2950 మాత్రమే ఉంది. దాంతో చక్కెర అమ్మకాలపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్న సహకార చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. చక్కెర ఉత్పత్తి వ్యయం కన్నా ధర తక్కువయ్యే ప్రమాదం ఎదురవుతూ ఉండడంతో ఫ్యాక్టరీలకు ఏమీ పాలుపోకుండా ఉంది.
చెరకు రైతుకు ఇచ్చే గిట్టుబాటుధరను పక్కన పెడితే, క్వింటాలుకు సుమారు రూ. 1000 వరకు ఫ్యాక్టరీకి ఖర్చవుతుంది. టన్ను చెరకుకు రైతుకు రూ.1800 నుంచి 2100 వరకు చెల్లిస్తున్నారు. సరాసరి రికవరీ 10 శాతం ఉంటే క్వింటాలు పంచదార ఉత్పత్తికి ఫ్యాక్టరీకి రూ. 2800 నుంచి 3100 వరకు ఖర్చవుతుం ది. కానీ వివిధ కారణాల వల్ల రికవరీ ఆ స్థాయిలో లేదు. ఈ ప రిస్థితుల్లో ధర తగ్గిపోవడం ఫ్యాక్టరీలకు ఆందోళన కలిగిస్తోంది.
ప్రభుత్వ ధోరణితోనూ ఇక్కట్లే : చౌకదుకాణాల కోసం సరఫరా చేసే చక్కెర కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల కూడా ఎక్కడిదక్కడే ఉంది. ప్రభుత్వం పంచదారపై లెవీ ఎత్తేయడంతో బహిరంగ మార్కెట్‌లో విక్రయాల ద్వారా కర్మాగారాలు ఇప్పుడిప్పుడే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతున్నాయి. ఈ స్థితిలో మళ్లీ ధర పడిపోవడంతో ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చెరకు కాకుండా ఇతర పంటల నుంచి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి అవుతున్న పంచదారను మార్కెట్‌లోకి దిగుమతి చేసుకోవడం వల్ల రాష్ట్రీయ చక్కెర కర్మాగారాలు సతమతమవుతున్నాయి.
కనీసం నిత్యావసర సరఫరా వ్యవస్థకైనా అమ్ముదామనుకుంటే పెద్ద వ్యాపారులు రింగ్ అయిపోవడంతో క్వింటాలు పంచదార ధర పెరగడం లేదు. చౌకడిపోల్లో పంచదార కొనుగోలు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం క్వింటాలుకు రూ. 3200 చెల్లిస్తుంది. ఫ్యాక్టరీలకు ఈ ధర చెల్లించినా బాగుండేది. కాని రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాపారుల మాదిరిగా నిర్ణయించిన రూ. 2900కే ఇవ్వాలని ఫ్యాక్టరీలపై ఒత్తిడి తెచ్చింది. ఇది కూడా చక్కెర ఫ్యాక్టరీలను సతమతం చేస్తోంది. ఆశించిన ధరలేక సుమారు 45 రోజులుగా అమ్మకాలు చేపట్టని ఫ్యాక్టరీలు గత్యంతరం లేక తక్కువ ధరకే తెగనమ్ముకుంటున్నాయి.
ఈ పరిణామం నష్టాల్లో ఉన్న తాండవ, అనకాపల్లి తోపాటు లాభనష్టాలు లేకుండా నడుస్తున్న ఏటికొప్పాకపైనా తీవ్ర ప్రభావం చూపనుంది. మిగతా ఫ్యాక్టరీల కంటే ఎక్కువ గిట్టుబాటు ధర చెల్లిస్తున్న చోడవరం సుగర్ ఫ్యాక్టరీని కూడా ఇబ్బంది పెట్టడం ఖాయమనిపిస్తోంది. విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పంచదార దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో క్వింటాల్‌కు కేంద్రం ఇస్తున్న రూ. 3200లకే ఇక్కడ పంచదారను కొనుగోలు చేయడానికి రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిపక్షంలో సహకార చక్కెర కర్మాగారాలు మరిన్ని నష్టాల్లో చిక్కుకుని మూతబడే ప్రమాదం పొంచి ఉంది.
సుగర్ ఫ్యాక్టరీలకు తీవ్ర నష్టం
Published Tue, Aug 20 2013 1:56 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM
Advertisement
Advertisement