కరీంనగర్‌క్రైం, న్యూస్‌లైన్ : ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని కావాలన్నా బల్ల కింద చాచిన చేతులు తడపాల్సిందే. బర్త్ సర్టిఫికెట్ మొదలు.. డెత్ సర్టిఫికెట్ వరకు.. మనిషి జీవిత కాలంలో అన్ని పనులకూ అమ్యామ్యాలు చదివించాల్సిందే. గత సంవత్సర కాలంగా ఏసీబీ దూకుడు పెంచింది. వరుసగా దాడులు చేస్తోంది. పలుచోట్ల జనం తిరగబడుతున్నారు. అయినా అవినీతిపరుల తీరు మాత్రం మారడం లేదు. ఈ ఏడాదిలో కరీంనగర్ రేంజ్ పరిధిలో యాభై దాడులు చేసి.. 70 మందిపై కేసులు నమోదు చేయడమే ఇందుకు తార్కాణం. తాజాగా అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం రోజే శంకరపట్నం మండల తహశీల్దార్ ఓ రైతు నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటూ పట్టుబడడం ప్రభుత్వ యంత్రాంగం దిగజారుడు తనానికి నిదర్శనం. ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా ఏళ్లుగా పాతుకుపోయిన లంచావతరులు సామాన్యులను పీల్చిపిప్పి చేస్తున్నారు. ప్రతి పనికీ వెలకట్టి అందినకాడికి దండుకునే అధికారులు దాదాపు ప్రతి శాఖలోనూ తయారయ్యారు. అవినీతి అధికారుల చేతులు తడిపి తడిపి విసిగిపోయిన సామాన్యులు వారి అంతు చూసేందుకు ఏసీబీని అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. జిల్లాలో పెరిగిపోయిన అవినీతిని అరికట్టేందుకు అక్షరాస్యులే కాదు.. నిరక్షరాస్యులు కూడా ముందుకు రావడం శుభపరిమాణం. ఈ కారణంగానే కరీంనగర్ రేంజ్ పరిధిలో గతేడాది కేవలం 17 కేసులే నమోదు చేసిన ఏసీబీ.. ఈ సంవత్సరం ఏకంగా హాఫ్‌సెంచరీ కొట్టగలిగింది. అయితే.. ఏసీబీ వరస దాడులతో బెంబేలెత్తుతున్న అవినీతిపరులు తమ చేతికి మట్టి అంటకుండా జాగ్రత్తపడుతున్నారు.
లంచాలు వసూలు చేసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకుంటున్నారు. వ్యక్తిగత సహాయకులు, ప్రైవేట్‌గా ఏర్పాటు చేసుకుంటున్న డ్రైవర్లు, వారి కార్యాలయాల వద్ద దుకాణదారులు, టీకొట్లు, జిరాక్స్ దుకాణాలను అడ్డాలుగా చేసుకుని అవినీతిదందా సాగిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి గతంలో లేనివిధంగా చట్టంలో కొత్త మార్పులు చేశారు. దీనిప్రకారం అధికారుల తరఫున లంచాలు తీసుకున్నా.. లేదా మధ్యవర్తులుగా వ్యవహరించినా.. వారిపై కూడా ఏసీబీ కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటివరకు రెండు కేసుల్లో మధ్యవర్తులను పట్టుకొని కటకటాల్లోకి నెట్టిన సందర్భాలున్నాయి.
పెరిగిన కేసులు
ఏసీబీ దూకుడు పెరగడంతో కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. రెండు నెలల క్రితం ప్రతి రోజు ఒక కేసు చొప్పున వారం రోజులపాటు వరుసగా జిల్లాలో కేసులు నమోదు చేయడం సంచలనం కలిగించింది. గతేడాది కరీంనగర్ రేంజ్ పరిధిలో 17 కేసులు నమోదు చేయగా, ఈ సంవత్సరం ఇప్పటివరకు 50 కేసులు నమో దు చేసి.. 70 మందిని అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లాలోనే 37 కేసులు నమోదు చేసి.. 48 మందిని అరెస్టు చేశారు. ఏసీబీని ఆశ్రయిస్తే ప నులు కావోమోననే భయంతో కొందరు లంచా ల వేధింపులకు గురవుతున్నా బయటకురావ డం లేదు. ఈ నేపథ్యంలో సామాన్యులు సైతం ముందుకు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించాల్సిన అవసరముంది.
వీరి సంగతి చూడాల్సిందే..
కొందరు అధికారులు, ఉద్యోగులు అడ్డూ అదుపు లేకుండా లంచాలు పుచ్చుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారు. అనతికాలంలోనే కోట్లల్లో స్థిరాస్తులు, బ్యాంకు బ్యాలెన్స్‌లు, బంగారం, వాహనాలు, ఖరీదైన వస్తువులు కూడబెట్టుకుంటున్నారు. ఇవన్నీ కుటుంబసభ్యులు, బంధువుల పేరిట లేదా బినామీ పేర్లపై పెట్టడంతో చట్టానికి చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ఇలాంటి వారు ప్రతి శాఖలో కనిపిస్తున్నా ఫిర్యాదులు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం, ఒకవేళ ఫిర్యాదు చేసినా అది నిలబడకపోవడం జరుగుతోంది. ఇలాంటి వారిపై ఏసీబీ సైతం దృష్టిసారించడం లేదని, కొన్నిసార్లు ఫిర్యాదుల సమాచారం సంబంధిత వ్యక్తులకు లీకవుతోందని ఆరోపణలున్నాయి. దీంతో అవినీతిపరులు అంతా ఎక్కదిక్కడ సర్దుకుని నీతిమంతులుగా ఫోజులు కొట్టడానికి అవకాశం లభిస్తోంది. కొన్ని నెలల క్రితం నగరంలో పని చేసిన ఓ సీఐపై ఏసీబీ నిఘా పెట్టడంతో మరో చోటీకి బదిలీ చేయించుకుని వెళ్లారని, మరో వారం రోజలు ఉంటే ఏసీబీ చిక్కేవారని ప్రచారం జరిగింది.
2009 నుంచి ఇప్పటివరకు దాడుల చిట్టా..
2009లో 11 దాడులు చేసి 11 మందిని అరెస్టు చేశారు. తహశీల్దార్లు-2, వీఆర్వోలు-2, సీఐ, ఆర్‌ఐ, ఎఫ్‌ఆర్‌ఓ, డె ప్యూటీ ఈఈ, ఈడీ, సీటీఓ, జోనల్ అధికారి ఒక్కరి చొప్పున ఉన్నారు.
2010లో ఐదు దాడులు మాత్రమే నిర్వహించి 8 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో వీఆర్వోలు-3, కేడీసీసీబీ మేనేజర్ తదితరులున్నారు.
2011లో 11 దాడులు జరిపి 15 మందిని అరెస్టు చేశారు. వీరిలో వీఆర్వోలు-5, ఎస్సై, ఎఫ్‌ఆర్‌ఓ, ఎగ్జిక్యూటీవ్ అధికారి, ప్రిన్సిపాల్, ఏస్టీవో ఉన్నారు.
2012లో 10 దాడులు చేసి 12 మందిని కటకటాలకు పంపించారు. వీరిలో వీఆర్వోలు-5, ఎంపీడీవో, ఆర్‌ఐ, ల్యాండ్ ఇన్‌స్పెక్టర్, టౌన్ ప్లానింగ్ సర్వేయర్లున్నారు.
2013లో ఇప్పటి వరకూ 37 దాడుల చేసి సుమారు 48 మందిని అరెస్టు చేశారు. వీరిలో వీఆర్వోలు/ రెవెన్యూ శాఖ-సుమారు 22, వివిధ కార్యాలయాల్లోని సీనియర్ అసిస్టెంట్లు- సుమారు 15, ఆర్‌ఐ-సుమారు 2, జైలువార్డర్లు-2, జూనియర్ అసిస్టెంట్, సబ్ ట్రెజరి అధికారి, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజర్, సబ్‌రిజిస్ట్రార్, సానిటరి ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజినీర్, తహశీల్దార్‌తోపాటు మరికొందరు ఉన్నారు.
ఎవరినీ వదిలిపెట్టం..
లంచాలు తీసుకునే ఎవరిని వదిలిపెట్టం.లంచాల కోసం వేధిస్తే కేసులు నమోదు చేస్తాం. అక్రమాస్తులపై కూడా సమాచారం అందిస్తే సోదాలు చేస్తాం. ప్రభుత్వ అధికారులు వారి విధి వారు నిర్వహణ నిర్వహించాలి. డబ్బులు ఇస్తే పని చేస్తానంటే సామాన్యుడికి అండగా ఏసీబీ ఉంటుంది. అవినీతి అధికారుల భరతం పడుతుంది.
- సుదర్శన్‌గౌడ్, ఏసీబీ డీఎస్పీ, కరీంనగర్ రేంజ్
వరుస దాడులతో ఏసీబీ హల్‌చల్
Published Tue, Dec 10 2013 6:44 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement