సాక్షి, నెల్లూరు : తరగతి గదిలో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే పవిత్ర ఉపాధ్యాయ వృత్తి ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతోంది. దీనికి కొందరు ఉపాధ్యాయుల వ్యవహారశైలే కారణమనే ఆరోపణలున్నాయి. ఇన్‌సర్వీస్‌లో ఉన్నత విద్య అభ్యసించి పదోన్నతులు పొందడంలో కొందరు అయ్యోర్లు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా సర్టిఫికెట్లు పొందుతున్నారు. అక్రమ సర్టిఫికెట్లతో ఉద్యోగోన్నతులు దక్కించుకుంటున్నారు. వీరిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ఉన్నారంటే విద్యావ్యవస్థే కాదు సభ్యసమాజం తలదించుకుంటోంది.
ఇన్ సర్వీస్‌లో ఉన్నత విద్యకు నిబంధనలు
ఎస్‌జీటీలుగా పనిచేస్తున్న వారు ఇన్‌సర్వీస్‌లో బీఈడీ చేయాలంటే మేనేజ్‌మెంట్ అనుమతి ఉండాలి.
అర్ధనెల జీతం మాత్రమే వస్తుంది. ఎరెండ్ లీవ్ పెట్టాలి.
ఏదైనా పాఠశాలలో 50 రోజులు టీచింగ్ ప్రాక్టీస్ చేయాలి.
మొదటి సంవత్సరానికి సంబంధించి 12 రోజులు,రెండో సంవత్సరానికి 12 రోజులు ప్రాక్టికల్స్ నిర్వహించాలి. ఇలా మొత్తం 80 రోజలు ఫీల్డ్‌లో పని చేయాలి.
దరఖాస్తు చేసుకున్న విశ్వవిద్యాలయానికి మేనేజ్‌మెంట్ అనుమతి, గుర్తింపు కార్డు, హాల్ టికెట్, ఎగ్జామినేషన్ టైమ్‌టేబుల్, చెల్లించిన ఫీజు, తీసుకున్న క్లాసుల వివరాలను, ఒర్జినల్ సర్టిఫికెట్లను పంపాలి.
ఇవేవీ పంపకుండానే అధికారులను మేనేజ్ చేసుకుంటూ ఇన్ సర్వీస్‌లో ఉన్నత విద్యను పూర్తి చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత విద్య పూర్తి అయిన తర్వాత ప్రమోషన్లలో సంబంధిత విశ్వవిద్యాలయానికి పంపిన హాల్ టికెట్, ఫీజు వివరాలకు సంబంధించి ఒర్జినల్, తాను పనిచేస్తున్న పాఠశాలలో అటెండెన్స్ రిజిస్టర్ జెరాక్స్ కాపీలు, జీతాల వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. 2008-2011 మధ్య కాలంలో కార్పొరేషన్‌లో 11 మంది ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లగా పదోన్నతులు పొందారు. వీరిలో సగానికి పైగా ఈ నిబంధనలేవీ పాటించలేదని అప్పట్లో కొందరు ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించారు. ఆ కేసులు ఇంకా కొనసాగుతున్నాయి.
కార్పొరేషన్ మేనేజర్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు చేతులు తడిపితే సంబంధిత పత్రాలతో పనిలేకుండానే ఉన్నత విద్యను అభ్యసించవచ్చునని, అవే పత్రాలను ఉపయోగించి పదోన్నతులు పొందవచ్చని అర్హులైన అభ్యర్థులు వాపోతున్నారు. అర్హతలుండి అధిక మొత్తంలో అధికారులకు చేతులు తడప లేక తాము పదోన్నతులు పొందలేక పోయామని వారి ఆవేదన. ఇన్ సర్వీస్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న కాలంలో ఆయా ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న పాఠశాల అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేసినప్పటికీ లంచాల మత్తులో ఉన్న అధికారులు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. ఇందుకు కోర్టు కేసులే ఉదాహరణ. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, లీవ్ రిజిస్టర్, జీతాల బిల్లు రిజిస్టర్, లీవ్ మంజూరు చేసినట్లు ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులతో సంబంధం లేకుండానే బీఈడీ చేసిన వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.
దుర్వినియోగమవుతున్న దూరవిద్య
చదువు కోవాల్సిన వయసులో చదువుకోలేక పోయిన వారి కోసం, పనులు చేస్తూ ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి అవకాశం కల్పించేందుకు దూరవిద్య ప్రవేశ పెట్టారు. అయితే ఈ విధానం దుర్వినియోగం అవుతోంది. యూజీసీ నిబంధనలను అనుసరించకుండా ఇగ్నో సార్వత్రిక విశ్వవిద్యాలయం, రాష్ట్రంలోని వివిధ విశ్వ విద్యాలయాల స్టడీ సెంటర్ల నిర్వాహకులు డబ్బుకు కక్కుర్తి పడి అభ్యర్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. దీంతో ఇన్ సర్వీస్ అభ్యర్థులు అధిక మొత్తంలో లంచాలు ఇచ్చి తమ పనిని పూర్తి చేసుకుంటున్నారు. ఫలితంగా విద్యాబుద్ధులు నేర్పాల్సిన అయ్యోర్లు అక్రమంగా పదోన్నతులు పొందుతున్నారు. ఈ విధంగా పొందిన పదోన్నతులతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలుగుతోంది. అన్నింటికి మించి భావిభారత పౌరులను ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు అనైతిక కార్యకలాపాలకు పాల్పడితే ఎలా అని పలువురు విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇన్ సర్వీస్‌లో నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్లు పొంది అక్రమంగా పదోన్నతులు పొందిన వారిపై చర్యలు చేపట్టాల్సి ఉంది.
చర్యలు చేపడతాం :
సాధారణంగా ఉన్నత విద్యకు సంబంధించి అనుమతులు ఇస్తున్నాం. గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉన్నత విద్య, పదోన్నతులపై కమిటీని వేశారు. కమిటీ నివేదిక అందిన తర్వాత చర్యలు చేపడతాం. -భాగ్యలక్ష్మి, డిప్యూటీ కమిషనర్
అయ్యోర్లు.. అక్రమార్కులు
Published Sat, Feb 8 2014 3:44 AM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM
Advertisement
Advertisement