ఐసీడబ్ల్యూఏలో మెరిసిన తెలుగు తేజాలు
- ఆలిండియా స్థాయిలో ప్రథమ, ద్వితీయసహా పలు ర్యాంకులు
- ఇప్పటి వరకూ 50 ఆలిండియా ఫస్ట్ ర్యాంకులతో ‘సూపర్‌విజ్’ రికార్డు
విజయవాడ(లబ్బీపేట): ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా బుధవారం విడుదల చేసిన ఐసీడబ్ల్యూఏ(సీఎంఏ) ఫైనల్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన ఉడతా వెంకటసాయికిరణ్ ఆలిండియా స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించగా, వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన మసాల వెంకట సాయిచరణ్ ద్వితీయ ర్యాంకుతో మెరిశాడు. రాయదుర్గానికి చెందిన ఎట్టాకుల వాసవీప్రియ నాలుగో ర్యాంక్, విజయవాడ మొగల్రాజపురానికి చెందిన వావిలాల అనూష ఐదో ర్యాంక్, తాండూర్‌కు చెందిన తిరుపతి ధరణి ఏడో ర్యాంక్ సాధించి సత్తా చాటారు.
వీరంతా విజయవాడలోని సూపర్‌విజ్‌లో శిక్షణ పొందినవారే. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సూపర్‌విజ్ ప్రిన్సిపాల్ సబ్బినేని వెంకటేశ్వరరావు అభినందనలు తెలిపారు. ఈ ఫలితాల్లో తమ విద్యార్థులు 50లోపు 14 ర్యాంకులు సాధించినట్లు ఆయన తెలిపారు. వినూత్న కోచింగ్ విధానంతో ఎందరో విద్యార్థుల్ని అఖిల భారత స్థాయిలో ర్యాంకర్లుగా తీర్చిదిద్దామని చెప్పారు. సూపర్‌విజ్ సంస్థ బుధవారం సాధించిన ఐసీడబ్ల్యూఏ ఫైనల్ ఫస్ట్ ర్యాంక్‌తో ఇప్పటివరకూ కామర్స్ కోర్సుల్లో ఆలిండియా ఫస్ట్‌ర్యాంకులు 50 సాధించినట్లు ఆయన తెలిపారు. దేశంలోని ఏ సంస్థకు ఇన్ని ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు రాలేదని, ఇదొక రికార్డని పేర్కొన్నారు. ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు 50 సాధించడాన్ని పురస్కరించుకుని 2017 ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే సీఏ ఫైనల్ కోర్సుకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
మాస్టర్‌మైండ్స్ విజయదుందుభి..
గుంటూరు ఈస్ట్: 2016 జూన్‌లో నిర్వహించిన సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్ పరీక్షా ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్ విద్యార్థులు విజయదుందుభి మోగించారని సంస్థ డెరైక్టర్ మట్టుపల్లి ప్రకాష్ తెలిపారు. గుంటూరు బ్రాడీపేట 4/12లోని సరస్వతి క్యాంపస్‌లో ఆయన బుధవారం మాట్లాడుతూ ఐసీఏఐ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయని, ఇంటర్‌లో మొత్తం 50 ర్యాంకులకుగాను మాస్టర్‌మైండ్స్ విద్యార్థులు 44 ర్యాంకులు సాధించి సత్తా చాటారని తెలిపారు. 40 ర్యాంకులు సాధించడం ఇది మూడోసారన్నారు. సీఎంఏ ఫైనల్‌లో తమ విద్యార్థులు 13 ర్యాంకులు సాధించారన్నారు. సంస్థ పాఠ్యప్రణాళిక, ఉపాధ్యాయులు, విద్యార్థుల సమష్టి కృషివల్లే ర్యాంకులు సాధించామన్నారు.
సంతోషంగా ఉంది...
సీఏ ఫైనల్ పూర్తవడంతో ఇప్పటికే లుపిన్ కంపెనీలో రూ.9 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం చేస్తున్నా. ఐసీడబ్ల్యూఏలో ఆలిండి యా ఫస్ట్‌ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఫౌండేషన్‌లోనూ ఫస్ట్ ర్యాంక్ సాధించా. నా తల్లిదండ్రులు చిల్లర దుకాణం నిర్వహిస్తూ కష్టమంటే ఏమిటో తెలియకుండా నన్ను చదివించారు. వారి కష్టానికి ప్రతిఫలంగా ర్యాంక్ సాధించా. అందుకు సూపర్‌విజ్ టెక్నిక్స్ ఎంతగానో దోహదం చేశాయి.
- వెంకటసాయికిరణ్, ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్
పారిశ్రామికవేత్తనవుతా
మంచి ఇండస్ట్రియలిస్టుగా ఎదగాలనేది నాలక్ష్యం. ప్రస్తు తం ఐసీడబ్ల్యూఏ ఆలిండి యా రెండో ర్యాంక్ సాధిం చా. ఈ ఏడాది నవంబర్‌లో సీఏ ఫైనల్స్‌కు హాజరవుతా. అనంతరం మంచి కంపెనీలో కొద్దికాలం ఉద్యోగం చేస్తా. నా తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులు తీరాక ఎంబీఏ చేసి మంచి కంపెనీ స్థాపించి ఇండస్ట్రియలిస్టుగా ఎదగాలనేది కోరిక. ఆ లక్ష్యం నెరవేరేవరకూ కృషిచేస్తా.
- మసాల వెంకటసాయిచరణ్ ఆలిండియా రెండో ర్యాంకర్