విజయనగరంలోని పెద్ద చెరువు గట్టుపై శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తున్న హిజ్రాలు
విజయనగరం మున్సిపాలిటీ : సమాజమంతా వారిని చిన్న చూపు చూస్తుంది. తమ పక్కన చోటివ్వటానికి సందేహిస్తుంది. తమలో భాగంగా చూడటానికి తటపటాయిస్తుంది. కానీ వారు మాత్రం అధైర్యానికి చోటివ్వకుండా తాము అందరి లాంటి వాళ్లమేనని, తమకూ మంచి మనసుందని నిరూపించుకుంటున్నారు పట్టణానికి చెందిన పలువురు హిజ్రాలు. వీరు ఏర్పాటు చేసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే సమాజం మెచ్చే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
వారు రోజంతా పలు ప్రాంతాల్లో యాచించి తెచ్చే ధనంలో అర్ధభాగాన్ని సమాజ సేవకు కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా లోక కల్యాణార్ధం హిజ్రాల ఇలవేల్పు మురిగిమాత పూజామహోత్సవాలను మంగళవారం నుంచి మూడు రోజుల పాటు విజయనగరం పట్టణంలో నిర్వహిస్తుండగా... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన హిజ్రాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం స్థానిక ఎన్‌సీఎస్ రోడ్డులో గల పెద్ద చెరువు గట్టుపై శివపార్వతుల కల్యాణం నిర్వహించారు.
సంప్రదాయ బద్ధంగా వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ సాగిన కార్యక్రమంలో హిజ్రాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ కార్యదర్శి స్రవంతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండబాబు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
వీటిని సాధారణ మానవులు ఆచరించే విధంగా శాస్త్రోక్తంగా చేస్తామన్నారు. బుధవారం బాబామెట్ట ఖాదర్‌వలీబాబా దర్గాలో పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం ఉత్తరా>ంధ్రుల ఇలవేల్పు పైడితల్లమ్మవారికి పసుపు కుంకుమలు చెల్లించి పూజలు చేయనున్నామన్నారు. కార్యక్రమంలో విశాఖ, విజయవాడ, తదితర ప్రాంతాలకు చెందిన హిజ్రాలు పదుల సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment