సాక్షి, రాజమండ్రి :
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల సంక్షేమం కోసం అమలుచేసిన ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడిచేందుకు సర్కారు సిద్ధమవుతోంది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించి, వాడకంపై పరిమితులు విధిం చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల వినియోగాన్ని ముందే అంచనా వేయనున్న ప్రభుత్వం ఆంక్షలు విధించడం ద్వారా అధిక విని యోగానికి చార్జీలు వసూలు చేసే ఆలో చనలో ఉందని తెలుస్తోంది. ఇప్పటికే నానా ఇబ్బందులతో సతమతం అవుతున్న రైతాం గానికి ఇది పిడుగుపాటు కానుంది.
ఉచిత విద్యుత్ పథకానికి పూర్తిస్థాయిలో తూట్లు పొడిచి, రైతు నడ్డి విరిచేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇప్పటికే నష్టాల పేరిట ఏడాదికి ఒకసారి కరెంటు చార్జీలు వసూలు చేస్తున్న విద్యుత్తు సంస్థలు రైతుకు ఇచ్చే ఉచిత విద్యుత్తును కూడా భారంగా భావిస్తున్నాయి. దీంతో మీటర్లతో ఈ ప్రక్రియను ప్రారంభించి నొప్పి లేకుండా చార్జీల వాత పెట్టాలని కిరణ్ సర్కారు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశాన్ని అధికారులు కూడా కొట్టిపారేయడంలేదు. మీటర్ల బిగింపు అంటే మెట్ట రైతు మెడకు కత్తి కట్టడమేనని రైతాంగం భావిస్తోంది. జిల్లాలోని చాలాప్రాంతాల్లో రోజులో కనీసం మూడు గంటలు నిరాటంకంగా కరెంట్ సరఫరా చేయలేని పరిస్థితి ఉంది.
ఉచితవిద్యుత్ అనే ఆసరా ఉన్నప్పటికీ అది పంటల కాలంలో రైతుకు పూర్తిగా కలసిరావడంలేదు. అర్ధరాత్రి వేళల్లో పొలాల్లో జాగారం చేస్తూ, కరెంట్ వచ్చినపుడు పొలం తడుపుకోవలసిన దుస్థితిలో రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ దశలో వాడిన కరెంటుకు కొలమానాలు బిగించాలన్న నిర్ణయం రైతుకు కొత్త సమస్యలు తేనుంది. జిల్లాలో సుమారు 3.25 లక్షల ఎకరాల మెట్ట ప్రాంతంలో రైతాంగం సాగు చేస్తోంది. ఇందులో 90 వేల ఎకరాల్లో నీటి కుంటలు, చెరువుల ఆధారంగా వ్యవసాయం సాగుతుంటే, మరో 60 వేల ఎకరాల్లో వర్షాధార వ్యవసాయం సాగుతోంది. ఇక మిగిలిన 1.75 లక్షల ఎకరాల్లో రైతులు విద్యుత్తు మోటార్లపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్నారు. కరెంటుపై ఆధారపడుతున్న ఈ రైతులనే ప్రస్తుతం విద్యుత్తు శాఖ లక్ష్యంగా చేసుకుంది.
నగదు బదిలీ కోసమేనా?
అన్ని సబ్సిడీ పథకాలను ప్రభుత్వం ఆధార్‌కు అనుసంధానం చేసి సబ్సిడీని బ్యాంకు అక్కౌంట్‌లో జమ చేస్తున్న విషయం విదితమే. ఇపుడు రైతుకు విద్యుత్‌పై ఇస్తున్న రాయితీని కూడా అలాగే నగదు బదిలీ ద్వారా అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే అనుమానం వ్యక్తం అవుతోంది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు తొలుత మీటర్లు బిగించి, వాటి మేరకు బిల్లు జారీ చేసి అణాపైసలతో సహా ముందుగానే వసూలు చేయాలని, ఆతర్వాత ఆ సొమ్మును బ్యాంకు అకౌంట్‌కు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇదే అమలులోకి తమకు తీవ్ర ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సగం కనెక్షన్లకు మీటర్లు బిగించేశారు...
జిల్లాలో మొత్తం 41,000 వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. ఇవి నెలకు నాలుగు మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తున్నాయి. జిల్లా మొత్తం విద్యుత్ వినియోగంలో ఇది ఐదు శాతం కన్నా తక్కువే. కానీ ఈ వర్గాలను కూడా వదలకుండా కరెంటు ఛార్జీలు వసులు చేయాలన్న వ్యూహాన్ని ప్రభుత్వం అంచెల వారీగా అమలు చేస్తోంది. ఇప్పటికే సుమారు 21,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించారు. దీనిపై ఈపీడీసీఎల్ రాజమండ్రి సర్కిల్ సూపరెంటెండెంట్ ఇంజనీరు వైఎస్‌ఎన్ ప్రసాద్‌ను న్యూస్‌లైన్ వివరణ కోరగా ఇది కేవలం వినియోగాన్ని మదింపు చేసేందుకు మాత్రమేనని చెప్పారు. వ్యవసాయ విద్యుత్‌కు సంబంధించి చార్జీలు వసూలు చేయాలని ఇంతవరకూ తమకు ఎటువంటి ఆదేశాలూ లేవని ఆయన తెలిపారు.
అన్నదాతకు కొత్త షాక్
Published Sat, Dec 7 2013 3:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement