ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేసిన మతిస్థిమితంలేని వ్యక్తి
అధికారుల అలసత్వంతో భారీగా నీరు వృథా
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్(మంగళగిరి): నీటిపారుదల అధికారుల పర్య వేక్షణలో ఉండాల్సిన ప్రకాశం బ్యారేజ్ ఓ మతిస్థిమితం లేని వ్యక్తి కంట్రోల్‌లోకి వెళ్లిన ఘటన కలకలం రేపింది. అధికారులు, సిబ్బంది అలసత్వం వల్ల 1,500 నుంచి 2,000 క్యూసెక్కుల నీరు వృథా అయ్యింది. మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో బ్యారేజ్ నుంచి నీరు ఒక్కసారిగా విడుదలై దిగువకు ప్రవహించటం మొదలెట్టింది.
సమాచారం అందుకున్న నీటిపారుదల అధికారులు హుటాహుటిన బ్యారేజ్ వద్దకు చేరుకుని పరిశీలించగా, మతిస్థిమితంలేని ఓ వ్యక్తి గేట్‌లు ఓపెన్ అయ్యే స్విచ్‌లు ఆన్ చేసుకుంటూ వెళుతున్నాడు. జనరేటర్ రూం ఉద్యోగులు ఆ వ్యక్తిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. అనంతరం గేట్లను కిందకు దింపారు. బ్యారేజీలో నీరు ఒక్కసారిగా విడుదల కావడంతో కృష్ణా దిగువ ప్రాంతంలో యాప్రాన్ పనులు చేస్తున్న కూలీలు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది పరుగులు తీయగా మరికొందరు దగ్గర్లోని పొక్లెయిన్లపై, కరెంట్ దిమ్మల మీద ఎక్కి ప్రాణ భయంతో కేకలు వేశారు. పోలీసులు మతిస్థిమితంలేని వ్యక్తిని విచారించగా, పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువుకి చెందిన ముర్రపోకల బంగార్రాజుగా తేలింది.