కేవీబీపురం: గ్రామంలో బెల్టుషాపు వద్దన్నందు కు ఓ కుటుంబాన్ని వెలివేశారు ఆ ఊరిపెద్దలు. కేవీబీ పురం మండలంలోని అంజూరుపాళెంలో ఈ సాంఘిక దురాచారం చోటు చేసుకుంది. బాధితుడు ఎన్ షణ్ముగం కథనం మేరకు ఈ సంఘటన వివరాల్లోకి వెళితే...
అంజూరుపాళెం గ్రామంలో ప్రతి ఏటా గంగమ్మకు జాతర చేస్తారు. గతేడాది గ్రామం లో బెల్టు షాపు నిర్వహణకు వేలం పాడారు. షాపు నిర్వహించడానికి షణ్ముగం కుటుంబ సభ్యులు వ్యతిరేకత తెలిపారు. అయితే అదేవిధంగా ఈ ఏడాది కూడా వేలం నిర్వహించారు.
యథాతథంగా ఈసారి కూడా వ్యతిరేకించారు. దీంతో గ్రామపెద్దలు నెంబలి వెంకట కృష్ణయ్య, నెంబలి పచ్చయ్య, అత్తింజేరి రామచంద్రయ్య, నంబాకం వెంకటేశులు, కే. వేమయ్య ఆ కుటుంబాన్ని వెలివేసినట్లు దండోరా వేయించారు. ఆ కుటుంబానికి నీళ్లు, ఇతర సౌకర్యాలు కల్పించకూడదని గ్రామకట్టుబాటు విధించారు. జాతరకు ఆ ఇంటి నుంచి నైవేద్యం, ఇతర కానుకలు, చందాలు తీసుకోరాదని నిర్ణయించారు.
ఆ కుటుంబసభ్యులతో గ్రామస్తులు మాట్లాడినా, వారి ఇంటికి వెళ్లినా... వారికి కూడా గ్రామబహిష్కరణ తప్పదని హెచ్చరించారు. సోమవారం బాధితుడు షణ్ముగం ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది సాంఘిక దురాచారమని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. గ్రామ పెద్దలపై సాంఘిక దురాచార చట్టం కింద కేసులు నమోదు చేశారు.
బెల్టు షాపు వద్దన్నందుకు కుటుంబం వెలి
Published Tue, Jul 29 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM
Advertisement