కర్నూలు సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో వృథాగా పడి ఉన్న నాణ్యతలేని ఇన్సులిన్ ఇంజెక్షన్లు
గత ప్రభుత్వ హయాంలో కమీషన్లకు కక్కుర్తి పడి వ్యాపార సంస్థలతో ఇష్టారాజ్యంగా ఒప్పందాలు చేసుకున్నారు. ఆ సంస్థలు నాణ్యతలేని మందులు సరఫరా చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఇన్సులిన్ విషయంలోనూ ఇదే జరిగింది. శ్రేయా లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ అనే సంస్థ సరఫరా చేసిన ఇన్సులిన్‌లో నాణ్యత కొరవడింది. ఇదే విషయం ల్యాబ్ పరీక్షల్లోనూ తేలడంతో వాటిని వాడకుండా మూలనపడేశారు. ఈ కారణంగా వేలాది మంది మధుమేహ (షుగర్) రోగులు ఇబ్బంది పడుతున్నారు.
సాక్షి, కర్నూలు: జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఒక ఏరియా ఆసుపత్రి, ఒక జిల్లా ఆసుపత్రి, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఉన్నాయి. ఈ ఆసుపత్రులకు కర్నూలులోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్‌ఐడీసీ) సెంట్రల్ డ్రగ్ స్టోర్ ద్వారా మందులు సరఫరా అవుతున్నాయి. ఆసుపత్రుల్లో అవసరాలను బట్టి మందుల ఇండెంట్‌ను ఏపీఎంఎస్‌ఐడీసీ స్టోర్‌కు పంపుతారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం నుంచి ఆయా ఆసుపత్రుల అవసరాలకు అనుగుణంగా మందులు, సర్జికల్స్ సరఫరా అవుతాయి. వీటిని కర్నూలులోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ప్రత్యేక వాహనం ద్వారా ఆయా ఆసుపత్రులకు సరఫరా చేస్తారు. కాగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భారీగా కమీషన్లు తీసుకుని.. అవసరం లేకపోయినా అధిక శాతం మందులు కొనుగోలు చేసి పంపించారు. 2014లో ఒకేసారి మూడింతల మందులు, సర్జికల్స్ అధికంగా కొనుగోలు చేశారు. అలా అధికంగా వచ్చిన మందులు, సర్జికల్స్ మూడేళ్ల వరకు ఉండి, ఆ తర్వాత కాలం తీరిపోయాయి. జిల్లాలో రూ.4కోట్లకు పైగా విలువైన మందులు కాలం తీరి ఎందుకూ పనికిరాకుండా పోయాయి.
ఇన్సులిన్ కొరత పాపం గత పాలకులదే
ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్సులిన్ ఇంజక్షన్ల కొరత వేధిస్తోంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇన్సులిన్ నిండుకుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మాత్రమే ఆసుపత్రి అభివృద్ధి నిధుల నుంచి ఇన్సులిన్‌ను బయట కొనుగోలు చేసి రోగులకు ఇస్తున్నారు. అది కూడా పరిమితంగా ఇస్తుండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గత పాలకులు భారీగా కమీషన్లు దండుకుని నాణ్యతలేని మందులు, సర్జికల్స్ సరఫరాకు కారణమయ్యారన్న విమర్శలున్నాయి. గతంలో పలుమార్లు బీపీ, షుగర్, ఇతర మందులు నాణ్యతలేవని ల్యాబొరేటరీలు నివేదికలు వచ్చాయి. ప్రస్తుతం వాటి సరసన ఇన్సులిన్ కూడా చేరింది.
35వేల వాయిల్స్ వృథా
కర్నూలులోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు 2018 ఏప్రిల్‌లో 9వేలు (బ్యాచ్ నెం.ఎస్‌ఏ1840016), ఈ ఏడాది జూన్‌లో 26వేల (బ్యాచ్ నెంబర్లు ఎస్‌ఏ1940035, ఎస్‌ఏ1940057) ఇన్సులిన్ ఇంజెక్షన్లను శ్రేయా లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ సరఫరా చేసింది. సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌కు వచ్చిన వీటిని యధాలాపంగా నాణ్యత పరీక్ష కోసం హైదరాబాద్‌లోని ల్యాబొరేటరీకి పంపించారు. అక్కడి నుంచి వచ్చిన నివేదికలో ఇన్సులిన్‌లో నాణ్యత లేదని పేర్కొన్నారు. దీంతో ఇన్సులిన్‌ను ఆసుపత్రులకు సరఫరా చేయకుండా స్టోర్‌లోనే ఉంచేశారు.
షుగర్ రోగులకు ఇబ్బందులు
ఒకేసారి 35వేల వాయిల్స్ ఇన్సులిన్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రుల్లో తీవ్ర కొరత ఏర్పడింది. దీనివల్ల షుగర్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి షుగర్ రోగి ప్రతి నెలా వేసుకునే డోసును బట్టి 4 నుంచి 6 ఇన్సులిన్ వాయిల్స్ వాడాల్సి ఉంటుంది. వీటిని బయట కొనుగోలు చేయాల్సి వస్తే రూ.600 నుంచి రూ.900 దాకా ఖర్చవుతుంది. చాలా మంది రోగులకు ఇన్సులిన్ వేసుకుంటేనే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. మాత్రలకు లొంగకపోవడంతో అప్పు చేసి మరీ ఇన్సులిన్ కొనుగోలు చేసి వేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment