గుంతకల్లు, న్యూస్‌లైన్: రైల్వేలో ఆర్థిక సంస్కరణల పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయనే దానికి వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలు బలం చేకూరుస్తున్నాయి. మిగులుబాటు, ఆదాయ ఆర్జన పేరుతో రైల్వే శాఖలో స్కిల్డ్ కార్మికుల పోస్టుల సంఖ్య తగ్గిస్తున్నారు. అదే సమయంలో రైళ్ల సంఖ్యను భారీగా పెంచుతున్నారు. పెరిగిన రైళ్ల సంఖ్య, కోచ్‌ల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని పెంచకపోగా వాటి నిర్వహణను ఔట్‌సోర్సింగ్ పేరుతోప్రైవేటు వారికి అప్పగిస్తున్నారు. ముఖ్యంగా ట్రైన్ లైటింగ్, ఏసీ కోచ్‌ల నిర్వహణ లాంటి కీలక విభాగాలను ప్రైవేటుకు అప్పచెబుతున్నారు.
దీనికి తోడు రైల్వే అధికారుల్లో అవినీతి పెచ్చుమీరుతుండడంతో ప్రైవేటు కాంట్రాక్టర్లు రైళ్ల నిర్వహణ విషయంలో బాధ్యతగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రైళ్లు, కోచ్‌లు రెగ్యులర్‌గా నిర్వహణకు నోచుకోవడం లేదు. రైల్వేలో కేవలం నిర్వహణలోపం, మానవతప్పిదాల వల్ల సగటున వారానికి ఒక ప్రమాదం చోటు చేసుకుంటున్నట్లు రైల్వే రికార్డులు వెల్లడిస్తున్నాయి. రెండు మూడు నెలలకో ప్రమాదంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాతపడుతున్నారు.
పీరియాడికల్ చెకప్ ఏదీ ?
ట్రైన్ ఫార్మేషన్ కానీ, గూడ్స్ ట్రైన్ రేక్ కానీ డిపోలకు వెళ్లగానే ఒక వారం పాటు క్షుణ్ణంగా పరిశీలించి, రైల్వే నిర్దేశించిన 25 అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఒక్కో కోచ్‌కు ఒక లాగ్‌బుక్ మెయింటెన్ చేయాలి. సమస్యలు ఉంటే అందులో నమోదు చేయాలి. పాత కోచ్‌లైతే వాటి లైఫ్ సర్టిఫికెట్లు పరిశీలించాలి. పీరియాడికల్ ఓవరాలింగ్ చేయాల్సి ఉందా? లేదా? చెక్ చేయాలి. టెక్నీషియన్లు కోచ్‌ల చక్రాలు, బ్రేక్ బ్లాక్‌లను చూడాలి. చక్రాల పరిమాణాన్ని చెక్ చేయాలి. కోచ్ చక్రాల్లో ఏవైనా 10 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ అరుగుదల ఉంటే వెంటనే వాటిని మార్చాలి.
చక్రాల వద్ద ఉంటే కప్పుల్లో ఆయిల్‌ను చూసుకోవాలి. ఎలక్ట్రికల్ విభాగం కార్మికులు పవర్ ఉందా? లేదా? బ్యాటరీల పరిస్థితి ఏమిటి? ఫ్యాన్లు తిరుగుతున్నాయా? లేదా? పరిశీలించాలి. ఏసీ మెకానిక్‌లు కూడా ఏసీ పరికరాలను, వైరింగ్‌ను చెక్ చేయాలి. ఈ పనులన్నీ కోచింగ్ డిపోలో సీఅండ్‌డబ్ల్యూ, ఎలక్ట్రిక్, ఏసీ విభాగం సెక్షన్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో సూపర్‌వైజర్ల పర్యవేక్షణలో నిర్ణీత కాలంలోనే చేయాలి. అయితే మానవ వనరుల కొరత పేరుతో ఈ పని సక్రమంగా జరగడం లేదు.
రైలింజన్ల నిర్వహణ మరీ దారుణం.. గతంలో రైలింజన్(లోకో)లను 15 రోజులకు ఒక పర్యాయం షెడ్డుకు తీసుకువచ్చి ప్రతి పార్టును 48 గంటల పాటు క్షుణ్ణంగా పరిశీలించి, ఎక్కడైనా మరమ్మతులు అవసరమైతే చేసి పంపేవారు. అయితే లోకోల టెక్నాలజీల అప్‌గ్రెడేషన్ అంటూ కారణం చూపి లోకోల పీరియాడికల్ చెకప్‌ను 30 రోజులకు పెంచారు. రైళ్ల సంఖ్యను పెంచడంతో లోకోల సంఖ్య భారీగా పెరిగిపోయింది. కానీ సిబ్బంది సంఖ్య పెరగలేదు. దీంతో ఒక రైలింజన్ పట్టాల మీద పరుగులు తీయడం ప్రారంభించిన తర్వాత నిర్వహణ కోసం షెడ్డుకు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి.
దీంతో రైలింజన్లు మార్గం మధ్యలో మొరాయించడం బాగా పెరిగింది. ఇందుకు బెంగళూరు నగరమే ఉదాహరణ. బెంగళూరు నగరానికి ప్రతి రోజూ వందకుపైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇందులో 30 నుంచి 40 రైళ్లకు బెంగళూరు కోచింగ్ డిపోలో చెక్ చేయాలి. అన్ని ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను చెక్ చేయడం కష్టం. పైగా అతంతమాత్రంగా ఉన్న సిబ్బందితోనే తూతూ మంత్రంగా తనిఖీ కానిచ్చేస్తుండడంతో ఆయా రైళ్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయని రైల్వేలోని కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ సిద్ధాంతాలు రైల్వేకు పనికిరావు
భారతీయ రైల్వేకు విదేశీ పద్దతులు, సంస్కరణలు, రాజకీయ సిద్ధాంతాలు ఏ మాత్రం సరికాదని దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్ మాజీ కార్యదర్శి సుబ్బనర్సయ్య అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులు ఖర్చుల గురించి ఆలోచిస్తూ సంస్కరణల పేరుతో రైల్వేను పరోక్షంగా దెబ్బతీస్తూ మనుషుల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారని మండిపడ్డారు. ఆధునిక పరిజ్ఞానానికి అనుగుణంగా నిపుణులైన పనివారిని నియమించడం లేదన్నారు. నిర్వహణ ప్రైవేట్ వారికి వదిలేయడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. - సుబ్బనర్సయ్య, దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్ మాజీ కార్యదర్శి.
కొంప ముంచుతున్న నిపుణుల కొరత
Published Tue, Dec 31 2013 3:40 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement