వాకాడు : నైపుణ్యాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఐటీఐలు సర్టిఫికెట్ల పరిశ్రమల్లా మారుతున్నాయి. జిల్లాలో ఏడు ప్రభుత్వ , 30కు పైగా ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 78 ప్రభుత్వ, 418 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. వీటి నుంచి ఏటా లక్ష మందికిపైగా విద్యార్థులు బయటకు వస్తున్నారు. ఐటీఐల్లో పిట్టర్, మోటార్ మెకానిక్, ఎలక్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, కోపా, వంటి వివిధ ట్రేడుల్లో శిక్షణ అందిస్తారు. అయితే బోధనా సిబ్బంది కొరతతో కోర్సులు మొక్కుబడిగా మారుతున్నాయి. 80 శాతం హాజరు ఉంటేనే విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలి.
కానీ కొన్ని ప్రైవేట్ సంస్థల్లో అసలు విద్యార్థులు శిక్షణ తరగతులకు హాజరుకాకున్నా, వారి స్టైఫండ్, కొంత నగదు తీసుకుని హాజరువేసి పాస్ చేస్తున్నారు. విద్యార్థులు ప్రాక్టికల్‌గా నేర్చుకుంటేనే సంబంధిత విభాగాల్లో సమర్థవంతంగా పనిచేయగలుగుతారన్న అంశాన్ని అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో ఐటీఐ సర్టిఫికెట్ పొందిన విద్యార్థులు ఉద్యోగాలకు వెళ్లే సరికి నైపుణ్యాలేమితో వెనకబడిపోతున్నారు.
కొరవడిన ఆర్‌జేడీల పర్యవేక్షణ
ఐటీఐలపై ఆర్‌జేడీల పర్యవేక్షణ కొరవడింది. ఐటీఐల పర్యవేక్షణకు తిరుపతి, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నంలో నలుగురు ఆర్‌జేడీలు ఉన్నారు. ఏటా వీరు ఐటీఐలను రెండు సార్లు పరిశీలించాల్సి ఉంది. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి తగిన పరికరాలు, స్థలం అన్ని ప్రమాణాల మేర ఉన్నాయో లేదో పరిశీలించాలి. సంస్థల్లో విద్యుత్ వాడకాన్ని పరిశీలించినా విద్యార్థులకు శిక్షణ ఏ మేరకు ఇస్తున్నారో తేలిపోతుంది.
ఐటీఐల్లో ప్రవేశాలు, రికార్డుల నిర్వాహణ, విద్యార్థుల హాజరు, ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు, నిబంధనల మేర ప్రాక్టికల్స్ చేయిస్తున్నారా..అన్న అంశాలను ఆర్‌జేడీలు పరిశీలించాల్సి ఉంది. అయితే వీరు కుర్చీలకే పరిమితమై తనిఖీలు చేసినట్లు సంతకాలు చేస్తుండడంతో అవతవకలకు ఆస్కారం ఏర్పడుతోంది.
వాకాడులో బోధనా సిబ్బంది కొరత
వాకాడు ఐటీఐలో మూడేళ్లుగా 9 మంది బోధన సిబ్బందికి గానూ ఒక్కరు లేకపోవడం విశేషం. ఇక్కడ 120 సీట్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం 80 శాతం మేర సీట్లు బర్తీ అయ్యాయి. బోధనా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు చేరేందుకు వెనుకడుగు వేస్తున్నారు. కొందరు చేరినా తమ టీసీలను వెనక్కితీసుకుని వెళుతున్నారు. బోధనా సిబ్బంది నియామకానికి సం బంధించి ప్రభుత్వానికి తరచూ ప్రతిపాదనలు పంపుతున్నా పట్టించుకోకపోవ డం దారుణం. ఐటీఐలో పరికరాలు, గదులు కొరత లే నప్పటికీ బోధనా సి బ్బంది లేకపోవడం అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా మారింది.
శిక్షకులు లేక మానుకున్నా
వాకాడు ఐటీఐలో ఇన్‌స్ట్రుమెంట్ మెకానికల్ ట్రేడ్‌లో చేరా. రెండు నెలలు రోజూ కోట నుంచి చార్జీలు పెట్టుకుని వెళ్లిన కళాశాలలో శిక్షణ ఇచ్చే వారు లేకపోవడంతో ఏమి నేర్చుకోలేదు. శిక్షకుల విషయం అడిగితే రోజూ హాజరు వేసుకుంటే చాలు సర్టిఫికెట్ ఇస్తామన్నారు. దీంతో ఏడాది వృథా అయినా ప్రయోజనం లేదని మానుకున్నాను.
- చైతన్య, విద్యార్థి, కోట
సర్టిఫికెట్ల పరిశ్రమలుగా ఐటీఐలు
Published Wed, Mar 16 2016 3:16 AM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM
Advertisement
Advertisement