సాక్షి ప్రతినిధి, కడప: అనైతిక చర్యలైనా, నిబంధనలకు విరుద్ధమైనా తాము చెప్పిందే చేయాలనే తత్వాన్ని తెలుగుదేశాధీశులు వంటబట్టించుకుంటున్నారు. కంటికి రెప్పచాటుగా అధికారపార్టీకి అండగా ఉంటామంటే, కాదు కూడదు, బహిరంగంగా... ఏకపక్షంగా నిలిచినోళ్లే జిల్లాలో ఉండాలని కొత్త భాష్యం పలుకుతున్నారు. జిల్లాలో ప్రజాబలం లేకపోయినా అధికారం అండతో తెలుగుదేశం పార్టీకి అగ్రపీఠం వేయాలనే తలంపుతో వ్యవహరిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే కడప సీఎంగా చెప్పుబడుతున్న వ్యక్తి అధికార దర్పం చూపెడుతున్నారు.
జిల్లాలో జమ్మలమడుగు మున్సిపల్ ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ పూర్తి అప్రజాస్వామ్యకంగా వ్యవహరించింది, అందుకు అధికార యంత్రాంగం వంతపాడింది. చైర్మన్ ఎన్నికల్లో 50శాతం కోరం ఉంటే ఎన్నికలు నిర్వహించాలని నిబంధనలు వివరిస్తున్నాయి. ఒక సభ్యుడు గైర్హాజర్ అయిన కారణంగా చైర్మన్ ఎన్నికలను 3వతేదీన వాయిదా వేశారు.
4వతేదీ ఎటుతిరిగి ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు నమ్మబలికారు. అయితే ఎన్నికల సంఘం జమ్మలమడుగు మున్సిఫల్‌చైర్మన్ ఎన్నికను నిర్వహించాలని ఓవైపు ఆదేశిస్తున్నా, మరోవైపు జిల్లా యంత్రాంగం తెలుగుదేశం పార్టీకి పూర్తిగా సహకారం అందించింది. తెరపైకి జమ్మలమడుగు ఆర్డీఓ రఘునాథరెడ్డి కన్పించినా తెరవెనుక ఉన్నత స్థాయి యంత్రాంగం వ్యూహాత్మకంగా పావులు కదిపారు. రెండు రోజులపాటు హైడ్రామా నడిపి చైర్మన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అవకాశం లేకుండా చేసినందుకు తెలుగుతమ్ముళ్లు అధికార యంత్రాంగాన్ని మెచ్చుకున్నట్లు సమాచారం.
జెడ్పీ చైర్మన్ టీడీపీకి దక్కకపోవడంతో....
జిల్లా పరిషత్‌లో వైఎస్సార్‌సీపీకి 39 మంది సభ్యుల బలం ఉంటే, తెలుగుదేశం పార్టీకి 11మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ జెడ్పీ పీఠం తమదేనని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రకటించుకున్నారు. ఏకంగా మీడియా సమావేశంలో ఆపార్టీ ఎంపీ రమేష్‌నాయుడు కోతలు కోశారు. జెడ్పీ చైర్మన్‌ను దక్కించుకోవాలనే తలంపు ఆయనలో మెండుగా ఉన్నట్లు సమాచారం. బహిరంగంగా వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలతో మంతనాలు నిర్వహిస్తూ ప్రలోభాలకు గురిచేశారు.
మరికొంత మందిపై బెదిరింపులకు దిగారు. ఎన్నియుక్తులు పన్నినప్పటికీ చైర్మన్ ఎన్నికల గడువు నాటికి తెలుగుదేశం పార్టీకి ఆశించిన మద్దతు దక్కలేదు.
అధికారం అండతో చైర్మన్ ఎన్నికలే నిర్వహించకూడదని భావించినట్లు సమాచారం. ఆమేరకు కడప సీఎంగా చెప్పబడుతున్న ఓనాయకుడు జెడ్పీ చైర్మన్ ఎన్నికల్ని జమ్మలమడుగు తరహాలో వాయిదా వేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. జమ్మలమడుగు ఆర్డీఓ తరహాలో ఛైర్మన్ ఎన్నికలు నిర్వహించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి వాయిదా వేయాలని, వైఎస్సార్‌సీపీకి ఆపీఠం ఎలాంటి పరిస్థితుల్లో దక్కరాదని హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది.
అప్పటికే 39 మంది వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు, కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి తోపాటు, 8మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి జెడ్పీ సమావేశ మందిరంలో ఉన్నారు. ఆపరిస్థితుల్లో ఎన్నిక వాయిదాకు గట్టిగా ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేమని తెలపడంతో తెలుగుతమ్ముళ్లుకు తీవ్ర ఆగ్రహాం తెప్పించినట్లు సమాచారం. ఆమేరకు సరిగ్గా మూడు రోజులకే జిల్లా కలెక్టర్ బదిలీ ఉత్తర్వులొచ్చాయి. అధికార దర్పానికి తలొగ్గి, అప్రజాస్వామ్యకంగా వ్యవహరించలేదన్న ఏకైక కారణంతోనే బదిలీ చేయించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
జీ హుజూర్... అధికారుల కోసం....
కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ ద్వయం జిల్లా ప్రజానీకం మెప్పుపొందారు. సర్పంచ్ ఎన్నికలు మొదలుకొని, సార్వత్రిక ఎన్నికల వరకూ ఎలాంటి హింసాత్మక ఘటనలు తలెత్తకుండా ప్రశాంతంగా నిర్వహించారు. కడపజిల్లా అంటేనే ఎన్నికల్లో బాంబులు రాజ్యమేలుతాయన్న విమర్శకులనోర్లు మూయించారు. ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుత ఓటింగ్‌కు ఆస్కారం కల్పించారు. జిల్లా టీం సమన్వయం కారణంగా ఎన్నికల్లో సమూల మార్పుకు శ్రీకారం చుట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీకి ఏకపక్షంగా నిలవలేదనే కారణంగా జిల్లా కలెక్టర్‌కు బదిలీ బహుమానంగా ఇచ్చారు. జిల్లా ఉన్నతాధికారులు జీ..హుజూర్ అంటుంటే క్రింది స్థాయి అధికారులతో బెడద ఉండదనే తలంపుతో తెలుగుతమ్ముళ్లు ఉన్నట్లు సమాచారం. ఆమేరకు తర్వాత చూపు జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ పట్లే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుబాస్‌గా చెప్పింది తుచ తప్పకుండా చేసిపెట్టే అధికారి కోసం టీడీపీ నేతలు అన్వేషణ చేస్తున్నట్లు సమాచారం. సమర్థత కంటే అధికారపార్టీకి కాపలాగా ఉండే అధికారుల కోసం ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కడప సీఎంగా చెప్పుకుంటున్న నాయకుడు తనకు అనుకూలరైన అధికారుల వేటలో ఉన్నట్లు సమాచారం.
చెప్పిందే చేయాలి
Published Thu, Jul 10 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM
Advertisement
Advertisement