బెంగళూరు సమీపంలోని బెల్గాంలోని విజయపురి టౌన్ నుంచి అపహరణకు గురైన శ్రేయ చివరకు తన తండ్రి వద్దకు చేరుకుంది.
రాజమండ్రి క్రైం :బెంగళూరు సమీపంలోని బెల్గాంలోని విజయపురి టౌన్ నుంచి అపహరణకు గురైన శ్రేయ చివరకు తన తండ్రి వద్దకు చేరుకుంది. సెల్ సిగ్నల్ ఆధారంగా కిడ్నాపర్ చందప్పను గుర్తించిన రాజమండ్రి టూ టౌన్ క్రైం పోలీసులు శ్రేయను సోమవారం రక్షించిన విషయం తెలిసిందే. ఆ చిన్నారిని రాజమండ్రి పోలీసు అర్బన్ జిల్లా ఎస్పీ హరికృష్ణ పర్యవేక్షణలో కేవీ స్టేట్ హోమ్‌లో ఉంచారు. శ్రేయ తండ్రి ఉమేష్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన హుటాహుటిన మంగళవారం ఉదయం రాజమండ్రి చేరుకున్నారు. తండ్రిని చూడగానే చిన్నారి శ్రేయ కన్నీటితో ‘పప్పా’ అంటూ హత్తుకుపోయింది. కన్నబిడ్డ ఎనిమిది రోజులుగా కనిపించకపోవడంతో తల్లడిల్లిన ఉమేష్.. ఎట్టకేలకు తన కుమార్తెను చూసి ఉద్విగ్నతకు గురయ్యారు.
ఇదీ కిడ్నాప్ నేపథ్యం
బెంగళూరు విజయపురి టౌన్ సీఐ ఎస్.మహేష్‌కుమార్ కథనం ప్రకారం.. తన భార్య ఆస్తిని తనకు తెలియకుండా విక్రయించారని ఉమేష్‌పై చందప్ప కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 15న ఉమేష్, ఆయన భార్య యథావిధిగా ఉద్యోగాలకు వెళ్లారు. కుమార్తె శ్రేయను ఉమేష్ తల్లి చూసుకుంటున్నారు. ఆ సమయంలో ఉమేష్ ఇంటికి చందప్ప వెళ్లాడు. ఉమేష్ తల్లి నుంచి శ్రేయను తీసుకొని, చాక్లెట్లు కొనిస్తానని చెప్పి తీసుకువెళ్లాడు. ఉమేష్ దంపతులు ఇంటికి వచ్చిన తర్వాత కుమార్తె గురించి ఆరా తీయగా చందప్ప తీసుకెళ్లిన విషయం తెలిసింది. ఎంతసేపటికీ శ్రేయను తీసుకురాకపోవడం, అదే సమయంలో ఉమేష్‌కు చందప్ప ఫోన్ చేసి, తన ఆస్తి తిరిగి ఇవ్వాలని లేదా పరిష్కారం చూపాలని లేకుంటే శ్రేయను వదలనని బెదిరించాడు.
దీనిపై ఉమేష్ విజయపురి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచీ శ్రేయను పలు ప్రాంతాల్లో తిప్పిన చందప్ప సోమవారం రాజమండ్రి చేరుకున్నాడు. స్థానిక కుమారి థియేటర్ సమీపంలో అతడి సెల్ సిగ్నల్ ట్రేస్ కావడంతో బెంగళూరు పోలీసులు రాజమండ్రి ఎస్పీ హరికృష్ణకు విషయం తెలిపి, సహకరించాలని కోరారు. వెంటనే స్పందించిన ఎస్పీ పోలీసులను అప్రమత్తం చేసి, కిడ్నాపర్ చందప్పను అదుపులోకి తీసుకుని, శ్రేయను కాపాడారు. కిడ్నాపర్ చందప్పను బెంగళూరు పోలీసులకు అప్పగించారు. వారు అతడిని తమవెంట తీసుకువెళ్లారు.
పోలీసులకు జీవితాంతం రుణపడి ఉంటా : ఉమేష్
తన కుమార్తెను రక్షించడంలో కృషి చేసిన బెంగళూరు, ఆంధ్ర పోలీసులు చాలా సహకరించారని శ్రేయ తండ్రి ఉమేష్ అన్నారు. పోలీసులకు తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. చందప్పకు సంబంధించిన ఆస్తి విలువ రూ.6 లక్షలుంటుందని, అది కుటుంబ తగాదా అని తెలిపారు. పాపను ఏమైనా చేస్తారేమోనని భయపడ్డామని, శ్రేయను చూడగానే ప్రాణం లేచి వచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.