ఒంగోలు టౌన్:జిల్లాకు చెందిన రొయ్య రైతులు ధరాఘాతానికి గురయ్యారు. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో దిగాలు చెందుతున్నారు. యూరోపియన్ దేశాలకు ఎగుమతులు తగ్గిపోవడం, రైతులంతా అమెరికావైపే మొగ్గు చూపడంతో ధరలు పడిపోయాయి. రోజురోజుకూ రొయ్య ధరలు దిగజారిపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మున్ముందు ధరలు ఏవిధంగా ఉంటాయో తెలియక కలవరపడుతున్నారు. జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో దాదాపు 8 వేల హెక్టార్లలో రొయ్యల చెరువులు ఉన్నాయి. 3500 మందికిపైగా రైతులు రొయ్యల చెరువులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్‌లో 100 కౌంట్ రూ.220, 90 కౌంట్ రూ.230, 80 కౌంట్ రూ.240, 60 కౌంట్ రూ.280, 50 కౌంట్ రూ.260, 40 కౌంట్ రూ.300 ధర పలుకుతోంది. కీలకమైన 40 కౌంట్ మినహా మిగిలిన ధరలు కొంతమేర అటూ ఇటుగా ఉంటూ వస్తున్నాయి. రూ.400 ఉన్న 40 కౌంట్ ధర ఒక్కసారిగా రూ.300కు పడిపోయింది. 40 కౌంట్ ధర రూ.100 తగ్గడంతో ఆ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మరికొన్ని రోజులు ఇదే మాదిరిగా ధర పడిపోతే రొయ్య రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
యూరోపియన్ నుంచి యూ టర్న్:భారతదేశం నుంచి రొయ్య ఎగుమతులు ఎక్కువగా యూరోపియన్ దేశాలకు వెళ్తుంటాయి. యూరప్‌లోని పది దేశాల్లో ఇక్కడి రొయ్యలకు మంచి డిమాండ్ ఉంది. అయితే కొంతమంది రైతులు అత్యుత్సాహానికి వెళ్లి నిషేధిత యాంటీబయోటిక్స్‌ను వాడటంతో యూరోపియన్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న ప్రతి రెండు కంటైనర్ల ఎగుమతుల్లో ఒకదానికి శాంపిల్స్ తీస్తున్నారు. నిషేధిత యాంటీబయోటిక్స్ ఉన్నట్లు తేలితే ఎగుమతులు చేసుకునే లైసెన్స్‌ను సంబంధిత రైతులు కోల్పోతున్నారు. తిరిగి లైసెన్స్ పొందాలంటే ఆ రైతుకు చుక్కలు కనిపిస్తాయి. అయితే అమెరికాకు ఎగుమతి చేసే రొయ్య ఉత్పత్తుల్లో శాంపిల్స్ తక్కువగా చేస్తుండటంతో భారతదేశానికి చెందిన రైతులు ఎక్కువగా ఆ దేశానికి ఎగుమతి చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికాకు పది కంటైనర్లు ఎగుమతికి పెడితే వాటిలో కేవలం రెండు కంటైనర్ల శాంపిల్స్ చూస్తున్నారు. మిగిలిన ఎనిమిది కంటైనర్లను యధాలాపంగా ఎగుమతి చేసుకుంటున్నారు. దీంతో రైతులు కూడా అమెరికాకు ఎగుమతులు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లాలో రెండు క్రాప్‌ల్లో రొయ్యలను ఉత్పత్తి చేస్తున్నారు. మొదటి క్రాప్‌లో 24 వేల టన్నులు, రెండవ క్రాప్‌లో 12 వేల టన్నుల రొయ్య దిగుబడులు వస్తున్నాయి. అంటే ఏడాదికి రెండు క్రాప్‌ల కింద 36 వేల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో 90 శాతం రొయ్యలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
స్టోరేజీ సౌకర్యం లేక ధరలనుతెగ్గోసుకుంటున్నారు:జిల్లా నుంచి ఏటా 36 వేల మెట్రిక్ టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ధరలు ఆశాజనకంగా లేని సమయంలో వాటిని నిల్వ చేసుకునేందుకు స్టోరేజీలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. «ఎకరాకు రూ.80 వేలపైగా ఖర్చు చేస్తున్న రైతులు చివరికి వాటికి వచ్చే ధరలను చూసే నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జిల్లాలోని కౌలు రైతులకు ప్రాంతాలను బట్టి «కౌలు ధర నిర్ణయించారు. రూ.30 వేల నుంచి లక్ష రూపాయల వరకు కౌలు ధర ఉంది. అంటే ఆ రైతు కౌలు ధరè చెల్లించి, పెట్టుబడి ఖర్చులు తీసివేయగా ఏమైనా మిగిలితే మిగిలినట్లు..లేకుంటే నష్టాలను మూటగట్టుకోవలసిందే. ఒక్కో చెరువులో లక్ష రొయ్య పిల్లలను వదిలితే ప్రస్తుత వాతావరణంలో 60 వేల పిల్లలు కూడా వచ్చే పరిస్థితులు లేవు. ఒకవైపు దిగుబడి పడిపోయి, ఇంకోవైపు ధరలు పతనం కావడంతో రొయ్య రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిగా మారింది. జిల్లాకు సంబంధించిన ఆర్ధికాభివృద్ధి రేటులో రొయ్య ఎగుమతుల పాత్ర ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని రొయ్య రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు వాటిని నిల్వ చేసుకునేలా ప్రభుత్వం స్టోరేజీ సౌకర్యం కల్పిస్తే కొంతమేర వారు గట్టెక్కే అవకాశం ఉంటుంది. లేకుంటే రొయ్య రంగం తీవ్ర సంక్షోభంలోకి చిక్కుకొని చివరకు కనుమరుగయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment