
శృతిహాసన్ ఫిర్యాదుపై దర్యాప్తు
హైదరాబాద్: ‘ఎవడు’ సినిమాలోని స్టిల్స్‌ను తన అనుమతి లేకుండా సినీ వెబ్‌సైట్లలో పెట్టారంటూ హీరోయిన్ శృతిహాసన్ ఇటీవల సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పలువురు వెబ్‌సైట్ ఫొటోగ్రాఫర్లను సీఐడీ పోలీసులు విచారిస్తున్నారు. గత మూడు రోజులుగా సినీ వెబ్‌సైట్ ఫొటోగ్రాఫర్లను పిలిపించి.. ఆ ఫొటోలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు? ఎందుకు వెబ్‌సైట్లలో పెట్టారనే విషయాలపై విచారిస్తున్నారు.
ఎవడు సినిమాలో తనపై తీసిన ఫొటోలను వెబ్‌సైట్లలో పెట్టడం లేదని ఆ సినిమా నిర్మాత చెప్పారని, తీరా చూస్తే ఇటీవల 11 స్టిల్స్ వెబ్‌సైట్లలో దర్శనమిచ్చాయని ఆమె ఆరోపించారు. ఒప్పందానికి విరుద్ధంగా ఈ ఫొటోలు వెబ్‌సైట్‌లో పెట్టారని ఆమె పేర్కొన్నారు. తన అనుమతి లేకుండా ఇలా ఫొటోలను వాడుకోవడం సబబు కాదని, ఈ పని చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 10 మంది ఫొటోగ్రాఫర్లను పోలీసులు విచారించారు. స్టిల్స్ పెట్టడంలో దురుద్దేశాన్ని అడిగి తెలుసుకున్నారు.