ఎస్ఐ ఆంజనేయులు (ఫైల్ ఫొటో)
విశాఖపట్నం: గోపాలపట్నంలో నిన్న రైలు కిందపడి చనిపోయిన ఎస్ఐ వీరాంజనేయులు సూసైడ్ నోట్ కీలకంగా మారింది. తన చావుకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకట్రావు, ఏసీబీ అధికారుల వేధింపులే కారణమని ఎస్ఐ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా వంగరలో 2014లో వీరాంజనేయులు ఎస్ఐగా పని చేశారు. ఆ సమయంలో ఓ కేసు విషయంలో ఒక వ్యక్తి నుంచి 5 వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి వీరాంజనేయులను అదుపులోకి తీసుకున్నారు.
గోపాలపట్నంలోని లక్ష్మీనగర్‌కు చెందిన గుడిబండ వీరాంజనేయులు(29) మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో గోపాలపట్నం ఆర్‌ఆర్‌ఐ కేబిన్ సమీపాన రైలు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఇది ఆత్మహత్యా, రైలు ప్రమాదమా అన్న వివరాలు తెలియరాలేదని పోలీసులు చెప్పారు.
వీరాంజనేయులు తండ్రి షిప్‌యార్డులో పనిచేసి కొంత కాలం క్రితం మరణించారు. అతనికి తల్లి కాంతమ్మ ఒక సోదరుడు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వీరాంజనేయులు ఎంబీఏ చదివారు. 2008 బ్యాచ్‌కు చెందిన ఆయన తొలిసారి వంగర పోలీస్‌స్టేషన్లో ఎస్‌ఐగా చేరారు. ఓ కేసు పరిష్కారం అనంతరం ఎస్‌ఐ ఆంజనేయులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వంగర మండలం అరసాడ గ్రామానికి చెందిన కడుమల సత్యనారాయణ 2014 అక్టోబర్ 24న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే రోజు ఏసీబీ అధికారులు వీరాంజనేయులుపై నిఘా వేసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. సస్పెన్షన్లో ఉన్న వీరాంజనేయులు ప్రస్తుతం ఇక్కడ తల్లి వద్దే ఉంటున్నారు. ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారా? లేక ప్రమాదం వల్ల మరణించారా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుంది.