ప్రమాదమా? ఆత్మహత్యా?
విశాఖపట్నం/వంగర : గోపాలపట్నం ఆర్‌ఆర్‌ఐ కేబిన్ వద్ద ఘోరం జరిగింది. ఇక్కడ అనుమానాస్పద స్థితిలో ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్ దుర్మరణం పాలయ్యారు. వివరాలిలా వున్నాయి. ఇక్కడి లక్ష్మీనగర్‌కి చెందిన గుడిబండ వీరాంజనేయులు (29) మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో గోపాలపట్నం ఆర్‌ఆర్‌ఐ కేబిన్ సమీపాన రైలు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. సమాచారం తెలిసి రైల్వే డీఎస్పీ నారాయణరావు, సీఐ కోటేశ్వర్రావు హుటాహుటిన చేరుకుని విచారణ జరిపారు. రైలుపట్టాలపై తల, కాళ్లూ చేతులూ తునాతునకలయ్యాయి. ఇది రైలు ప్రమాదమా? లేదా ఆత్మహత్యా అన్న వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు ఎస్‌ఐ స్వామినాయయుడు దర్యాప్తు చేస్తున్నారు.
శోకసంద్రంలో కుటుంబసభ్యులు
వీరాంజనేయులు దుర్మరణం చెందారన్న సమాచారం తెలిసి ఆయన తల్లి కాంతమ్మ, చెల్లి వరలక్ష్మి గుండెలు బాదుకుంటూ సంఘటన స్థలానికి పరుగుపరుగున వచ్చారు. మృతదేహం వద్ద కన్నీరుమున్నీరై విలపించారు. బంధువుల కథనం ప్రకారం.. కాంతమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. ఆమె భర్తషిప్‌యార్డులో పనిచేసి కొంత కాలం క్రితం మరణించారు. వీరాంజనేయులు ఎంబీఏ చదివారు. 2012 బ్యాచ్‌కు చెందిన వీరాంజనేయులు కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో ప్రొబెషనరీ ఎస్‌ఐగా విధుల్లో చేరారు. 2014 జనవరి 23న వంగర ఎస్‌ఐగా తొలి పోస్టింగ్‌లో చేరారు. ప్రొబెషనరీ పీరియడ్‌లో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఓ కేసు పరిష్కారం అనంతరం ఎస్‌ఐ ఆంజనేయులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వంగర మండలం అరసాడ గ్రామానికి చెందిన కడుమల సత్యనారాయణ 2014 అక్టోబర్ 24న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే రోజు ఏసీబీ అధికారులు వీరాంజనేయులుపై నిఘా వేసి రూ. ఐదు వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆయన ప్రస్తుతం సస్పెన్షన్ వేటులో ఉన్నారు. తర్వాత నుంచి ఆయన తల్లి వద్దే ఉంటున్నారు.
కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండే ఆంజనేయులు మృతితో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. ఎందుకు చనిపోయావ్రా... ఎందుకిలా చేశావు... అంటూ కాంతమ్మ కుమిలిపోయింది. ఎంతబాధ లేక పోతే ఇంత దారుణంగా చనిపోతావన్నయ్యా.... ఒక సారి మాట్లాడవా....నన్ను చిన్నీ అని పిలవవా...అంటూ సోద రి వరలక్ష్మి కన్నీరుమున్నీరవ్వడాన్ని చూసి అక్కడికి పెద్ద సంఖ్యలో చేరిన స్థానికులు కూడా కంటతడిపెట్టారు. ఎస్‌ఐ మృతిపట్ల ప్రస్తుత వంగర ఎస్‌ఐ కె.శాంతారామ్‌తోపాటు పోలీసు సిబ్బంది దిగ్భ్రాంతి చెందారు.