Gopalapatnam
-
ఆగని టీడీపీ అరాచకాలు
గోపాలపట్నం: టీడీపీ నాయకుల అరాచకాలు పోలింగ్ రోజు కూడా కొనసాగాయి. దొంగ ఓట్లు వేయించేందుకు తీవ్ర యత్నాలు సాగించారు. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయతి్నంచారు. అడ్డుకున్న వైఎసార్ సీపీనేతలపై దౌర్జన్యానికి దిగారు. గోపాలపట్నం బాలుర ఉన్నత పాఠశాలలో టీడీపీ వ్యక్తి బూత్ లోపలికి వెళ్లి ఓటర్లను ప్రభావితం చేస్తుండడాన్ని గమనించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీకి చెందిన కార్యకర్త దాడికి తెగబడ్డాడు. ఇదంతా చూసిన పోలీసులు చూస్తూ ఉండిపోయారే తప్పా ఆ వ్యక్తిని బయటకు పంపించలేదని విమర్శిస్తున్నారు. ఇదే విధంగా లక్ష్మీనగర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు వెళ్తున్నానని చెప్పి ఓటు వేయకుండా లోపల క్యూలైన్లో ఉన్న వారిని ప్రలోభాలకు గురి చేసిన టీడీపీ కార్యకర్తను పోలీసుల సాయంతో బయటకు పంపించారు. బుచ్చిరాజుపాలెంలో పలు చోట్ల టీడీపీ అభ్యర్థి గణబాబు, ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ ఫొటోలు ఉన్న స్లిప్‌లు ఓటర్లకు ఇచ్చారు. దీనిపై ఎన్నికల అధికారుల ఫిర్యాదు చేయగా వాటిని తొలగించారు. అధికారులు వెళ్లి పోయిన తర్వాత తిరిగి వాటిని తీసుకు వచ్చి ప్రభావితం చేసేందుకు యత్నించారు. స్థానిక వైఎసార్ సీపీ నాయకులు దీన్ని అడ్డుకున్నారు. గతంలో మాదిరిగా దొంగ ఓట్లు వేసే అవకాశం లేకపోవడంతో టీడీపీ నాయకులు గొడవలకు దిగారు. -
గోపాలపట్నంలో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ
-
పండంటి పొదరిల్లు.. ఎంత బాగుందో!
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): మనకు కావాల్సిన పళ్లు, కూరగాయలను మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం. కానీ అవన్నీ మన ఇంటి వద్దే పండించుకుంటే.. ఆ ఆనందమే వేరు కదా. ఓ మాజీ సైనికుడు అదే చేస్తున్నాడు. డాబా పైనే రకరకాల పండ్లను పండిస్తూ తన ఇంటినే ఓ పండ్ల తోటల వనంగా మార్చేశాడు. ఆ మొక్కలకు వర్మీ కంపోస్ట్ ఎరువునే వినియోగిస్తూ పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని కాపాడటంలోనూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆన్లైన్ నుంచి మొక్కల కొనుగోలు విశాఖ జిల్లా కొత్తపాలెం దుర్గానగర్‌కు చెందిన పూజారి శ్రీనివాసరావు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. 2017లో రిటైర్డ్ అయిన ఆయన ప్రస్తుతం ఆర్సీసీవీఎల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయనకు మొక్కల పెంపకంపై మక్కువ. మరీ ముఖ్యంగా పండ్ల తోటలు పెంచడం అంటే చాలా ఇష్టం. ముందుగా 2018 నుంచి ఇంటి చుట్టూ పూల మొక్కల పెంపకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆన్లైన్ నుంచి మొక్కలు తెప్పించి మేడపై పెంచడం మొదలెట్టారు. ఇప్పుడు ఆ ఇల్లు పలు రకాల పండ్ల మొక్కలకు కేరాఫ్‌గా మారిపోయింది. ఫైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్, తీపి బత్తాయి, ద్రాక్ష, మిరియాలు, లిచి, మామిడి, దొండ, అరటి చెట్లు, తైవాన్ జామ తదితర మొక్కలతో పాటు, బోన్సాయ్ మొక్కలనూ పెంచుతున్నారు. ఇంట్లోనే వర్మీ కంపోస్ట్ తయారీ.. పాడైపోయిన ప్లాస్టిక్ బకెట్లను మొక్కల పెంపకానికి అనువుగా తీర్చిదిద్దడం విశేషం. మొక్కలకు వర్మీ కంపోస్టునే ఎరువుగా వినియోగిస్తున్నారు. పొడి వ్యర్థాలను మాత్రమే జీవీఎంసీ సిబ్బందికి ఇచ్చేసి తడి వ్యర్థాల సాయంతో ఇంట్లోనే వర్మీ కంపోస్టును తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు శ్రీనివాసరావు ఇల్లు పచ్చదనంతో కళకళలాడిపోతోంది. ఎంతో ఆనందంగా ఉంది.. మా ఇంటి మేడపైనే పండ్ల మొక్కలు పెంచడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంటిల్లిపాదీ తినగా మిగిలిన పండ్లను స్నేహితులు, బంధువులకు ఇస్తుంటాను. తెలంగాణకు చెందిన ఓ స్నేహితుడి వద్ద వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేయడం నేర్చుకుని మరీ మొక్కలకు వినియోగిస్తున్నాను. – పూజారి శ్రీనివాసరావు, కొత్తపాలెం దుర్గానగర్, విశాఖ జిల్లా -
రమ్మీ ఆడి ప్రాణాలు పొగొట్టుకున్న వ్యక్తి
సాక్షి, విశాఖపట్నం: ఆన్లైన్లో రమ్మీ ఆడి అప్పులపాలైన వ్యక్తి అనుమానస్పద మృతి స్థానికంగా కలకలం రేపుతోంది. విశాఖలోని గోపాలప్నటం కొత్తపాలెంకు చెందిన నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగి మద్దాల సతీష్‌గా పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం.. సతీష్ గత మూడు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గోపాలపట్నం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ సమీపాన ఉన్న రైల్యే ట్రాక్‌పై ఆదివారం సతీష్ మృతదేహాన్నికనుగొన్నారు. అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే సతీష్ ఆన్లైన్ పేకాటకు బానిసై సుమారు కోటి రూపాయలు పోగొట్టుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాగా మృతుడు సతీష్‌కు భార్య ప్రత్యూష(28), కూతురు సాయి మోక్షిత(6) ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు రైల్వే హాస్పిటల్‌కు తరలించారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సతీష్‌ది హత్య, ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. -
లాక్డౌన్: పాప కాని పాపకు సీరియస్
సాక్షి, విశాఖపట్నం: లాక్డౌన్ కష్టాలు అన్నిన్ని కావు.. ఓ జంట తన బంధువు ఇంటికి వెళ్లడం కోసం బొమ్మను పాపాయిగా మార్చి పోలీసులనే బురిడీ కొట్టించబోయింది. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. భార్యాభర్తలిద్దరూ బుధవారం ఉదయం గోపాలపట్నం నుంచి బైకుపై బయలు దేరారు. చెక్ పోస్టుల దగ్గర పోలీసులు ఆపితే బైక్‌పై కూర్చున్న మహిళ తన బిడ్డకు సీరియస్‌గా ఉందని చెప్పడంతో వారు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా పంపించివేశారు. అలా కొంతదూరం ప్రయాణించిన అనంతరం న్యాడ్ జంక్షన్ దగ్గర పోలీసులు ఆపారు. (ఆన్లైన్ పెళ్లి; ఫోన్‌కు తాళి కట్టాడు) ముందుగా అనుకున్న అబద్ధాన్నే మరోసారి పూస గుచ్చినట్లు చెప్పారు. కానీ అనుమానం వచ్చిన ఓ కానిస్టేబుల్ పాపను పరీక్షించాలంటూ మహిళ దగ్గరకు వెళ్లి చూడగా ఆ దృశ్యం చూసి ఖంగు తిన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది కేవలం బొమ్మ మాత్రమే. దీంతో సదరు మహిళ తమ బంధువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అసలు విషయం చెప్పింది. దయచేసి ఈ ఒక్కసారికి వదిలేయండి అని పోలీసులను వేడుకొంది. దీంతో కనికరించిన పోలీసులు మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకండని హెచ్చరించి సదరు జంటను విడిచిపెట్టారు. (అమ్మ కోసం ఆమాత్రం చేయలేనా: దర్శకుడు) -
మత్తుకు అలవాటైతే ...చిత్తే!
⇒ నగరంలో జోరుగా గంజాయి వ్యాపారం ⇒ బానిసలుగా మారుతున్న యువత ⇒ ఆరోగ్య సమస్యలు తప్పవంటున్న వైద్యులు మర్రిపాలెం/సీతమ్మధార (విశాఖ ఉత్తర): నగరంలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా ఆయా ప్రాంతాల్లో అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అధిక శాతం యువత గంజాయి మత్తుకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటుంది. ఇటీవల గోపాలపట్నంలోని ఓ పాఠశాలలో విద్యార్థుల వద్ద గంజాయి పట్టుబడటం ఆందోళన కలిగించే అంశం. గంజాయి తరలిస్తున్న వ్యక్తులపై దాడులు చేసి అరెస్టులు చేస్తున్నా.. ఈ వ్యాపారానికి అడ్డుకట్ట పడటం లేదు. ఈ తరహా కేసులు తరచూ నమోదవుతూనే ఉన్నాయి. గుట్టుచప్పుడు కాకుండా రవాణా విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి రవాణా జరుగుతోంది. కార్లు, జీపులు, ఆటోల్లో గంజాయిని నగరానికి తీసుకువస్తున్నారు. ఆదాయం మెండుగా వస్తుండటంతో ఈ రవాణా అధికమవుతోంది. ప్యాసింజర్, రవాణా తరహా వాహనాల్లో గంజాయి కళ్లుగప్పి తరలిస్తుండటంతో చాలా వరకు తనిఖీల్లో పట్టుబడటం లేదు. ఒడిశా, మధ్యప్రదేశ్ ప్రాంతాల నుంచి రైళ్లలో గంజాయి సరఫరా అవుతున్నట్టు సమాచారం. పైగా ముఠాలుగా ఏర్పడటంతో ఇది మాఫియాను తలపిస్తోంది. విశాఖ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలు, మర్రిపాలెం, గోపాలపట్నం, పెందుర్తి రైల్వేస్టేషన్లు, జ్ఞానాపురం, కంచరపాలెం, రామ్మూర్తి పంతులు పేట బ్రిడ్జి, చంద్రంపాలెం, మారికవలస, ఆర్టీసీ కాంప్లెక్స్ దరి తదితర ప్రాంతాలు గంజాయి సరఫరా కేంద్రాలుగా ఉంటున్నాయి. బలైపోతున్న యువత గంజాయి మత్తుకి అలవాటుపడ్డ యువత తమ జీవితాలను బలిచేసుకుంటోంది. గంజాయి వినియోగం ప్రస్తుతం యువతకు ఫ్యాషన్‌గా మారుతోంది. సిగరెట్లలో గంజాయిని చేర్చి సేవించడంతో అనుమానాలకు తావు లేకుండా పోతోంది. బహిరంగ ప్రదేశాల్లో గంజాయి సేవిస్తున్నా ఏం చేయలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆరోగ్య సమస్యలు గంజాయి అధికంగా నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది. సరదాగా అలవాటైన గంజాయి మనిషిని బానిసగా చేస్తుంది. భోజనం లేకపోయినా ఫర్వాలేదు కానీ గంజాయి పీల్చకపోతే ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. గంజాయి అధికంగా సేవించే వారికి బలహీనతతో కాళ్లు, చేతులు వణుకుతుంటాయని, కొంత కాలానికి శరీరంలోని ముఖ్య అవయవాలకు ముప్పు తప్పదని వైద్యులు చెబుతున్నారు. మత్తులో ఉండటంతో జ్ఞాపక శక్తి మీద ప్రభావం చూపుతుందని అంటున్నారు. మత్తుతో ముప్పు తప్పదు గంజాయి వినియోగంతో ఆరోగ్యం సమస్యలు తప్పవు. ముఖ్యంగా నాడీ వ్యవస్థ మీద ప్రభావం ఉంటుంది. దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు ఎదురుకావచ్చు. సిగరెట్, బీడీ కంటే గంజాయి అత్యంత ప్రమాదకరం. ముఖ్యంగా యుక్త వయసులో యువత గంజాయికి అలవాటు పడితే జీవితం అంధకారంలో పడినట్టే. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికను ఎప్పటికప్పుడు గుర్తించాలి. చెడు వ్యసనాలకు బానిసైతే రక్షించుకోవాలి. ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలతో గంజాయి సరఫరాకు అడ్డుకట్ట వేయాలి. వాడకం ఇలా... గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా చేసి అమ్ముతున్నారు. ఒక్కో పొట్లం రూ.50 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. పొగాకు తరహాలో గంజాయిని పిండిగా చేసి సిగరెట్‌ను పొడికి తగిలిస్తూ వాడుతున్నారు. కొంత మంది సిగరెట్లలో గంజాయిని పొందుపరచి అమ్ముతున్నారు. చాక్లెట్ల రూపంలో గంజాయి నగరంలో అధిక శాతం సరఫరా అవుతోంది. ఒకప్పుడు బిచ్చగాళ్లు, ఆటో కార్మికులు, రైల్వే కూలీలు వినియోగించేవారు. వినియోగంలో కిక్కు ఉండటంతో యువత గంజాయి మత్తుకు అలవాటు పడుతోంది. కొంత మంది మత్తు ఎలా ఉందో తెలుసుకుందామని ప్రయత్నించి బానిసలుగా మారుతున్నారు. -
పాడుబుద్ధికి 10 నెలల జైలు
బాలుడి కిడ్నాప్ కేసులో కటకటాలు గోపాలపట్నం: గంజాయి వ్యసనం ఓ వ్యక్తిని కిడ్నాప్‌కి ప్రేరేపించింది. సొంత మేనమామే ఓ బాలుడిని ఆడిస్తున్నట్లుగా నటించాడు. తల్లి దగ్గరకు తీసుకెళ్తానని నమ్మించి ఆ బాలుడిని రైల్వేస్టేషన్లో వదిలేశాడు. గంజాయి మత్తులో పడి ఎటో వెళ్లిపోయాడు. పోలీసుల అప్రమత్తతతో ఆ బాలుడు దొరికాడు. ఆ నిందితుడు ఇపుడు కటకటాల పాలయ్యాడు. పెందుర్తికి చెందిన డోలా కిరణ్‌కుమార్ అనే వ్యాను డ్రైవరు మద్యం, గంజాయికి బానిసయ్యాడు. గోపాలపట్నం లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్న తన సోదరి బోనెల విజేత ఇంటికి గత నవంబరు 18న వచ్చాడు. ఆమె రెండున్నరేళ్ల కొడుకు తిలక్‌ని ఆడిస్తూ.. పెందుర్తిలో ఉన్న తన అమ్మ ఇంటికి తీసుకెళ్తానని నమ్మించాడు. బాలుడిని బైక్‌పై తీసుకెళ్లాడు. రాత్రయినా తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనతో గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వైకుంఠరావు నేతృత్వాన ఎస్ఐ దుంపల శ్రీనివాస్ ఆగమేఘాలమీద నాలుగు బందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు. వాట్స్యాప్లలో అన్ని పోలీస్స్టేషన్ల ఇన్చార్జిలకు నిందితుడి ఫొటోలు, బాలుడి ఫొటోలూ పంపారు. చివరకు విశాఖ రైల్వే స్టేషన్లో ఆ మర్నాడు వేకువజామున రిజర్వేషన్ కౌంటర్లో అనుమానంగా తిరుగుతున్న కిరణ్‌కుమార్‌ని అదుపులోకి తీసుకున్నారు. మైకంలో రోడ్డు పక్కన ఉన్న చుక్కా చిట్టమ్మ అనే వృద్ధురాలి ఒడిలో తిలక్‌ని పెట్టానని చెప్పాడు. ఆ వృద్ధురాలి అడ్రసు గాలించి మధురవాడలో వాంబే కాలనీలో పట్టుకున్నారు. ఇలా తిలక్‌ని తీసుకుని కుటుంబసభ్యులకు అందజేశారు. కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి కేసు పెట్టారు. ఈ కేసులో రెండవ మెట్రోపాలిటన్ మెజిస్రేట్ శుక్రవారం తీర్పు వెలువరించారు. కిరణ్‌కుమార్‌కి పది నెలల జైలు, రెండువేల జరిమానా విధించారు. -
వరకట్న వేధింపులే కడతేర్చాయి
విశాఖపట్నం : వరకట్న వేధింపులే తమ కుమార్తెను కడతేర్చాయని మృతురాలు గాయత్రి తల్లిదండ్రులు ఝాన్సీలక్ష్మి, సోమరాజులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తెను భర్త భోగరాజు రోజూ హింసించేవాడని, అతనే హతమార్చినట్లు అనుమానాలున్నాయని ఆరోపించారు. గోపాలపట్నం శివారు యల్లపువానిపాలెంలో రెండు రోజుల కిందట ఆర్పీఎఫ్ ఎస్ఐ నాగళ్ల భోగరాజు భార్య గాయత్రి(43) ఇంట్లో అనుమానాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు ఝాన్సీలక్ష్మి, సోమరాజులు, ఇతర కుటుంబ సభ్యులు వరంగల్ నుంచి ఇక్కడికి ఆదివారం ఉదయం చేరుకున్నారు. గాయత్రి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా విలపించారు. ముమ్మాటికీ భర్త భోగరాజు వల్లే తమ కుమార్తె మరణించినట్లు ఆరోపించారు. గాయత్రి మరణించిన రోజు రాత్రి ఏడు గంటల సమయంలో బాగానే ఉన్నట్లు తమకు ఫోన్ చేసిందని, తెల్లారేసరికి మృతిచెందిందని చెప్పడం అనుమానంగా ఉందన్నారు. 2009లో భోగరాజుతో పెళ్లి చేశామని, అప్పటి నుంచి వరకట్నం కోసం వేధిస్తున్నా సర్దుబాటు చేసుకుంటూ వచ్చామని వాపోయారు. తాను మాజీ సీఐని అయినప్పటికీ సంపాదించుకున్నది ఏమీ లేదని, నలుగురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశానని సోమరాజులు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్తి కోసం నరకం చూపించేవాడని, ఏదోలా వదిలించుకునేందుకే గాయత్రిని హతమార్చి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. బెడ్రూంలో మరణంపై సందేహాలు గాయత్రి బెడ్రూంలో ఆత్మహత్య చేసుకుందని చెబుతుండడంపై పోలీసులు, ఆమె తల్లిదండ్రులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. భోగరాజు చెబుతున్న దాని ప్రకారం ఇంట్లో ఆ రోజు రాత్రి భార్యాభర్తలు మాత్రమే ఉన్నారు. బెడ్రూంలో గాయత్రి ఫ్యానుకి ఉరివేసుకుని విలవిల్లాడితే భోగరాజు అంత గాఢ నిద్రలో ఉంటాడా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. విచారణ అనంతరం మృతదేహాన్ని పోలీసులు తరలిస్తున్నపుడు గాయత్రి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ సందర్భంగా సీఐ వైకుంఠరావు మాట్లాడుతూ పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి విచారణ చేపడతామని తెలిపారు. -
గంటకు 20 కి.మీ. వేగంతో కదులుతున్న తుపాన్
విశాఖపట్నం : కళింగపట్నానికి 150 కి.మీ దూరంలో... గోపాలపట్నానికి 50 కి.మీ దూరంలో తుపాన్ కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఈ తుపాన్ గంటకు 20 కి.మీ వేగంతో కదులుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని సూచించింది. ఉత్తర కోస్తాలోని అన్ని పోర్టుల్లో 4వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు పేర్కొంది. ఇచ్చాపురంలో 15, కళింగపట్నంలో 14 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. -
ఉపాధి హామీ పేరిట రూ.5 వేల కోట్ల దోపిడీ: రఘువీరా
గోపాలపట్నం (విశాఖ) : రాష్ట్రంలో ఉపాధి హామీ పధకం పేరిట రూ.5 వేల కోట్ల దోపిడీ జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. విశాఖ నగరంలోని గోపాలపట్నంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని తుంగలో తొక్కేశారని, దాని ఫలాలు పేదలకు అందడం లేదని విమర్శించారు. జన్మభూమి కమిటీల సభ్యుల కూలీల డబ్బులు కైంకర్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్వాకంతో 20 లక్షల మంది గ్రామాల నుంచి వలసలు పోయారని అన్నారు. ఖరీఫ్ సమయం ముంచుకొస్తున్నా రుణమాఫీ చేయలేదని, దీని వల్ల రైతాంగం వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా నిధులు ఇవ్వలేదన్నారు. రైతాంగ సమస్యలపై క్షేత్రస్ధాయి పరిశీలన చేస్తున్నామని... ప్రతి జిల్లాలో కరువు తీవ్రత, రైతుల ఇబ్బందులు, ప్రభుత్వ వైఫల్యాలు గుర్తించడంతోపాటు రైతులను ఎలా ఆదుకోవాలన్న అంశాలను నమోదు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని రఘువీరా అన్నారు. -
సినీ ఫక్కీలో ఓ వార్డెన్ క్రైమ్ స్టోరీ..!
గోపాలపట్నం: ఓ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ వార్డెన్ సినీ ఫక్కీలో చోరీ కథ నడిపించాడు. అంతేకాదు చోరీ విషయాన్ని బయటపెట్టినందుకు ఓ విద్యార్థిపై దాడి కూడా చేయించాడు. చివరికి బాధితుల బంధువుల చేతిలో తన్నులు తిన్నాడు. పోలీసులు, బాధితుల కథనం మేరకు విశాఖ నగరంలోని గోపాలపట్నం ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నర్వ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయ్‌కుమార్ అనే విద్యార్థి పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తూ హాస్టల్లో ఉంటున్నాడు. వార్డెన్ జగన్మోహన్ వద్ద అతడు లోగడ రూ.200లు అప్పు చేసి ఉన్నాడు. తన బ్యాంకు ఖాతాలో తండ్రి రూ.20వేలు జమ చేయడంతో వార్డెన్‌కు ఏటీఎం కార్డు ఇచ్చి బాకీ ఉన్న రూ.200 తీసుకోండి సార్ అన్నాడు. పిన్ నంబర్ తెలుసుకున్న అనంతరం వద్దులే నువ్వే తెచ్చివ్వు అని చెప్పిన వార్డెన్.. జగన్మోహన్ ఏటీఎం కార్డు చోరీకి పథకం వేశాడు. మరో విద్యార్థి సతీష్‌తో ఉదయ్‌కుమార్ ఏటీఎం కార్డును దొంగచాటుగా తెప్పించి, పిన్ నంబర్ చెప్పి అతడితోనే రూ.10వేలు డ్రా చేయించాడు. తన ఏటీఎం కార్డు కనిపించకపోవడంతో ఉదయ్ తోటి విద్యార్థి అయిన సతీష్‌ని అడగ్గా.. అతడు జరిగిన విషయం చెప్పాడు. ఉదయ్‌కు సతీష్ జరిగిన విషయాన్ని చెప్పడంతో ఆగ్రహించిన వార్డెన్ కొందరు విద్యార్థులతో గురువారం రాత్రి దాడి చేయించాడు. దీంతో సతీష్ గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి బంధువులు, కొందరు విద్యార్థులు వార్డెన్‌పై శుక్రవారం దాడి చేయడంతో అతడికి స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసులు ప్రైవేటు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
రూ.50 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
గోపాలపట్నం (విశాఖపట్నం) : పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారని గుర్తించిన కారు డ్రైవర్ కారును దారి మళ్లించడంతో.. అనుమానం వచ్చిన పోలీసులు వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.50 లక్షల విలువైన 300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం మధ్యాహ్నం గోపాలపట్నం వద్ద పోలీసులు తనిఖీలు చేపడుతున్న సమయంలో రైల్వే స్టేషన్ వైపు నుంచి నగరంలోకి వస్తున్న బొలేరో వాహనం పోలీసులను గుర్తించి దారి మళ్లించడానికి ప్రయత్నించగా వాహనాన్ని వెంబడించి వాహనంతోపాటు అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. -
పదహారేళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్
-
పదహారేళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్
గోపాలపట్నం (విశాఖపట్నం): గోపాలపట్నం శివారులోని ఎల్లపువానిపల్లెకు చెందిన ఓ 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. మూడు రోజుల క్రితమే ఈ సంఘటన జరిగినా ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఈ సంగతి గురించి తల్లిదండ్రులకు తెలియజేయడంతో విషయం బయటపడింది. తల్లిదండ్రులు ఈ విషయం గురించి పోలీసులకు తెలిపారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారణ జరుపుతున్నారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
కదులుతున్న బ్యాగు.. లోపల ఓ శిశువు
గోపాలపట్నం (విశాఖపట్నం) : సంతాన భాగ్యం లేక ఎంతో మంది వేదన పడుతుంటే... అప్పుడే పుట్టిన మగ శిశువును బ్యాగులో పెట్టి చెత్తకుప్పల్లో వదిలేసి వెళ్లిపోయారు మనసులేని మనుషులు. విశాఖ నగరంలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సింహనగర్లో చెత్తకుప్పల్లో కదులుతున్న బ్యాగు ఆదివారం ఉదయం స్థానికుల కంటపడింది. దాన్ని తెరచి చూడగా అప్పుడే పుట్టిన మగశిశువు కనిపించాడు. దీంతో ఆ చిన్నారిని స్థానికులు అక్కున చేర్చుకున్నారు. మాకు కావాలంటే మాకు కావాలంటూ పలువురు పోటీ పడడం కనిపించింది. కాగా ఈ సమాచారాన్ని కొందరు గోపాలపట్నం పోలీసులకు అందించారు. -
ఏసీబీ వలలో శానిటరీ ఇన్స్పెక్టర్
కాంట్రాక్టు కార్మికుని ఉద్యోగానికి లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం గోపాలపట్నం: గోపాలపట్నంలోని 66వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రావు మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. కాంట్రాక్టు కార్మికుని ఉద్యోగం కోసం రూ. 30 లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కాడు. వివరాలివీ... వార్డులో కన్నమ్మ అనే కాంట్రాక్టు కార్మికుడు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అతని కొడుకు శివ కి ఆ ఉద్యోగం ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ తరుణంలో కొంతకాలంగా శివ ఇక్కడి శానిటరీ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రావు చుట్టూ తిరుగుతున్నాడు. అయితే రూ.30 వేలు ఇస్తేనే ఉద్యోగం అని శానిటరీన్‌స్పెక్టర్ తెగేసి చెప్పాడు. దీంతో శివ మొదటి సారి అప్పు చేసి రూ.10 వేలిచ్చాడు. తర్వాత స్థోమత లేదని చెప్పినా తాను చెప్పినంత ఇవ్వాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ఒత్తిడి చేశాడు. ఏం చేయాలో పాలుపోక శివ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఇక్కడి కొత్తపాలెంలో ఉన్న వార్డు కార్యాలయంలో ఈశ్వర్రావుకి శివ రూ.10 వేలు ఇచ్చాడు. ఆ మొత్తాన్ని ఇక్కడ పనిచేస్తున్న రమణి ద్వారా శానిటరీ ఇన్స్పెక్టర్ తీసుకున్న వెంటనే ఏసీడీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్‌తో పాటు సీఐలు రామకృష్ణ, రమేష్, రమణమూర్తి దాడి చేసి పట్టుకున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్తో పాటు రమణిని అదుపులోకి తీసుకుని వేలిముద్రలు సేకరించారు. రికార్డులు పరిశీలించారు. ఈశ్వర్రావుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాఫిక్ పోలీసులపై కత్తితో వీరంగం
గోపాలపట్నం (విశాఖ) : వాహనం ఆపకుండా వెళ్లిపోతున్న ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకోగా అతడు కత్తితో దాడికి యత్నించాడు. ఈ ఘటన విశాఖ నగరంలోని గోపాలపట్నంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాగం శ్రీనివాసరావు అనే వ్యక్తి గోపాలపట్నం జంక్షన్లో రెడ్ లైట్ పడినా ఆగకుండా బైక్‌పై వేగంగా వెళ్లిపోయాడు. దీనిపై అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు కొంతదూరం తర్వాత అతడిని అడ్డుకున్నారు. ఆగ్రహించిన శ్రీనివాసరావు తన వద్ద ఉన్న కత్తితో వారిపైకి దాడికి దిగాడు. వారు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడి వద్ద ఉన్న నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, అతడిని విచారిస్తున్నారు. -
విశాఖలో కిడ్నాపైన యువతులు క్షేమం
విశాఖపట్నం: విశాఖపట్నంలో కిడ్నాపైన ఇద్దరు యువతులను గోపాలపట్నం పోలీసులు రక్షించి గురువారం నగరానికి తీసుకువచ్చారు. వివరాలు.. విశాఖకు చెందిన ఇద్దరు యువతులను గత నెల 31న సింహాద్రి గిరిప్రదర్శనలో నజీబ్నాథ్ అనే యువకుడు కిడ్నాప్ చేసి కేరళ తీసుకెళ్లాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న గోపాలపట్నం పోలీసులు అప్రమత్తమై కేరళలో యువతులను బుధవారం పట్టుకున్నారు. అక్కడి నుంచి గురువారం వారిని తీసుకు వచ్చారు. -
ఎమ్మెల్యే కళా వేధింపులే కారణం:ఎస్ఐ సూసైడ్ నోట్ !
విశాఖపట్నం: గోపాలపట్నంలో నిన్న రైలు కిందపడి చనిపోయిన ఎస్ఐ వీరాంజనేయులు సూసైడ్ నోట్ కీలకంగా మారింది. తన చావుకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకట్రావు, ఏసీబీ అధికారుల వేధింపులే కారణమని ఎస్ఐ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా వంగరలో 2014లో వీరాంజనేయులు ఎస్ఐగా పని చేశారు. ఆ సమయంలో ఓ కేసు విషయంలో ఒక వ్యక్తి నుంచి 5 వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి వీరాంజనేయులను అదుపులోకి తీసుకున్నారు. గోపాలపట్నంలోని లక్ష్మీనగర్‌కు చెందిన గుడిబండ వీరాంజనేయులు(29) మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో గోపాలపట్నం ఆర్ఆర్ఐ కేబిన్ సమీపాన రైలు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఇది ఆత్మహత్యా, రైలు ప్రమాదమా అన్న వివరాలు తెలియరాలేదని పోలీసులు చెప్పారు. వీరాంజనేయులు తండ్రి షిప్‌యార్డులో పనిచేసి కొంత కాలం క్రితం మరణించారు. అతనికి తల్లి కాంతమ్మ ఒక సోదరుడు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వీరాంజనేయులు ఎంబీఏ చదివారు. 2008 బ్యాచ్‌కు చెందిన ఆయన తొలిసారి వంగర పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా చేరారు. ఓ కేసు పరిష్కారం అనంతరం ఎస్ఐ ఆంజనేయులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వంగర మండలం అరసాడ గ్రామానికి చెందిన కడుమల సత్యనారాయణ 2014 అక్టోబర్ 24న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే రోజు ఏసీబీ అధికారులు వీరాంజనేయులుపై నిఘా వేసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. సస్పెన్షన్‌లో ఉన్న వీరాంజనేయులు ప్రస్తుతం ఇక్కడ తల్లి వద్దే ఉంటున్నారు. ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారా? లేక ప్రమాదం వల్ల మరణించారా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుంది. -
ప్రమాదమా? ఆత్మహత్యా?
విశాఖపట్నం/వంగర : గోపాలపట్నం ఆర్ఆర్ఐ కేబిన్ వద్ద ఘోరం జరిగింది. ఇక్కడ అనుమానాస్పద స్థితిలో ఓ సబ్ఇన్స్పెక్టర్ దుర్మరణం పాలయ్యారు. వివరాలిలా వున్నాయి. ఇక్కడి లక్ష్మీనగర్‌కి చెందిన గుడిబండ వీరాంజనేయులు (29) మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో గోపాలపట్నం ఆర్ఆర్ఐ కేబిన్ సమీపాన రైలు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. సమాచారం తెలిసి రైల్వే డీఎస్పీ నారాయణరావు, సీఐ కోటేశ్వర్రావు హుటాహుటిన చేరుకుని విచారణ జరిపారు. రైలుపట్టాలపై తల, కాళ్లూ చేతులూ తునాతునకలయ్యాయి. ఇది రైలు ప్రమాదమా? లేదా ఆత్మహత్యా అన్న వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు ఎస్ఐ స్వామినాయయుడు దర్యాప్తు చేస్తున్నారు. శోకసంద్రంలో కుటుంబసభ్యులు వీరాంజనేయులు దుర్మరణం చెందారన్న సమాచారం తెలిసి ఆయన తల్లి కాంతమ్మ, చెల్లి వరలక్ష్మి గుండెలు బాదుకుంటూ సంఘటన స్థలానికి పరుగుపరుగున వచ్చారు. మృతదేహం వద్ద కన్నీరుమున్నీరై విలపించారు. బంధువుల కథనం ప్రకారం.. కాంతమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. ఆమె భర్తషిప్యార్డులో పనిచేసి కొంత కాలం క్రితం మరణించారు. వీరాంజనేయులు ఎంబీఏ చదివారు. 2012 బ్యాచ్‌కు చెందిన వీరాంజనేయులు కొత్తూరు పోలీస్ స్టేషన్లో ప్రొబెషనరీ ఎస్ఐగా విధుల్లో చేరారు. 2014 జనవరి 23న వంగర ఎస్ఐగా తొలి పోస్టింగ్‌లో చేరారు. ప్రొబెషనరీ పీరియడ్‌లో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఓ కేసు పరిష్కారం అనంతరం ఎస్ఐ ఆంజనేయులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వంగర మండలం అరసాడ గ్రామానికి చెందిన కడుమల సత్యనారాయణ 2014 అక్టోబర్ 24న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే రోజు ఏసీబీ అధికారులు వీరాంజనేయులుపై నిఘా వేసి రూ. ఐదు వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆయన ప్రస్తుతం సస్పెన్షన్ వేటులో ఉన్నారు. తర్వాత నుంచి ఆయన తల్లి వద్దే ఉంటున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండే ఆంజనేయులు మృతితో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. ఎందుకు చనిపోయావ్రా... ఎందుకిలా చేశావు... అంటూ కాంతమ్మ కుమిలిపోయింది. ఎంతబాధ లేక పోతే ఇంత దారుణంగా చనిపోతావన్నయ్యా.... ఒక సారి మాట్లాడవా....నన్ను చిన్నీ అని పిలవవా...అంటూ సోద రి వరలక్ష్మి కన్నీరుమున్నీరవ్వడాన్ని చూసి అక్కడికి పెద్ద సంఖ్యలో చేరిన స్థానికులు కూడా కంటతడిపెట్టారు. ఎస్ఐ మృతిపట్ల ప్రస్తుత వంగర ఎస్ఐ కె.శాంతారామ్‌తోపాటు పోలీసు సిబ్బంది దిగ్భ్రాంతి చెందారు. -
సింగపూర్ లో ఉద్యోగాల పేరిట మోసం
విశాఖపట్నం: సింగపూర్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ విశాఖపట్నంలో ఓ వ్యక్తి నిరుద్యోగులకు మోసం చేశాడు. శంకర్ దాస్ అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడు. నిరుద్యోగుల నుంచి రూ. 30 లక్షలు వసూలు చేసి అతడు పరారయ్యాడు. బాధితులు గోపాలపట్నం పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒక్కొరి దగ్గర రూ. 2 లక్షలు వసూలు చేసినట్టు బాధితులు చెప్పారు. తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.