వరకట్న వేధింపులే కడతేర్చాయి
Published Mon, Dec 5 2016 4:05 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM
విశాఖపట్నం : వరకట్న వేధింపులే తమ కుమార్తెను కడతేర్చాయని మృతురాలు గాయత్రి తల్లిదండ్రులు ఝాన్సీలక్ష్మి, సోమరాజులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తెను భర్త భోగరాజు రోజూ హింసించేవాడని, అతనే హతమార్చినట్లు అనుమానాలున్నాయని ఆరోపించారు. గోపాలపట్నం శివారు యల్లపువానిపాలెంలో రెండు రోజుల కిందట ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ నాగళ్ల భోగరాజు భార్య గాయత్రి(43) ఇంట్లో అనుమానాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు ఝాన్సీలక్ష్మి, సోమరాజులు, ఇతర కుటుంబ సభ్యులు వరంగల్ నుంచి ఇక్కడికి ఆదివారం ఉదయం చేరుకున్నారు. గాయత్రి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా విలపించారు.
ముమ్మాటికీ భర్త భోగరాజు వల్లే తమ కుమార్తె మరణించినట్లు ఆరోపించారు. గాయత్రి మరణించిన రోజు రాత్రి ఏడు గంటల సమయంలో బాగానే ఉన్నట్లు తమకు ఫోన్ చేసిందని, తెల్లారేసరికి మృతిచెందిందని చెప్పడం అనుమానంగా ఉందన్నారు. 2009లో భోగరాజుతో పెళ్లి చేశామని, అప్పటి నుంచి వరకట్నం కోసం వేధిస్తున్నా సర్దుబాటు చేసుకుంటూ వచ్చామని వాపోయారు. తాను మాజీ సీఐని అయినప్పటికీ సంపాదించుకున్నది ఏమీ లేదని, నలుగురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశానని సోమరాజులు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్తి కోసం నరకం చూపించేవాడని, ఏదోలా వదిలించుకునేందుకే గాయత్రిని హతమార్చి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.
బెడ్‌రూంలో మరణంపై సందేహాలు
గాయత్రి బెడ్‌రూంలో ఆత్మహత్య చేసుకుందని చెబుతుండడంపై పోలీసులు, ఆమె తల్లిదండ్రులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. భోగరాజు చెబుతున్న దాని ప్రకారం ఇంట్లో ఆ రోజు రాత్రి భార్యాభర్తలు మాత్రమే ఉన్నారు. బెడ్‌రూంలో గాయత్రి ఫ్యానుకి ఉరివేసుకుని విలవిల్లాడితే భోగరాజు అంత గాఢ నిద్రలో ఉంటాడా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. విచారణ అనంతరం మృతదేహాన్ని పోలీసులు తరలిస్తున్నపుడు గాయత్రి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ సందర్భంగా సీఐ వైకుంఠరావు మాట్లాడుతూ పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి విచారణ చేపడతామని తెలిపారు.
Advertisement