గోపాలపట్నం (విశాఖ) : రాష్ట్రంలో ఉపాధి హామీ పధకం పేరిట రూ.5 వేల కోట్ల దోపిడీ జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. విశాఖ నగరంలోని గోపాలపట్నంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని తుంగలో తొక్కేశారని, దాని ఫలాలు పేదలకు అందడం లేదని విమర్శించారు. జన్మభూమి కమిటీల సభ్యుల కూలీల డబ్బులు కైంకర్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్వాకంతో 20 లక్షల మంది గ్రామాల నుంచి వలసలు పోయారని అన్నారు.
ఖరీఫ్ సమయం ముంచుకొస్తున్నా రుణమాఫీ చేయలేదని, దీని వల్ల రైతాంగం వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా నిధులు ఇవ్వలేదన్నారు. రైతాంగ సమస్యలపై క్షేత్రస్ధాయి పరిశీలన చేస్తున్నామని... ప్రతి జిల్లాలో కరువు తీవ్రత, రైతుల ఇబ్బందులు, ప్రభుత్వ వైఫల్యాలు గుర్తించడంతోపాటు రైతులను ఎలా ఆదుకోవాలన్న అంశాలను నమోదు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని రఘువీరా అన్నారు.
ఉపాధి హామీ పేరిట రూ.5 వేల కోట్ల దోపిడీ: రఘువీరా
Published Fri, May 13 2016 6:53 PM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM
Advertisement