సినీ ఫక్కీలో ఓ వార్డెన్ క్రైమ్ స్టోరీ..!
గోపాలపట్నం: ఓ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ వార్డెన్ సినీ ఫక్కీలో చోరీ కథ నడిపించాడు. అంతేకాదు చోరీ విషయాన్ని బయటపెట్టినందుకు ఓ విద్యార్థిపై దాడి కూడా చేయించాడు. చివరికి బాధితుల బంధువుల చేతిలో తన్నులు తిన్నాడు.
పోలీసులు, బాధితుల కథనం మేరకు విశాఖ నగరంలోని గోపాలపట్నం ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నర్వ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయ్‌కుమార్ అనే విద్యార్థి పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తూ హాస్టల్లో ఉంటున్నాడు. వార్డెన్ జగన్‌మోహన్ వద్ద అతడు లోగడ రూ.200లు అప్పు చేసి ఉన్నాడు. తన బ్యాంకు ఖాతాలో తండ్రి రూ.20వేలు జమ చేయడంతో వార్డెన్‌కు ఏటీఎం కార్డు ఇచ్చి బాకీ ఉన్న రూ.200 తీసుకోండి సార్ అన్నాడు. పిన్ నంబర్ తెలుసుకున్న అనంతరం వద్దులే నువ్వే తెచ్చివ్వు అని చెప్పిన వార్డెన్.. జగన్‌మోహన్ ఏటీఎం కార్డు చోరీకి పథకం వేశాడు. మరో విద్యార్థి సతీష్‌తో ఉదయ్‌కుమార్ ఏటీఎం కార్డును దొంగచాటుగా తెప్పించి, పిన్ నంబర్ చెప్పి అతడితోనే రూ.10వేలు డ్రా చేయించాడు.
తన ఏటీఎం కార్డు కనిపించకపోవడంతో ఉదయ్ తోటి విద్యార్థి అయిన సతీష్‌ని అడగ్గా.. అతడు జరిగిన విషయం చెప్పాడు. ఉదయ్‌కు సతీష్ జరిగిన విషయాన్ని చెప్పడంతో ఆగ్రహించిన వార్డెన్ కొందరు విద్యార్థులతో గురువారం రాత్రి దాడి చేయించాడు. దీంతో సతీష్ గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి బంధువులు, కొందరు విద్యార్థులు వార్డెన్‌పై శుక్రవారం దాడి చేయడంతో అతడికి స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసులు ప్రైవేటు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.