ఇరు రాష్ట్రాలకు వచ్చిన మూడు బొగ్గు బ్లాకులు రద్దు
సుప్రీం తీర్పుతో డోలాయమానంలో కొత్త థర్మల్ ప్లాంట్లు
తాడిచర్ల-1 రద్దుతో కేటీపీపీకి బొగ్గు లేనట్లే
వీటీపీఎస్, కేటీపీఎస్ ప్లాంట్లదీ ఇదే పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై బొగ్గు దెబ్బపడింది. తీవ్ర విద్యుత్ కొరతతో సతమతమవుతున్న తెలంగాణకు అనుకోని షాక్ తగిలింది. వచ్చే ఏడాదే అందుబాటులోకి వస్తుందనుకుంటున్న 600 మెగావాట్ల విద్యుత్ తీరా చేతికి రాకుండా పోయే ముప్పు తలెత్తింది. బొగ్గు బ్లాకుల కేటాయింపులను సుప్రీంకోర్టు తాజాగా రద్దు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా రద్దు చేసిన బొగ్గు బ్లాకుల జాబితాలో కరీంనగర్ జిల్లాలోని తాడిచెర్ల-1 బొగ్గు బ్లాకు కూడా ఉంది. దీనిపై ఆధారపడే వరంగల్ జిల్లాలో 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటు(కేటీపీపీ)ను నిర్మిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది ఉత్పత్తి దశకు చేరే అవకాశమున్న తరుణంలో బొగ్గు బ్లాకు రద్దయింది. తాడిచర్ల-1 బ్లాకును అభివృద్ధి చేసే బాధ్యతను సింగరేణికి జెన్‌కో అప్పగించింది. పనులను సకాలంలో ప్రారంభించని కారణంగా సుప్రీం నిర్ణయంతో దీన్ని కోల్పోవలసి వచ్చింది. దీంతో కేటీపీపీ ప్లాంటు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాగా, అటు ఆంధ్రప్రదేశ్‌పైనా సుప్రీం తీర్పు ప్రభావం చూపుతోంది. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)కు ఒడిశాలో 900 మిలియన్ టన్నుల నిల్వలున్న నవ్‌గావ్-తెలిసాహీ బ్లాకుతో పాటు మధ్యప్రదేశ్‌లో 150 మిలియన్ టన్నుల నిల్వలున్న సులియారీ-తెల్వార్ బ్లాకును కేంద్రం కేటాయించింది. ఈ రెండు బ్లాకులు కూడా తాజాగా రద్దయ్యాయి. ఈ బ్లాకుల నుంచి వచ్చే బొగ్గును 800 మెగావాట్ల వీటీపీఎస్ ప్లాంటుకు, 800 మెగావాట్ల కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్)కు అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే, ఈ బొగ్గు బ్లాకుల అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియను ప్రారంభించడం, ఆయా రాష్ట్రాల్లోని ఖనిజాభివృద్ధి సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం వంటి చర్యలను ఏపీఎండీసీ ఇప్పటివరకు చేపట్టలేదు. ఈ బ్లాకులు రద్దవడం వల్ల ఇరు రాష్ట్రాలకూ కలిపి 1095 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు దక్కకుండా పోయాయి. దీంతో ఇంధన శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
రివ్యూ పిటిషన్ వేస్తాం: టీ జెన్‌కో
తాడిచర్ల-1 బ్లాకును రద్దు చేయడంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని భావిస్తున్నట్లు టీ-జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు రాకముందే బొగ్గు బ్లాకు రద్దు కాకుండా చూసేందుకు ఇంప్లీడ్ పిటిషన్ వేసినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు.బొగ్గు బ్లాకును మళ్లీ దక్కించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు దెబ్బ
Published Thu, Sep 25 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM
Advertisement
Advertisement