
ఎంపీ కార్యాలయం ముట్టడి
ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసిన రైల్వే అధికారులు
ఆందోళనలో పాత రాజరాజేశ్వరీపేట వాసులు
విజయవాడ : తమ ఇళ్లను తొలగించవద్దని పాత రాజరాజేశ్వరీపేట వాసులు ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) కార్యాలయాన్ని ముట్టడిం చారు. రైల్వే లైను పొడిగింపు కోసం పాత రాజ రాజేశ్వరీపేట ఏరియాలో రైల్వే స్థలాల్లో ఆక్రమణలకు రైల్వే అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో వారందరూ గురువారం ఎంపీ కార్యాలయంలోకి వెళ్లి తమ గతేంటని ప్రశ్నిం చారు. మహిళలు బైఠాయించి నిరసన తెలి పారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న సుమారు ఏడెనిమిది వందల ఇళ్లను మూకుమ్మడిగా ఖాళీ చేయాలని రైల్వే శాఖ అధికారులు మూకుమ్మడిగా నోటీసులు జారీ చేశారు. కొందరు నోటీసులు తీసుకున్నారు.
కొద్ది సేపటి తరువాత తాము నోటీసులు తీసుకునేది లేదని వ్యతిరేకించి ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి వారందరూ ప్రదర్శనగా ఎంపీ కార్యాలయానికి చేరుకున్నారు. తమ గతేంటని అక్కడ గలాటా చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రైల్వే స్థలం కావడంతో తాము చేసేది ఏమీలేదని ప్రత్యామ్నాయంగా స్థలాలు ఇప్పిస్తామని ఆందోళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వినలేదు. తమకు ప్రత్నామ్నాయంగా ఇళ్లు నిర్మించి ఇచ్చే వరకు ఖాళీ చేసేది లేదని తెగేసి చెప్పారు. నిర్వాసితులకు న్యాయం చేస్తామని టీడీపీ నాయకులు హామీ ఇవ్వడంతో వారు వెనక్కి వెళ్లిపోయారు.