
సాక్షి ఇండియా స్పెల్‌బీకి విశేష స్పందన
హైదరాబాద్: సాక్షి మీడియా గ్రూప్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'సాక్షి ఇండియా స్పెల్ బీ 2013 - పవర్‌డ్ బై పెప్‌స్సోడెంట్' జోనల్ రౌండ్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. టెలివిజిన్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సాక్షి మీడియా గ్రూప్ విద్యార్థులకు లైవ్లో రాతపరీక్ష నిర్వహించింది. ఈ జోనల్ రౌండ్స్‌లో అర్హత సాధించిన విద్యార్థులు సెమీఫైనల్స్‌కు చేరతారు. అతి త్వరలోనే సెమీఫైనల్స్ నిర్వహిస్తారు.
ఈ స్పెల్‌బీ పరీక్షకు కరీంనగర్‌లో మంచి స్పందన లభించింది. కరీంనగర్‌లో జరిగిన జోనల్ టెస్ట్‌కు కరీంనగర్‌తో పాటు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి విద్యార్థులు హజరయ్యారు. మొత్తం 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం నాలుగు కేటగిరీల్లో పరీక్ష నిర్వహించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అశేష స్పందన లభించింది. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీ పరీక్షలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫ్యూచర్ కిడ్స్ స్కూల్‌లో పరీక్ష నిర్వహించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి 494 మంది విద్యార్థులు పాల్గొన్నారు.