
బోగస్ కార్డుల గుట్టు రట్టు
కర్నూలు : బోగస్ కార్డులను కాపాడుకునేందుకు డీలర్లు వేసిన ఎత్తులు చిత్తయ్యాయి. ఇతరుల ఆధార్ నంబర్లు అనుసంధానం చేసి వారిని కాపాడుకునేందుకు ఆదోని అర్బన్ డీలర్లు చేసిన ప్రయత్నం గుట్టు రట్టయ్యింది. ‘డీలర్లు..మాయగాళ్లు’ శీర్షికతో ఈనెల 27వ తేదీన సాక్షిలో వెలువడిన కథనంపై జేసీ స్పందించి విచారణ జరిపి వాస్తవాలను వెలికితీశారు. ఆదోని అర్బన్ ప్రాంతం నుంచి దాదాపు 50 మందికి పైగా డీలర్లు శుక్రవారం ఉదయం కర్నూలులోని కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
మధ్యాహ్నం నుంచి రాత్రి ఏడు గంటల దాకా జేసీ కన్నబాబు తన చాంబర్‌లో కూర్చుని బోగస్ కార్డుల వ్యవహారంపై విచారణ జరిపారు. పౌర సరఫరాల శాఖలోని కొందరు ఉద్యోగుల సహకారంతోనే డీలర్లు బోగస్ కార్డులను పునరుద్ధరించుకున్నారని వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారానికి రింగ్ లీడర్లుగా వ్యవహరించిన ఏడుగురు డీలర్లతో స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు.
కొంతమంది డీలర్లు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వాస్తవ విషయాలను రాబట్టారు. డీలర్ల మాయాజాలంతో పేదలు కూడా కార్డులు కోల్పోయారా అనే కోణంలో విచారణ జరిపారు. దుకాణాల వారీగా డీలర్లను చాంబర్‌లోకి పిలిపించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతపురం, మహబూబ్ నగర్, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన ఈఐడీ నంబర్లను డీలర్ల దగ్గర ఉన్న బోగస్‌కార్డులకు అనుసంధానం చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
పౌర సరఫరాల శాఖలో పనిచేసే ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్‌సిబ్బంది ఈ అక్రమాలకు సహకరించారు. ఆదోని ప్రాంతంలో మొత్తం ఏడు మంది డీలర్లు రింగ్‌గా ఏర్పడి పౌర సరఫరాల శాఖలో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందితో చేతులు కలిపి ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు వెలుగు చూసింది. డీఎస్‌ఓ కార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగితో పాటు ఆదోని అర్బన్ ప్రాంతంలో పనిచేసే ముగ్గురు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఈ వ్యవహారంలో సూత్రధారులుగా వ్యవహరించి సహకరించారు.
నలుగురు కంప్యూటర్ ఆపరేటర్ల పేర్లు కూడా విచారణలో వెలుగు చూశాయి. డిపార్ట్‌మెంట్‌లో ఎవరు సహకరించారు, ఈఐడీ నంబర్లు ఎలా సంపాదించారు అనే విషయాలపై జేసీ పూర్తి స్థాయిలో ఆరా తీశారు. ఆధార్ కార్డులు ఇవ్వకపోతే రేషన్‌కార్డులను బోగస్‌గా పరిగణిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆధార్ అనుసంధానం వంద శాతం పూర్తి చేయడానికి జిల్లా అధికారులు చర్యలు చేపట్టి మీ సేవ సెంటర్ల ద్వారా కూడా ఈ ప్రక్రియ కొనసాగించేందుకు అనుమతించారు. ఇదే అక్రమార్కులకు అవకాశంగా మారింది. జిల్లాలోని కొన్ని మీ సేవ సెంటర్లలో ఉన్న ఆధార్ నంబర్లను కూడా హైక్ చేసి డీలర్లు తమ వద్ద ఉన్న బోగస్ కార్డులకు అనుసంధానం చేసుకున్నారు.