యాక్టివేట్‌లోకి బోగస్ కార్డులు
ఆధార్ యూఐడీ నెంబర్లు హైజాక్
బోగస్‌కార్డులకు సీడింగ్
భారీగా అవకతవకలు
చేతులు మారుతున్న సొమ్ములు
విశాఖపట్నం: ఆధార్‌ను అడ్డంపెట్టుకుని డీలర్లు మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. అర్హులైన అల్పాదాయ వర్గాల వారికి అందాల్సిన నిత్యావసర సరకులును లూటీ చేసేందుకు స్కెచ్ వేస్తున్నారు. నిరుపేదల బలహీనతలను ఆసరాగా చేసుకుని వేలాది కార్డులను తమ గుప్పెట్లో పెట్టుకుని ప్రతినెలా టన్నుల కొద్దీ నిత్యావసరాలను పక్కదారి పట్టించే ఈ అక్రమార్కులు ఇప్పుడు తమ కడుపు కొడుతున్న ఆధార్‌నే అస్త్రంగా చేసుకుని బోగస్‌కార్డులను..ఇన్‌యాక్టివ్ కార్డులకు జీవం పోస్తున్నారు.
జిల్లాలో 2012రేషన్‌షాపుల పరిధిలో 11,15,106 కార్డులున్నాయి. వీటి పరిధిలో 39,50,420మంది అల్పాదాయవర్గాల వారున్నారు. ఒక్కొక్క షాపు పరిధిలో 200 నుంచి 3,500 వరకు రేషన్‌కార్డులున్నాయి. ఒక్కొక్క షాపు పరిధిలో 50 నుంచి 500 వరకు బోగస్‌కార్డులు (తనఖా పెట్టిన, వలసపోయిన వారి) ఉంటాయని అంచనా. వీటికి సంబంధించిన సరకులను ఇప్పటివరకు ఆయా రేషన్ డీలర్లే డ్రా చేసుకుని పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకునే వారు. ఇప్పుడు ఆధార్ ఈ అక్రమార్కుల పాలిట బ్రహ్మాస్త్రంగా తయారైంది. మొన్నటి వరకు ఈఐడీ సీడింగ్ ఉంటే చాలు సరకులు ఇచ్చేవారు. ప్రస్తుతం యూఐడీ సీడింగ్ ఉంటే కాని సరకులు ఇవ్వడం లేదు. యూఐడీ సీడింగ్ ఉన్న కార్డులకే డిజిటల్ కీ రిజిస్ట్రర్ ప్రకారం సరకులు రిలీజ్ అవుతున్నాయి. దీంతో రేషన్‌షాపు డీలర్ల వద్ద ఉన్న బోగస్ కార్డుల్లో 80 శాతం ఇన్‌యాక్టివ్ అయిపోయాయి. ఇటీవల జిల్లా జాయింట్ కలెక్టర్ నివాస్ జనార్ధనన్ ప్రకటించిన 70,066 ఇన్‌యాక్టివ్ కార్డుల్లో ఎక్కువగా వీరి వద్దే ఉన్నాయి. వీటన్నింటిని ఇప్పుడు యాక్టివ్‌లోకి తీసుకొచ్చేందుకు డీలర్లు కొత్త ఎత్తుగడ వేశారు. ఇందుకు తాజా ఉదాహరణే ఈ ఘటన. జీవీఎంసీలోని సర్కిల్-3 పరిధిలోని ఉన్న ఓ రేషన్‌షాపులో 3వేలకు పైగా కార్డులున్నాయి. ఆధార్ సీడింగ్ కూడా ఈ షాపులో దాదాపు వంద శాతం పూర్తయింది. అలాంటిది ఉన్నట్టుండి ఈ షాపులో ఫిబ్రవరి నెలకొచ్చేసరికి ఏకంగా 1612 కార్డులు ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్లిపోయాయి. ఆరా తీస్తే అధికారులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ డీలర్ చుట్టుపక్కల మరో 10వరకు రేషన్‌షాపులున్నాయి. ఆయా షాపుల వరిధిలో కూడా పెద్ద సంఖ్యలో బోగస్ కార్డులున్నాయి. వాటన్నింటిని యాక్టివ్‌లోకి తీసుకొచ్చేందుకు ఈ షాపులోని సీడింగ్ అయిన కార్డులకు చెందిన యూఐడీ నంబర్లను తొలగించి అన్‌సీడింగ్ జాబితాలో చేర్చి ఆ యూఐడీ నంబర్లను తమ పరిధిలోని బోగస్‌కార్డుల్లోని యూనిట్లతో సీడింగ్ చేశారు.
దీంతో ఆయా షాపులపరిధిలోని సుమారు 1500కు పైగా బోగస్‌కార్డులు యాక్టివ్‌లోకి వచ్చేశాయి. వీటికి ఫిబ్రవరి నెలకు సరకులు కూడా రిలీజ్ అయ్యాయి. సర్కిల్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్లతో డీలర్లు కుమ్మక్కై ఈ అవకతవకలకు పాల్పడినట్టు తెలియవచ్చింది. ఈ ఒక్క షాపు లోనే కాదు..దాదాపు సర్కిల్ పరిధిలోని వందకు పైగా ఉన్న షాపుల్లో ఈ విధమైన అక్రమాలు జరిగినట్టుగా సమాచారం. జిల్లా వ్యాప్తంగా గత రెండుమూడునెలల్లో వేలాదికార్డులు యాక్టివ్ లోకి రావడం కూడా పలు అనుమానాలకుతావిస్తోంది. కొన్ని డిపోల్లో అయితే ఏపీఎల్ కార్డు దారుల యూఐడీ నంబర్లను బోగస్‌కార్డుల్లోని యూనిట్లతో సీడింగ్ చేసి ఇన్‌యాక్టివ్ కార్డులను పెద్ద సంఖ్యలో యాక్టివ్‌లోకి తీసుకొస్తున్నట్టుగా తెలియవచ్చింది. యూఐడీ నంబర్ సరైనదైతే చాలు ఆటోమేటిక్‌గా సీడింగ్ అయిపోతుంది. దీన్ని సాకుగా చూపే ఈ అక్రమార్కులు చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు.
డీలర్ల మాయాజాలం
Published Tue, Feb 24 2015 1:05 AM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM
Advertisement