
బేరం ఆడాలి..
రుణం వస్తుంది కదాని.. రేటెంతయినా ఫర్వాలేదు అనుకోకుండా సాధ్యమైనంతగా బేరం ఆడాలి. వేల రూపాయల విలువైన యాక్సెసరీలు ఫ్రీగా ఇచ్చేస్తున్నామంటూ డీలర్లు, కంపెనీలు ఊదరగొడుతుంటాయి. కొన్ని సార్లు వాస్తవ ధర కంటే అనేక రెట్లు ఎక్కువ చేసి రేటు కట్టి చూపిస్తుంటాయి.
ఇలాంటప్పుడు ఉచిత యాక్సెసరీస్ కన్నా నగదు డిస్కౌంట్లను తీసుకోవడమే ఉత్తమం. అలాగే పాత కారు ఎక్స్ఛేంజీ ఆఫర్లు కూడా. పేరుకి ఎక్స్ఛేంజీ ఆఫర్ అన్నా.. బైట అమ్మితే వచ్చే దానికన్నా చాలా తక్కువ రేటు ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. కాస్త మార్కెట్ రీసెర్చ్ చేస్తే పాత దాని మార్కెట్ విలువ ఎంత ఉందో తెలుసుకోవచ్చు.
ఇక, కారు తయారైన సంవత్సరం కూడా కీలకమేనని గుర్తుంచుకోవాలి. సాధారణంగా పేరుకుపోయిన నిల్వలను అవగొట్టేసేందుకు సంవత్సరం ఆఖర్లో కార్ల కంపెనీలు భారీ డిస్కౌంటు ఆఫర్లు ఇస్తుంటాయి. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ఉదాహరణకు 2014 డిసెంబర్‌లో తీసుకున్న కారు మరికొద్ది రోజులు గడిచి జనవరి వచ్చేసరికి ఒక సంవత్సరం క్రితం నాటి పాత మోడల్ అయిపోతుంది.
గట్టిగా ఏడెనిమిదేళ్లు వాడేట్లయితే ఫర్వాలేదు..కానీ అదే ఏ మూడు నాలుగేళ్లలోనే మార్చాలనుకున్న పక్షంలో .. కేవలం నెల రోజుల కారణంగా 2014 నాటి కారు రీసేల్ వేల్యూ తక్కువగా వస్తుంది. కనుక కొంత ఆలస్యమైనా జనవరిలో కొనడం మంచిదంటారు నిపుణులు. కొత్త కారుపై పెట్టిన పెట్టుబడి పూర్తిగా రాబట్టుకోవాలంటే కనీసం ఎనిమిదే ళ్లయినా వాడాలని సూచిస్తున్నారు.