చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ
12 గంటల్లో ఛేదించిన పోలీసులు..
కాచిగూడ: తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని ఓ మహిళ చిన్నారిని కిడ్నాప్ చేసిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే 12గంటల్లో కేసును చేధించిన కాచిగూడ పోలీసులు చిన్నారిని క్షేమంగా కుటుంబీకులకు అప్పగించారు. కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు మండలం డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ జె.నర్సయ్య, ఏసీపీ రఘు, ఇన్‌స్పెక్టర్ చంద్రకుమార్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు.
సోమవారం రాత్రి కాచిగూడ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ఫుట్‌పాత్‌పై పార్వతమ్మ అనే యాచకురాలు తన మనవరాలు(1.5) శ్రీలక్షి్మతో కలిసి నిద్రించింది. మంగళవారం తెల్లవారుఝామున నిద్ర లేచి చూసేసరికి చిన్నారి కనిపించకపోవడంతో కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఓ మహిళ చిన్నారిని తీసుకుని ఆటోలో అఫ్జల్‌గంజ్ వైపు వెళుతున్నట్లు గుర్తించారు.
దీంతో డబీర్‌పురా రైల్వే స్టేషన్ సమీపంలో సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా కిడ్నాప్ చేసింది తానేనని అంగీకరించింది. కామారెడ్డి జిల్లాకు చెందిన యాచకురాలు దాసరి మంజుల భిక్షాటన కోసం నగరానికి రాకపోకలు సాగించేదని, కిడ్నాప్‌నకు గురైన చిన్నారి శ్రీలక్ష్మి తల్లి మమత ఆమెవద్ద రూ.1500 అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతోనే మంజుల పాపను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు ఆమె మరిది మున్నాతో పాటు ఆమె ఇద్దరు బాలలు సహకరించినట్లు గుర్తించారు. చిన్నారిని ఆమె అమ్మమ్మకు అప్పగించిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment