kachiguda police station
-
అప్పు తిరిగి ఇవ్వ లేదని..
కాచిగూడ: తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని ఓ మహిళ చిన్నారిని కిడ్నాప్ చేసిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే 12గంటల్లో కేసును చేధించిన కాచిగూడ పోలీసులు చిన్నారిని క్షేమంగా కుటుంబీకులకు అప్పగించారు. కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు మండలం డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ జె.నర్సయ్య, ఏసీపీ రఘు, ఇన్స్పెక్టర్ చంద్రకుమార్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. సోమవారం రాత్రి కాచిగూడ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ఫుట్‌పాత్‌పై పార్వతమ్మ అనే యాచకురాలు తన మనవరాలు(1.5) శ్రీలక్షి్మతో కలిసి నిద్రించింది. మంగళవారం తెల్లవారుఝామున నిద్ర లేచి చూసేసరికి చిన్నారి కనిపించకపోవడంతో కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఓ మహిళ చిన్నారిని తీసుకుని ఆటోలో అఫ్జల్‌గంజ్ వైపు వెళుతున్నట్లు గుర్తించారు. దీంతో డబీర్‌పురా రైల్వే స్టేషన్ సమీపంలో సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా కిడ్నాప్ చేసింది తానేనని అంగీకరించింది. కామారెడ్డి జిల్లాకు చెందిన యాచకురాలు దాసరి మంజుల భిక్షాటన కోసం నగరానికి రాకపోకలు సాగించేదని, కిడ్నాప్‌నకు గురైన చిన్నారి శ్రీలక్ష్మి తల్లి మమత ఆమెవద్ద రూ.1500 అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతోనే మంజుల పాపను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు ఆమె మరిది మున్నాతో పాటు ఆమె ఇద్దరు బాలలు సహకరించినట్లు గుర్తించారు. చిన్నారిని ఆమె అమ్మమ్మకు అప్పగించిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
‘జాతిరత్నాలు సినిమాను నిషేధించాలి’
సాక్షి, కాచిగూడ: జాతిరత్నాలు సినిమాలో స్వాతంత్ర సమరయోధులను కించపరిచారని, సినిమా దర్శకుడు, నిర్మాత, నటులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ శివసేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమా గంగాధర్ ఆధ్వర్యంలోని ప్రతినిధులు కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భూమా గంగాధర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధులు రాంప్రసాద్ బిస్మిల్ ఉరికంబం ఎక్కే ముందు పాడిన సర్ ఫరోషికీ తమన్నా హబ్ హమారే దిల్ మీ హై.. కవితను జాతిరత్నాలు సినిమాలో సర్ ఫరోషికీ తమన్నా, సమంతా, రష్మిక, తీనోసాథ్ హాయ్.. అంటూ వెటకారంగా పాడి అవమానించారని తెలిపారు. నేటి తరానికి తప్పుడు సందేశాన్ని అందించిన సినీ రచయిత, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్, కవితను ఆలపించి అవమానపరిచిన గాయకులపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివసేన నేతలు కంజర్ల శ్రీధరాచారి, రితేష్, శ్రీనివాసాచారి, సురేష్, వేణు తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఓటీటీలో జాతిరత్నాలు: మీరనుకునే డేట్ కాదు! సీఎం జగన్ ప్రకటన.. చిరంజీవి హర్షం -
అంతు చూస్తామంటూ కిషన్‌రెడ్డికి బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికి మరోసారి బెదిరింపు ఫోన్ కాల్ రావడం కలకలం రేపింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో కిషన్‌రెడ్డికి కాల్ చేసిన అగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. కిషన్‌రెడ్డి అంతు చూస్తామంటూ హెచ్చరించారు. ఈ ఘటనపై కిషన్‌రెడ్డి బుధవారం కాచిగూడ పోలీసులను ఆశ్రయించారు. కిషన్‌రెడ్డి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా కిషన్‌రెడ్డికి ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. -
ఎక్కువ చేస్తున్నావ్..
సాక్షి, హైదరాబాద్ : అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న కాచిగూడ మహిళా సెక్షన్ అధికారిపై ఓ కార్పొరేటర్ భర్త దౌర్జన్యానికి దిగాడు. ప్రభుత్వ మహిళా ఉద్యోగిని దుర్భాషలాడడమే కాకుండా దురుసుగా ప్రవర్తించాడు. ఇతని దౌర్జాన్యాన్ని సెల్ఫోన్లో చిత్రిస్తున్న ఆమె చేతిలో నుంచి ఫోన్‌ను లాక్కున్నాడు. అంతేకాదు.. వార్నింగ్ ఇచ్చి సంఘటన స్థలం నుంచి ఆమెను తరిమేశాడు. దీంతో ఆ మహిళా ఉద్యోగిని విలపిస్తూ ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపారు. వారి ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన బుధవారం కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, బాధితురాలి కథనం ప్రకారం.. జీహెచ్ఎంసీ సర్కిల్–16లో జి.వాణి టౌన్‌ప్లానింగ్ విభాగంలో సెక్షన్ ఆఫీసర్. కాచిగూడ డివిజన్ చెప్పల్‌బజార్‌లోని 3–2–505 డోర్ నంబర్లోని 50 గజాల స్థలంలో సురేష్ అనే వ్యక్తి జి+3 ఇంటి నిర్మాణం చేపట్టాడు. విషయం తెలిసిన వాణి బుధవారం అక్కడికి చేరుకుని సదరు వ్యక్తిని నిర్మాణంపై ప్రశ్నించారు. అనుమతి లేకుంటే నిలిపివేయండని చెప్పారు. దీంతో సురేష్ విషయాన్ని కాచిగూడ కార్పొరేటర్ ఎక్కాల చైతన్య భర్త ఎక్కాల కన్నకు సమాచారం అందించాడు. ఆయన భార్య కార్పొరేటర్‌ను తీసుకొని ఆఘమేఘాలపై అక్కడకు చేరుకున్నాడు. వస్తూ వస్తూనే.. ‘నువ్వు కాచిగూడకు సెక్షన్ ఆఫీసర్‌గా వచ్చి నెలరోజులు కాలేదు. ఎక్కువ చేస్తున్నావ్.. ఏంది సంగతి? ఇక్కడి అక్రమ నిర్మాణంపై ఎవరు ఫిర్యాదు చేశారు? అంటూ ఎక్కాల కన్నా సెక్షన్ ఆఫీసర్‌ను నిలదీశాడు. ఫిర్యాదు కాఫీ చూపించాలంటూ చిందులు తొక్కాడు. అక్రమ నిర్మాణం జరుగుతున్నట్టు తమ దృష్టికి వస్తే ఖచ్చితంగా తాము చర్యలు తీసుకుంటామని ఆమె సమాధామిచ్చారు. దీంతో రెచ్చిపోయిన కార్పొరేటర్ భర్త ఆమెను దుర్భాషలాడాడు. అతని దౌర్జన్యాన్ని అధికారి వాణి తన సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా ఎందుకు వీడియో తీస్తున్నావంటూ ఆమె చేతిలోని ఫోన్‌ను బలవంతంగా లాక్కొన్నాడు. దీంతో భయపడిన ఆమె ఏడుస్తూ అక్కడి నుంచి బయటపడ్డారు. సర్కిల్ డీఎంసీ శ్రీనివాస్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారుల సూచనల మేరకు కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారించి కేసు నమోదు.. సెక్షన్ అధికారిణి జి.వాణి ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆమెను సంఘటన స్థలానికి తీసుకువెళ్లి ఏం జరిగిందనే దానిపై విచారించారు. అంతేగాక వారు తీసిన వీడియోను పరిశీలించారు. సెక్షన్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు ఎక్కాల కన్నాపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాణికి పలువురు అధికారుల మద్దతు కాచిగూడ టౌన్‌ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ జి.వాణిపై కార్పొరేటర్ భర్త దౌర్జన్యం చేసినట్లు తెలుసుకున్న వివిధ సర్కిళ్లల్లో పనిచేస్తున్న సెక్షన్ ఆపీసర్లు ఆమెకు బాసటగా నిలిచారు. పెద్దసంఖ్యలో కాచిగూడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. వాణికి ఓదార్చి ధైర్యం చెప్పారు. న్యాయం జరిగేవరకు తామంతా వెంట ఉంటామని భరోసానిచ్చారు. -
సీఐ వేధింపుల వల్లే గుండెపోటు: ఏఎస్సై
హైదరాబాద్: పై అధికారుల ఒత్తిడి తట్టుకోలేక విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ అధికారి గుండెపోటుకు గురయ్యారు. నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా పని చేస్తున్న సుందర్ బుధవారం రాత్రి గుండెపోటుకు గురయ్యారు. దీంతో తోటి సిబ్బంది ఆయనను నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. సీఐ వేధింపులతోనే తాను అనారోగ్యానికి గురైనట్లు సుందర్ తెలిపారు. సీఐ తనపై పని ఒత్తిడి పెంచడంతో పాటు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పరిస్థితి ఇలా కావడానికి కారణమైన సీఐ పై చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరారు. -
రైలుకింద పడి చచ్చిపోతున్నాం
► స్నేహితుడికి ఫోన్ చేసిన బీటెక్ విద్యార్థులు ► ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు కాచిగూడ: ‘మేమిద్దరం రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నాం’ అని ఇద్దరు బీటెక్ విద్యార్థులు తమ మిత్రుడికి ఫోన్‌చేసి ఎంఎంటీఎస్ రైలుకింద పడ్డారు. ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ నిరంజన్ నాయక్ తెలిపిన మేరకు.. కోఠి ఇసామియా బజార్ ప్రాంతానికి చెందిన అదిరే యాదగిరి కుమారుడు అదిరే రాజ్‌కుమార్ (20) ఇబ్రహీంపట్నంలోని సిద్ధార్థ కాలేజీలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. రాజ్‌కుమార్ అదే కాలేజీలో చదువుతున్న తన స్నేహితుడు రవితో మలక్‌పేట – డబీర్‌పుర రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ రైలుకిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో రాజ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా రవి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతనిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రవి మలక్‌పేట్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చనిపోయే ముందు కోఠి ఇసామియాబజార్ ప్రాంతానికి చెందిన తన స్నేహితుడు వినయ్‌కి ఫోన్‌చేసి తాము ఇద్దరం రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పి ఫోన్ పెట్టాశారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రేమ వ్యవహరమే రాజ్‌కుమార్ మరణానికి కారణమై ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ రవి వివరాలు తెలియాల్సి ఉంది. -
వీధికుక్కను చంపిన వ్యక్తిపై కేసు నమోదు
హైదరాబాద్‌సిటీ: వీధికుక్కను చంపిన వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ఎస్ఐ జయన్న తెలిపిన వివరాల ప్రకారం..బర్కత్‌పురా భూమన్న లేన్‌లో ఇందిరాభవన్ అపార్ట్మెంట్ వాచ్‌మన్ శరత్(35) తన పిల్లల్ని తీసుకుని బయటకు రాగానే రోడ్డుపైన ఉన్న ఓ వీధికుక్క పిల్లల్ని చూసి మొరగడం ప్రారంభించింది. కుక్క కరస్తుందనే భయంతో వాచ్‌మన్ కుక్కను కొట్టాడు. దీంతో ఆ కుక్క చనిపోయింది. హైకోర్టు అడ్వోకేట్ శ్రేయ పరోపకారి ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శరత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కుక్క మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పూజా.. నువ్వెక్కడ!
- కళాశాలకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైన విద్యార్థిని హైదరాబాద్: మహానగరంలో మరో బాలిక అదృశ్యమైంది. కాచిగూడాలోని నింబోలి అడ్డాకు చెందిన సి. పూజ (16) అనే ఇంటర్ విద్యార్థిని రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయింది. కాలేజీకి వెళ్లొస్తానంటూ 14వ తేది ఉదయం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన పూజ.. రోజులు గుడుస్తున్నప్పటికీ తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తెలిసినవారి ఇళ్లు, వివిధ ప్రాంతాల్లో ఎంతగా గాలించినప్పటికీ పూజ జాడ తెలియరాలేదు. దీంతో పూజ తండ్రి మధుకర్.. సోమవారం కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్ స్పెక్టర్ డి. రాజ్ కుమార్ మాట్లాడుతూ కేసు నమోదు చేసుకుని బాలిక కోసం దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.