టీఢీపీ!
- మరో ఆరు చోట్ల అభ్యర్థుల ఖరారుతో టీడీపీలో మోగిన రె‘బెల్స్’
- భగ్గుమంటున్న కేడర్
- స్వతంత్రులుగా పోటీకి నేతలు రెడీ
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ప్రకటించిన మలివిడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాపై క్యాడర్ భగ్గుమంటోంది. ఆ పార్టీ ఆరు చోట్ల సోమవారం తెల్లవారుజామున అభ్యర్థులను ప్రకటించడంతో ఒక్కసారిగా నిరసన ధ్వనులు పెల్లుబుకాయి. గంటా శ్రీనివాసరావు(భీమిలి), వాసుపల్లి గణేష్ (విశాఖ దక్షిణం), పల్లా శ్రీనివాస యాదవ్( గాజువాక), పైల గోవింద్ (అనకాపల్లి), పంచకర్ల రమేష్(యలమంచిలి), వంగల పూడి అనిత (పాయకరావుపేట) పేర్లను పార్టీ ఖరారు చేసింది. అరకు అసెంబ్లీ అభ్యర్థి {పకటన వాయిదా వేసింది.
విశాఖ లోక్ సభ స్థానాన్ని బీజేపీ నుంచి తిరిగి వెనక్కు తీసుకోవడానికి కొన్నిరోజులుగా శతవిధాలా ప్రయత్నించింది. ఇది తేలే వరకు దానితోముడిపడి ఉన్న అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటను వాయిదా వేసింది. బీజేపీ ససేమిరా అనడంతో చేసేదిలేక చివరాఖరుకు మాజీ మంత్రి గంటాకు భీమిలి అసెంబ్లీ టికెట్ కేటాయించింది. అక్కడ టికెట్ ఆశించిన అవంతి శ్రీనివాస్‌ను గంటా కోసం ఇబ్బంది పెట్టి అనకాపల్లి లోక్‌సభకు పంపింది.
అనకాపల్లి లేదా యలమంచిలి ఇస్తారనుకున్న పంచకర్లకు చివరకు యలమంచిలి సీటును ఖరారు చేసింది. నియోజకవర్గ ఇన్‌చార్జి సుందరపు విజయ్‌కుమార్‌కు మొండిచేయి చూపింది. అనకాపల్లి సీటును బయటి నేతలకు ఇవ్వొద్దని స్థానిక నేతలు పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినా పార్టీ బేఖాతరు చేసి పైలా గోవింద్‌కు సీటిచ్చింది. పాయకరావుపేటలో వంగలపూడి అనిత టికెట్‌పైనా అదే నిరసన. స్థానిక నేతల తీవ్ర వ్యతిరేకతను పట్టించుకోకుండా ఈమె పేరును ఖరారు చేసింది.
రెబల్స్ పోటు
నియోజక వర్గాల్లో నిరసనాగ్నులు రగులుతున్నాయి. గాజువాకలో అయ్యన్న వర్గం నేత కోన తాతారావు, యలమంచిలి నియోజక వర్గ ఇన్‌చార్జి సుందరపు విజయ్‌కుమార్, భీమిలి నుంచి మాజీ మంత్రి అప్పలనరసింహరాజు, సకురు రఘువీర్ తదితరులు నిప్పులు కక్కుతున్నారు. పార్టీని ఓడించడానికి రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగాలని సిద్ధపడుతున్నారు. భర్త రఘువీర్‌కు భీమిలి టికెట్ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అనిత సకురు భీమిలిలో రెబల్‌గా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. గంటా బ్యాచ్ నేత కన్నబాబురాజు తన కుమారుడికి అనకాపల్లి పార్లమెంట్ స్థానం కోసం ప్రయత్నించినా దక్కలేదు. చివరకు తనకూ సీటు లేదు. ఈ నేపథ్యంలో త్వరలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి తన బలం నిరూపించుకుని టీడీపీకి సవాల్ విసరాలని నిర్ణయించుకున్నారు.
మూర్తికి, అయ్యన్నకు మొండిచేయే!
మాజీ ఎంపీ ఎం.వి.వి.ఎస్.మూర్తి విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ సీటును బీజేపీకి ఇవ్వడంతో భీమిలి నుంచి పోటీ చేస్తారనే సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పుడు ఆ స్థానం గంటాకు ఇవ్వడంతో ఆయనకు టికెట్ దొరకలేదని పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి అయ్యన్న వర్గానికి చెందిన కోన తాతారావుకు గాజువాక టికెట్ దక్కలేదు. అయ్యన్నకు వ్యతిరేకంగా గంటా చక్రం తిప్పడం, అక్కడ నియమించిన ఫైవ్‌మెన్‌కమిటీ సూచించిన వలస నేత పైల శ్రీనివాస్‌కు సీటు ఖరారు చేయడంతో అయ్యన్న వ్యతిరేక వర్గం పైచేయి సాధించింది.