వర్షార్పణం | since from five days rain falls crops are damaged very hardly | Sakshi
Sakshi News home page

వర్షార్పణం

Published Sat, Oct 26 2013 2:26 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM

since from five days rain falls crops are damaged very hardly

ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. వేలాది ఎకరాల్లోని పంటలను దెబ్బ తీశాయి. అన్నదాతకు తీరని నష్టం మిగిల్చాయి. చేతికంది వచ్చిన పంట వర్షార్పణం అయింది. నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చెరువులకు గండ్లు పడ్డాయి. పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి భారీగా నీరు చేరింది.    
 
 కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా ఐదు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతను అతలాకుతలం చేస్తున్నాయి. 36 మండలాల్లో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి.  19530 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు,  100 ఎకరాల్లోఉద్యాన పంటలకు నష్టం సంభవించింది.
 
 రాజుపాలెం, దువ్వూరు, మైదుకూరు, సింహాద్రిపురం, చక్రాయపేట, ఖాజీపేట, ఎర్రగుంట్ల, పెండ్లిమర్రి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, చెన్నూరు, సీకేదిన్నె,నందలూరు, పెద్దముడియం, కమలాపురం, వల్లూరు, వీఎన్‌పల్లె, కలసపాడు, బద్వేలు, లింగాల, ముద్దనూరు, చాపాడు, తొండూరు, వేంపల్లి, రామాపురం, గాలివీడు, బ్రహ్మంగారిమఠం, చిన్నమండెం, ఒంటిమిట్ట, రాజంపేట, కడప, కాశీనాయన, సుండుపల్లె, సంబేపల్లె, కొండాపురం, వేముల, రాజంపేట మండలాల్లో పంటలకు భారీ నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక నివేదికలు తయారు చేశారు.
 
 అన్నదాతలకు తీరని నష్టం :
 4150 ఎకరాల్లో వరి, 12,845 ఎకరాల్లో పత్తి, 615 ఎకరాల్లో జొన్న, 130 ఎకరాల్లో మొక్కజొన్న, 1452.5 ఎకరాల్లో వేరుశనగ, 137.5 ఎకరాల్లో సజ్జ, 50 ఎకరాల్లో కొర్ర, 32.5 ఎకరాల్లో పెసర, 5 ఎకరాల్లో పసుపు, 100 ఎకరాల్లో టమోటా పంటలు దెబ్బతిన్నాయి. అనధికారికంగా జమ్మలమడుగులో 50వేల ఎకరాలు, రాజుపాలెంలో 2,500 ఎకరాలు, వేంపల్లెలో 1000, కలసపాడులో 4వేల ఎకరాల్లో మొక్కజొన్న, బద్వేలు మండలంలో సగిలేరు రక్షణ గోడ దెబ్బతినడంతో 1000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
 
 పొంగి ప్రవహిస్తున్న నదులు :
 భారీ వర్షాల కారణంగా జిల్లాలోని నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పెన్నా నదిలో 37వేల క్యూసెక్కులు, కుందూ నదిలో 18వేల క్యూసెక్కులు, సగిలేరులో 10వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. ఎగువ ప్రాంతాల్లో మరిన్ని వర్షాలు కురిస్తే ఈ ప్రవాహాలు మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంటున్నారు.
 
 ఐదు చెరువులకు గండ్లు :
 బద్వేలు మండలంలోని కమలకూరు చెరువు, పోరుమామిళ్ళ మండలంలోని అక్కల్‌రెడ్డిపల్లె చెరువు, తిమ్మారెడ్డిపల్లె చెరువు, కలసపాడు మండలంలోని ముసల్‌రెడ్డిపల్లె చెరువు, కాశినాయన మండలంలోని చెన్నవరం చెరువులకు గండ్లు పడ్డాయి. ఇరిగేషన్ శాఖ పర్యవేక్షక ఇంజనీరు రమేష్ తన బృందంతో కలిసి గండ్లు పడ్డ చెరువులను పరిశీలించారు. గండ్లు పూడ్చేందుకు అవసరమైన చర్యల్లో అధికారులు నిమగ్నమయ్యారు.
 
 పాపాఘ్నిలో ఇద్దరు గల్లంతు :
 వేంపల్లె మండలం అలిరెడ్డిపల్లె రహదారి సమీపంలో పాపాఘ్ని నదిలో ఈదుతూ గోతిలో పడి ఇద్దరు యువకులు గల్లంతు కాగా, మరో యువకుడు సురక్షితంగా బయటపడ్డారు. వేంపల్లె సమీపంలోని సంచుల ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న వైఎస్ నగర్‌కు చెందిన పోలేపల్లె నవీన్, కోనేటి నరహరి (సెకండ్ ఇంటర్  ఎంపీసీ), పసుపులేటి మహేష్ అనే ముగ్గురు యువకులు నదిలోకి ఈతకు వెళ్లారు.
 
 ఇందులో పసుపులేటి మహేష్ సురక్షితంగా బయటపడ్డాడు. మిగిలిన యువకుల ఆచూకీ కోసం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. జనరేటర్‌సహాయంతో రాత్రి కూడా గాలింపు  చేపడతామని, హైదరాబాద్ నుంచి గజ ఈతగాళ్ళను కూడా పిలిపిస్తామని పోలీసులు  తెలిపారు. ఈ సంఘటనతో వైఎస్ నగర్ శోకసముద్రంలో మునిగింది.
 
 వర్షపాతం :
 జిల్లాలోని 36 మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తం మీద సగటున 5.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కొండాపురంలో అత్యధికంగా 18.2మి.మీ నమోదైంది. కడప 16.2మి.మీ, వల్లూరు 9.0, పెండ్లిమర్రి 3.4, సీకేదిన్నె 12.2, చెన్నూరు 17.6, ఖాజీపేట 2.0, కమలాపురం 6.0, ఎర్రగుంట్ల 14.0, వీఎన్‌పల్లె 9.6, చక్రాయపేట 8.4, రామాపురం 3.0, గాలివీడు 3.0, పెనగలూరు 3.2, కోడూరు 1.4, చిట్వేలి 10.2, బి.కోడూరు 15.4, బద్వేలు 2.4, గోపవరం 0.4, కాశినాయన 1.0, బ్రహ్మంగారిమఠం 12.4, సిద్దవటం 7.0, అట్లూరు 1.0, జమ్మలమడుగు 12.0. మైలవరం 15.4, పెద్దముడియం 5.2, ముద్దనూరు 5.9, ప్రొద్దుటూరు 2.0, చాపాడు 17.6, దువ్వూరు 11.8, మైదుకూరు 8.4, రాజుపాలెం 12.2, లింగాల 1.2, వేంపల్లె 8.6, వేముల 9.0, తొండూరులో 4.2మి.మీ. వర్షపాతం నమోదైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement