బండిఆత్మకూరు: శింగవరం గ్రామంలో తోపు పోరంబోకు భూమి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం ఈ భూములను పరిశీలించడానికి వచ్చిన ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, తహశీల్దారు సుధాకర్ వాహనాలను గ్రామస్తులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. నిరసనతో ఓంకార క్షేత్రానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శింగవరం గ్రామ పంచాయతీకి చెందిన 564, 567, 570, 571 సర్వేనంబర్లలో 45.24 ఎకరాల తోపు పోరంబోకు భూమి ఉంది. ఈ భూమి సోమయాజులపల్లె గ్రామస్తులు సాగు చేసుకుంటున్నారు. తమకు పట్టాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోరారు.
దీంతో రెవెన్యూ అధికారులు ఈ భూమిని పరిశీలించి తోపు పోరంబోకుగా గుర్తించారు. అయితే ఈ భూమికి పట్టాలు ఇవ్వాలంటే ప్రభుత్వ భూమిగా (ఎ.డబ్ల్యూలాండ్) గా మార్చితేనే పట్టాలు ఇచ్చే అవకాశం ఉంటుందని భావించారు. అయితే తోపు పోరంబోకు భూమిని పట్టాలు ఇవ్వాలంటే గ్రామ పంచాయితీ తీర్మానం తప్పనిసరి. ఈ మేరకు విషయాన్ని శింగవరం గ్రామ పంచాయతీ దృష్టికి అధికారులు తెచ్చారు. అయితే శింగవరం సర్పంచ్ కళావతి, ఆమె భర్త బూరుగయ్య తదితరులు తమ గ్రామంలో పేదలు ఉండగా మరొక్క గ్రామానికి చెందిన వ్యక్తుల కోసం ఎలా తీర్మానం చేస్తామన్నారు. ఈ మేరకు తమ పంచాయతీకి చెందిన పేదలకే భూములు ఇవ్వాలని తీర్మానం చేసి రెవెన్యూ అధికారులకు ఇచ్చారు.
దీంతో సోమయాజులపల్లె, శింగవరం గ్రామాల మధ్య వివాదానికి కారణమైంది. ఈ సమయంలో శుక్రవారం భూముల పరిశీలనకు తహశీల్దార్, ఆర్‌ర్డీఓ గ్రామానికి చేరుకున్నారు. కాగా భూములకు పట్టాలిచ్చేందుకే అధికారులు వచ్చారని భావించిన శింగవరం గ్రామస్తులు అధికారుల వాహనాలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు చేసేదేమి లేక వెనుదిరిగారు. అయితే తమకు స్పష్టమైన హామీ ఇవ్వకుండా అధికారులు వెళ్లిపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ రహదారిపై బైఠాయించారు.
సమాచారం అందుకున్న ఎస్‌ఐ గ్రామానికి చేరుకుని ప్రజలను శాంతింప చేసే ప్రయత్నాలు ఫలించలేదు. భూములను తమ గ్రామంలోని పేదలకు పంపిణీ చేస్తామని ఆర్డీఓ హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని చెప్పారు. కాగా ఇదే రహదారిలో వెళ్లాల్సిన ఓంకార క్షేత్ర భక్తులు మూడు గంటల పాటు వేచి ఉండలేక ఆందోళనకారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారుతుండటంతో సీఐ శివప్రసాద్‌కు సమాచారం అందించగా ఆయన గ్రామానికి చేరుకుని ప్రజలకు నచ్చచెప్పి శాంతింప చేశారు.
శింగవరంలో ఉద్రిక్తత
Published Sat, Nov 15 2014 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM
Advertisement