land conflict
-
ఒక్క గుంట భూమి ఎక్కువున్నా రాజీనామా చేస్తా: మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: చట్టప్రకారం కొనుగోలు చేసిన దానికన్నా ఒక్క గుంట ఎక్కువ ఉన్నా ఆ భూములను తమ పిల్లలు వదిలేస్తారనీ, తాను పదవికి రాజీనామా చేస్తానని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. లేకుంటే ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అక్కడే తన పదవికి రాజీనామా చేసి పోవాలని సవాల్ విసిరారు. ‘నాకు మూడు ఫాంహౌస్‌లు ఉన్నాయంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రచారం చేయడం అవివేకం...పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌస్‌లుగా కనిపిస్తే అది ఆయన అజ్ఞానానికి నిదర్శనం’అని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తన స్వగ్రామం పాన్గల్లో ఉన్న భూములు 2014, 2018 ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నవేనని స్పష్టం చేశారు. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది తన సతీమణి సొంత డబ్బులు, బ్యాంకు రుణాలతో కట్టుకున్న ఇల్లు అని వెల్లడించారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న తన ఇద్దరు అమ్మాయిలు చండూరులో సురవరం ప్రతాపరెడ్డి వారసుల నుంచి, ఇతరుల నుంచి చట్టబద్ధంగా భూములు కొన్నారని వివరించారు. ఎస్టీల పేరు మీద కొని తర్వాత మార్చుకున్నారంటూ రఘునందన్ రావు ఆరోపించడం తగదని పేర్కొన్నారు. తల్లితండ్రులను కోల్పోయిన బాలుడు గౌడనాయక్ ను చేరదీసి ఉన్నత చదువులు చదివించానని, ప్రస్తుతం అతను తన ఇంటి వ్యవహారాలు చూసుకుంటున్నాడని తెలిపారు. భూముల రిజి్రస్టేషన్ చేసుకోవడానికి విదేశాల్లో ఉన్న పిల్లలు కరోనా నేపథ్యంలో సకాలంలో రాలేని పరిస్థితుల్లో గౌడనాయక్ పేరు మీద కొంత భూమి రిజిస్టర్ చేసి, తర్వాత పిల్లల తమ పేరు మీదకు మార్చుకున్నారని వివరించారు. రఘునందన్‌పై చట్టపరంగా ముందుకెళ్తాం పెద్దమందడి మండలం మోజెర్లలో 50 ఎకరాల భూమి ఉందని ఆరోపించారనీ, కానీ అది వెల్టూరు గ్రామ పరిధి అని, అక్కడ లండన్‌లో డాక్టర్ గా పనిచేస్తున్న తన మరదలు కవిత, వారి స్నేహితులకు ఉన్న భూమి 11.20 ఎకరాలు మా త్రమేనని వెల్లడించారు. వారు ఇక్కడ ఉండరనీ, తానే అప్పుడప్పుడు పర్యవేక్షణకు వెళ్తుంటానని మంత్రి వివరించారు. దురుద్దేశపూర్వకంగా రఘునందన్‌రావు చేస్తున్న అసత్య ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తామని తెలిపారు. చదవండి: 165 ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఎలా? -
కాకినాడలో ముదురుతున్న SEZ వివాదం
-
పొలం డబ్బుల వివాదంతోనే హత్య
జహీరాబాద్ : మండలంలోని దిడిగి గ్రామంలో మ్యాతరి పుణ్యమ్మ(47) హత్యకు గురైన కేసులో ఆదివారం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. సీఐ నాగరాజు కథనం మేరకు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తు తెలియని స్థితిలో హత్యకు గురైన పుణ్యమ్మ మృతదేహం ఈ నెల 9న ఆమె సొంత చెరుకు తోటలో లభ్యమైంది. దీంతో కుమార్తె జయశీల ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 7న పుణ్యమ్మ కనిపించకుండా పోయింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అదే గ్రామానికి చెందిన ఎం.డి.రజాక్(35)ను నిందితుడిగా గుర్తించారు. రజాక్ పుణ్యమ్మ పొలాన్ని సగం వాటా కింద సాగు చేస్తున్నాడు. పొలంలో పండించిన ఆలుగడ్డ పంట విక్రయించగా వచ్చిన రూ.50వేలలో సగం వాటా రజాక్‌కు రావాల్సి ఉంది. ఈ విషయమై ఎన్ని మార్లు అడిగినా ఆమె రజాక్‌కు డబ్బులు ఇవ్వలేదు. ఈ క్రమంలో 7న మధ్యాహ్నం పుణ్యమ్మ, రజాక్‌లు పొలం వద్ద ఉన్నారు. ఇంతలోనే చింతకాయల వ్యాపారి జిలానీ అక్కడకు వెళ్లి చింతచెట్టు లీజు డబ్బులు రూ.5వేలు పుణ్యవతికి ఇచ్చి వెళ్లాడు. అప్పుడు ఆమె ఆ డబ్బులను దగ్గర పెట్టుకోమని రజాక్ చేతికి ఇచ్చింది. సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని పుణ్యమ్మ రజాక్‌ను కోరింది. తనకు ఆలుగడ్డల డబ్బులు రావాల్సి ఉంది, అందుకే ఈ డబ్బులు ఇవ్వనని రజాక్ సమాధానం ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన రజాక్ తన చేతిలో ఉన్న గొడ్డలితో పుణ్యమ్మపై దాడి చేసి నరికి హత్యకు పాల్పడినట్లు సీఐ వివరించారు. నిందితుడు నేరం అంగీకరించడంతో అతడి నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలితోపాటు రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దిడిగి గ్రామ క్రాస్‌రోడ్డు వద్ద గల ఓ హోటల్లో ఉన్న నిందితుడు రజాక్‌ను పట్టణ ఎస్ఐ ప్రభాకర్‌రావుతో కలిసి వెళ్లి పట్టుకుని విచారించగా హత్యకు పాల్పడినట్లు అంగీకరించాడన్నారు. హత్య కేసును ఛేదించినందుకు పోలీసు సిబ్బంది వెంకటేశం, అమర్నాథ్రెడ్డి, సురేందర్, శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి, సామెల్ల పేర్లను రివార్డు కోసం సిఫారసు చేసినట్లు తెలిపారు. -
శింగవరంలో ఉద్రిక్తత
బండిఆత్మకూరు: శింగవరం గ్రామంలో తోపు పోరంబోకు భూమి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం ఈ భూములను పరిశీలించడానికి వచ్చిన ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, తహశీల్దారు సుధాకర్ వాహనాలను గ్రామస్తులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. నిరసనతో ఓంకార క్షేత్రానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శింగవరం గ్రామ పంచాయతీకి చెందిన 564, 567, 570, 571 సర్వేనంబర్లలో 45.24 ఎకరాల తోపు పోరంబోకు భూమి ఉంది. ఈ భూమి సోమయాజులపల్లె గ్రామస్తులు సాగు చేసుకుంటున్నారు. తమకు పట్టాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోరారు. దీంతో రెవెన్యూ అధికారులు ఈ భూమిని పరిశీలించి తోపు పోరంబోకుగా గుర్తించారు. అయితే ఈ భూమికి పట్టాలు ఇవ్వాలంటే ప్రభుత్వ భూమిగా (ఎ.డబ్ల్యూలాండ్) గా మార్చితేనే పట్టాలు ఇచ్చే అవకాశం ఉంటుందని భావించారు. అయితే తోపు పోరంబోకు భూమిని పట్టాలు ఇవ్వాలంటే గ్రామ పంచాయితీ తీర్మానం తప్పనిసరి. ఈ మేరకు విషయాన్ని శింగవరం గ్రామ పంచాయతీ దృష్టికి అధికారులు తెచ్చారు. అయితే శింగవరం సర్పంచ్ కళావతి, ఆమె భర్త బూరుగయ్య తదితరులు తమ గ్రామంలో పేదలు ఉండగా మరొక్క గ్రామానికి చెందిన వ్యక్తుల కోసం ఎలా తీర్మానం చేస్తామన్నారు. ఈ మేరకు తమ పంచాయతీకి చెందిన పేదలకే భూములు ఇవ్వాలని తీర్మానం చేసి రెవెన్యూ అధికారులకు ఇచ్చారు. దీంతో సోమయాజులపల్లె, శింగవరం గ్రామాల మధ్య వివాదానికి కారణమైంది. ఈ సమయంలో శుక్రవారం భూముల పరిశీలనకు తహశీల్దార్, ఆర్‌ర్డీఓ గ్రామానికి చేరుకున్నారు. కాగా భూములకు పట్టాలిచ్చేందుకే అధికారులు వచ్చారని భావించిన శింగవరం గ్రామస్తులు అధికారుల వాహనాలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు చేసేదేమి లేక వెనుదిరిగారు. అయితే తమకు స్పష్టమైన హామీ ఇవ్వకుండా అధికారులు వెళ్లిపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ రహదారిపై బైఠాయించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ గ్రామానికి చేరుకుని ప్రజలను శాంతింప చేసే ప్రయత్నాలు ఫలించలేదు. భూములను తమ గ్రామంలోని పేదలకు పంపిణీ చేస్తామని ఆర్డీఓ హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని చెప్పారు. కాగా ఇదే రహదారిలో వెళ్లాల్సిన ఓంకార క్షేత్ర భక్తులు మూడు గంటల పాటు వేచి ఉండలేక ఆందోళనకారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారుతుండటంతో సీఐ శివప్రసాద్‌కు సమాచారం అందించగా ఆయన గ్రామానికి చేరుకుని ప్రజలకు నచ్చచెప్పి శాంతింప చేశారు.