ఫిబ్రవరి నుంచి ‘సింగిల్ డెస్క్’
21 రోజుల్లో పరిశ్రమలకు ఆన్‌లైన్‌లోనే అన్ని అనుమతులు: ఏపీ సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో పరిశ్రమలకు 21 రోజుల్లోనే అన్ని అనుమతులు ఆన్‌లైన్‌లో ఇచ్చేలా ‘సింగిల్ డెస్క్’ విధానం వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులు అవసరమైన పరిశ్రమలు మినహా మిగతా అన్నింటికీ 28 రకాల అనుమతులను ఈ డెస్క్ ద్వారా ఇస్తామని తెలిపారు. భారీ పరిశ్రమలకు మాత్రం సీఎం నేతృత్వంలోని ప్యానల్ అనుమతులు ఇస్తుందని, వాటికీ 21 రోజుల్లో అనుమతులు ఇవ్వాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. బుధవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలన్నింటినీ ఆధార్‌తో అనుసంధానిస్తామని చెప్పారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, విద్యార్థులు ఇలా ఎవరికైనాసరే ఆధార్ కార్డు లేనిదే ఏదీ వర్తించదని కుండబద్దలు కొట్టారు. 2022నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే టాప్-3 రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి నంబర్ వన్‌గా నిలుపుతామని తెలిపారు. 2050 నాటికి ప్రపంచంలోనే భారతదేశంతోపాటు రాష్ట్రం కూడా నంబర్ వన్ స్థానాన్ని సాధించాలన్నది తన లక్ష్యమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన రూ. 1,600 కోట్ల రుణాల్లో తమ ప్రభుత్వం రూ.600కోట్లు చెల్లించిందని, మిగతా రూ.1,000 కోట్లను త్వరలోనే చెల్లిస్తామని అన్నారు. విదేశీ పర్యటనల వల్ల ఎన్ని పెట్టుబడులు వచ్చాయన్న విలేకరుల ప్రశ్నకు చంద్రబాబు సూటిగా సమాధానమివ్వలేదు. విదేశాలు వెళ్లి ఏవో రెండు మూడు ఎంవోయూలు కుదుర్చుకోవడం తన ఉద్దేశం కాదని చెప్పారు. రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నామన్నారు. వాన్‌పిక్, లేపాక్షి ప్రాజెక్టుల న్యాయ వివాదాలను పరిష్కరించుకుని వాటిని కొనసాగించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షంలో ఉండగా విశాఖపట్నంలో పీసీపీఐఆర్ ప్రాజెక్టును వ్యతిరేకించిన మాట వాస్తవమేనని, పెట్రో ఆధారిత పరిశ్రమల వల్ల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. పీసీపీఐఆర్ ప్రాజెక్టును చేపడతామని స్పష్టం చేశారు. గతంలో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్తు కేంద్రాలను ప్రజలు వ్యతిరేకించారని చెబుతూ.. ఆ ప్రాజెక్టుల వల్లే అభివృద్ధి జరుగుతుందన్నారు. విభజన బిల్లులోని హామీల సాధనకు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు.
వాణిజ్యానికి ముఖద్వారంగా ఏపీ
ఆగ్నేయాసియా దేశాలతో భారత వాణిజ్య సంబంధాలకు రాష్ట్రాన్ని ముఖద్వారంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు చెప్పా రు. విశాఖపట్నం - కాకినాడ పారిశ్రామిక అభివృద్ధి మండలి ద్వారా విదేశాలతో దేశ వాణిజ్య సంబంధాలకు రాష్ట్రం ప్రధాన కేంద్రంగా మారుతుందన్నారు. ‘ఫార్చ్యూన్ ఇండియా’ పత్రిక బుధవారం విశాఖపట్నంలో నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ టాక్స్ బిజినెస్’ సదస్సులో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో జల, గ్యాస్, విద్యుత్తు, రోడ్, ఫైబర్ గ్రిడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. మూడేళ్లలో ప్రతి ఇంటికి సెకనుకు 15-20 మెగాబైట్ల సామర్థ్యంతో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. కాగ్నిజెంట్ వైఎస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రపంచస్థాయి పరిశోధన కేంద్రాలను ఏర్పాటు అవసరమని చెప్పారు. వృత్తి నిపుణులను ఆకర్షించడం ద్వారానే రాష్ట్రంలోని నగరాలను సిలికాన్ వ్యాలీ తరహాలో అభివృద్ధి చేయగలమని ఐడీజీ ఇన్వెస్ట్‌మెంట్స్ సీఎండీ సుధీర్ సేథీ చెప్పారు. సదస్సు ప్రారంభంలో ‘ఫార్చ్యూ న్ ఇండియా 500’ మెగా ఇష్యూను చంద్రబాబు ఆవిష్కరించారు.