సిరిమానోత్సవానికి హాజరైన అశేష జనవాహిని
సిరుల తల్లి.. పైడితల్లి. ఎన్నిసార్లు అమ్మరూపం చూసినా మళ్లీమళ్లీ చూడాలన్నదే భక్తుల కోరిక. తల్లిని దర్శించుకుంటే సకల సంపదలు కలుగుతాయని, సుఖ సంతోషాలు ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఏటా నిర్వహించే సంబరమే అయినా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా అమ్మ ఆశీస్సుల కోసం భక్తులు పోటెత్తారు. పైడితల్లి ప్రతిరూపం సిరిమాను సంబరం అంబరాన్ని తాగింది. ఉత్సవాన్ని లక్షలాదిమంది భక్తులు తనివితీరా తిలకించి పులకించిపోయారు.
విజయనగరం గంటస్తంభం: భక్తుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం కన్నుల పండువగా సాగింది. లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఉదయం 11.30గంటలకు హుకుంపేటలో పుజారి ఇంటివద్ద బయలుదేరిన సిరిమాను మధ్యాహ్నం 12 గంటలకు పైడితల్లి అమ్మవారి గుడి వద్దకు చేరుకుంది. అక్కడ సిరిమాను రథం కట్టే పని 2.55 గంటలకు ముగిసింది. అనంతరం పుజారి బం టుపల్లి వెంకటరావును సిరిమానుపై అధిష్టించే కార్యక్రమం మొదలైంది. సరిగ్గా 3.50 గంటలకు సిరిమానోత్సవం ప్రారంభమైంది. అమ్మ గుడి నుంచి కోట బురుజు వద్ద శక్తికి మూడుసార్లు మొక్కి తిరిగి చదురుగుడి వద్దకు 5.12కు చేరింది. 5.20 గంటలకు పూజారిని దింపడంతో సిరిమా ను సంబరం ముగిసింది.
సిరిమానుకు ముందు పాలధార
సిరిమానుకు ముం దు దుష్టశక్తుల నీడ పడకుండా అడ్డకట్ట వేసేం దుకు పాలధారతో కట్టు కట్టారు. తర్వాత వేదపండితలు మంత్రాలు, ఆశీస్సులతో ముందుకు కదలగా వెంట తెల్ల ఏనుగు, అంజలిరథం. బెస్తవారి వల నడిచింది.
పోటెత్తిన భక్తజనం
సిరిమానోత్సవానికి ఈ ఏడాది కూడా భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సిరిమానోత్సవం ప్రారంభమవుతుందని ప్రకటించడంతో అధిక సంఖ్యలో భక్తులు కొన్నిగంటల ముందే చేరుకున్నారు. అక్కడే అన్నప్రసాదాలు తీసుకుని, పానీయాలు సేవించి ఉత్సవం ఆద్యంతం చూశా రు. పైడితల్లి చదురుగుడి వైపు ఉన్న ఎంజీ రోడ్డు, అంబటిసత్రం రోడ్డు, కోట వద్ద పాలకొండ రో డ్డు, రాజారావు మేడవైపు రోడ్డు, గురజాడ రోడ్డు జనంతో కిక్కిరిశాయి. సిరిమాను తిరిగే అమ్మవా రి గుడి నుంచి కోట వరకు ఇరువైపులా భారికేడ్లు ఏర్పాటు చేశారు. సుమారు 2లక్షలా 50వేల మంది భక్తులు సిరిమానోత్సవం తిలకించారని అధికారయంత్రాంగం అంచనా వేసింది.
వెలుతురు ఉండగానే ముగిసిన సంబరం
సిరిమానోత్సవాన్ని వెలుతురు ఉండగానే ముగిం చాలని కలెక్టర్ హరిజవహర్‌లాల్, ఎస్పీ పాలరాజు తదితర ఉన్నతాధికారులు నిర్ణయించడంతో అధికారులు ఆ విధంగానే తగు చర్యలు తీసుకున్నారు. సిరిమాను పుజారి ఇంటి వద్ద నుంచి మధ్యాహ్నానికి చదురుగుడి వద్దకు తీసుకురావాలని నిర్ణయించగా ఆర్డీఓ జేవీ మురళి నిర్దేశిత సమయానికి ఈపక్రియ పూర్తి చేయగలిగారు. వెలుతురుండగానే ఉత్సవం ముగిసింది.
ప్రశాంతంగా సాగిన ఉత్సవం
శాంతిభద్రతలు విషయంలో పోలీసులు కూడా తగు చర్యలు తీసుకోవడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఉత్సవమంతా ఆధ్యంతం ప్రశాంతంగా సాగింది. పారి శుద్ధ్యం విషయంలో మున్సిపాల్టీ, భారికేడ్లు విషయంలో ఆర్‌అండ్‌బీ అధికారులు, ఇతర అధికా రులు సమన్వయంతో పని చేయడంతో ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. పోలీసుల ఓవరేక్షన్ వల్ల కొంతమంది భక్తులు సిరిమానోత్సవాన్ని కనులారా వీక్షించలేకపోయారు. మరికొందరు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పోలీసులు మధ్యాహ్నం 12గంటల నుంచి భక్తులను ఎక్కడికక్కడ ఆవేయడం, 2గంటలకు లోపటకు వెళ్లకుండా భారికేడ్లు మూసేయడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఎప్పుడూ లేనివిధంగా ఒక్కో మార్గంలో మూడెంచెలుగా భారికేడ్లు పెట్టడంతో జనం వెళ్లేందుకు ఆస్కారం లేకపోయింది. లోపల అంతా ఖాళీగానే కనిపించింది. దీనికితోడు ఇటీవల సంభవించిన తిత్లీ తుఫాన్ కారణంగా ఒడిశారాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా నుంచి భక్తులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో రద్దీ కాస్త తగ్గింది.
ఒకే వేదికపై నుంచి తిలకించిన రాజులు
విజయనగరం, బొబ్బిలి రాజులు ఒకేవేదికపై నుంచి సిరిమానోత్సవం తిలకించారు. పైడితల్లి అమ్మవారి పండగ పూర్తిగా విజయనగరం రాజులకు చెందినదే. పూసపాటి వంశీయులు ఆడపడుచు కావడంతో పండగలో వారే ప్రత్యేకంగా నిలుస్తారు. పైడితల్లి అమ్మవారు సృష్టికి విజయనగరం, బొబ్బిలి రాజుల మధ్య యుద్ధమే కారణమనేది చరిత్ర. అందుకే బొబ్బిలి రాజులు ఎప్పుడూ ఉత్సవం వైపు కన్నెత్తి చూడరు. కానీ బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కష్ణ రంగారావు వైఎస్సాఆర్ సీపీ నుంచి టీడీపీలో చేరడం, మంత్రి కావడంతో అశోక్‌గజపతిరాజు తదితరులతో కలసి విజయనగరం కోట బురుజుపై నుంచి సిరిమానోత్సవాన్ని తిలకించారు.
డీసీసీబీ వద్ద ఆగకూడదనుకున్నా...
సిరిమానోత్సవంలో మరోసారి మాజీ మంత్రి, వైఎస్సాఆర్ సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబం చర్చనీయాంశంగా మారాయి. వారు కొన్నేళ్లుగా డీసీసీబీ వద్ద కూర్చొని సిరిమానోత్సవాన్ని తిలకించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా బొత్స సత్యనారాయణ కుటుంబంతో పాటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అక్కడే కూర్చొని ఉత్స వం తిలకించారు. అయితే బొత్స కుటుంబం కూర్చున్న డీసీసీబీ వద్ద గత ఏడాది సిరిమాను పలుమార్లు ఆగడంతో వారికి అమ్మవారి ఆశీస్సులు లభించాయి. కావాలని కాకున్నా అమ్మవారి కృప వల్ల అక్కడ సిరిమాను ఆగడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ ఏడాది అక్కడ సిరిమా ను ఆగకుండా చూడాలని పండగ ఏర్పాట్ల సమావేశంలో టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయితే మంగళవారం సిరిమాను మొదటిసారి వచ్చినపుడు, తిరిగి వెళ్లినపుడే సిరిమాను అక్కడే ఆగింది. ఇది టీడీపీ నాయకులకు ఆగ్రహం తెప్పించింది. వెంటనే సిరిమాను లాగే వారికి అక్కడ ఆగకుండా చూడాలని సంకేతాలు వచ్చాయి. కొందరు టీడీపీ నాయకులు అక్కడ ఆగకుండా సిరిమాను ముందు నడిచి వారిపై ఒత్తిడి పెంచారు. అయినా ఆఖరిసారి తిరిగి వెళుతుండగా అక్కడే సిరిమాను ఆగి వెళ్లడంతో జనం చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అమ్మవారి కృప ఉంటే ఎవరెన్ని కుట్రలు చేసినా ఏమీ కాదని పలువురు వ్యాఖ్యానించారు.
అధికారుల సమన్వయం..
పైడితల్లి అమ్మవారి పండగ ప్రశాంతంగా, విజయవంతంగా చేపట్టాలన్న ప్రయత్నం ఫలించింది. అన్ని శాఖల అధికారులూ సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా పని చేయడంతో సిరిమానోత్సవం విజయవంతమైంది. కలెక్టర్ హరిజవహర్‌లాల్ అన్ని శాఖలనూ సమన్వయం చేయడంలో కృతకృత్యులయ్యారు. మొత్తం సమన్వయం చేసే బాధ్యత జేసీ కె వెంకటరమణారెడ్డి, జేసీ 2 సీతారామారావు, డీఆర్వో జె వెంకటరావు, ఆర్డీఓ జేవీ మురళికి అప్పగించారు. శాంతిభద్రతల విషయంలో ఎస్పీ పాలరాజు తగు చర్యలు తీసుకున్నారు. దర్శన ఏర్పాట్లుతోపాటు సిరిమానోత్సవం ప్రశాంతంగా జరిగేందుకు దేవాదాయాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఆశాఖ కమిషనర్ రామచంద్రమూర్తి, డిప్యూటీ కమిషనర్ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి, ఆలయ ఈఓ భానురాజా పర్యవేక్షించారు. సిరిమాను తయారీలో డీఎఫ్‌ఓ జి లక్ష్మణ్ సహకరించారు. 2వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోలేదు. విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్, జిల్లా ఎస్పీ పాలరాజ్, ఓఎస్డీ విక్రాంత్‌పాటిల్, ఏఎస్పీ ఎం.నరిసింహారావు ఎప్పటిప్పుడు సమీక్షించడంతో ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది.
పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
విజయనగరం ఫోర్టు: పైడితల్లి అమ్మవారిని పలు వురు మంత్రులు, ఇతర ప్రముఖులు దర్శించుకున్నారుర. ఆలయ అనువంశిక ధర్మకర్త, విజయనగరం ఎంపీ పూసపాటి ఆశోక్‌గజపతిరాజు దంపతులు, దివంగత ఆనందగజపతి సతీమణి సుధాగజపతిరాజు దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. విద్యుత్‌శాఖ మంత్రి కిమిడి కళావెంకటరావు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామినాయుడు, బొబ్బిలి చిరంజీవులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే వైఎస్సా ర్ సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, ఎమ్మెల్సీ, వైఎస్సాఆర్ సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే సిరిమానోత్సవాన్ని వైఎస్సార్ సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, వెఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరెడ్డి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి వైఎస్సాఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, నాయకులు అవనాపు విక్రమ్ తదితరులు డీసీసీబీ కార్యాలయం నుంచి తిలకించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. కోటపై నుంచి రాష్ట్ర గనులశాఖమంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, కలెక్టర్ హరి జవహర్‌లాల్, ఎంపీ ఆశోక్‌గజపతిరాజు, జెడ్పీ ఛైర్‌పర్శన్ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్, గాదె శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యేలు మీసాల గీత, బొబ్బిలి చిరంజీవులు, పతివాడ నారాయణస్వామినాయుడు, కె.ఎ.నాయుడు, జేసీ కె.వెంకటరమణారెడ్డి తదితరులు వీక్షింంచారు.
Comments
Please login to add a commentAdd a comment