రాజధాని ఎంపికపై చంద్రబాబుతో కమిటీ భేటి
హైదరాబాద్: రాజధాని ఎంపిక అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో శివరామకృష్ణన్ కమిటీ శనివారం భేటి కానుంది. రాష్ట్ర విభజన అనంతరం రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై చంద్రబాబుతో కమిటీ చర్చలు జరుపనుంది.
రాజధాని ఎక్కడ అనే అంశం చర్చించకుండానే యూపీఏ ప్రభుత్వ హయంలో ఆంధ్రప్రదేశ్ ను విభజన చేసింది. తాజా ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పాటైన ప్రభుత్వం రాజధానిపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధాని ఎంపికపై ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో శివరామన కమిటీ పర్యటించింది.
రాజధాని ఎంపిక తమ పనికాదని, తమది టెక్నికల్ నివేదిక మాత్రమేనని శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు రతన్ రాయ్ గతంలో చెప్పారు. సీమాంధ్ర రాజధాని ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వనరులకు సంబంధించిన సాంకేతికపరమైన వివరాల సేకరణ కోసమే తాము రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లు రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ ఇన్‌చార్జి చైర్మన్ డాక్టర్ రతన్‌రాయ్ పర్యటన సందర్భంగా మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే.