రాజధాని ఎంపికపై 24న తొలి భేటీ | SivaramaKrishnan committee to meet on 24th to select Andhra pradesh capital | Sakshi
Sakshi News home page

రాజధాని ఎంపికపై 24న తొలి భేటీ

Published Mon, Apr 21 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 6:17 AM

రాజధాని ఎంపికపై 24న తొలి భేటీ

రాజధాని ఎంపికపై 24న తొలి భేటీ

ఢిల్లీలో సమావేశం కానున్న శివరామకృష్ణన్ కమిటీ
 ఐఏఎస్, ఐపీఎస్‌ల పంపిణీకి రేపు ప్రత్యూష సిన్హా కమిటీ  సమావేశం

 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎంపికకు ఏర్పాటైన కమిటీ తొలిసారిగా ఈ నెల 24న ఢిల్లీలో సమావేశం కానుంది. పదవీ విరమణ చేసిన  ఐఏఎస్ అధికారి కె.సి.శివరామకృష్ణన్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ కొత్త రాజధాని ఎంపికకు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించనుంది. రాజ్‌భవన్, సచివాలయం, శాసనసభ, శాసన మండలి, హైకోర్టు, అతిథి గృహాలు, ఇతర నిర్మాణాలతోపాటు సహజ వనరులు, నీటి వసతి, రవాణా తదితర విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. వీటిని అనుసరించి కొత్త రాజధాని ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు ఏమిటో కమటీ చర్చించనుంది. అదేవిధంగా అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీపై ఏర్పాటైన ప్రత్యూష సిన్హా కమిటీ సమావేశం మంగళవారం జరగనుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ మార్గదర్శకాలను ఈ సమావేశంలో ఖరారు చేయవచ్చని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ అధికారులను ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికి, మిగతా వారిని రోస్టర్ విధానంలో కేటాయించాలని ప్రత్యూష సిన్హా కమిటీ నిర్ణయానికి వచ్చింది. మంగళవారం జరిగే సమావేశంలో దీనికి తుదిరూపం ఇవ్వనుంది. రాష్ట్ర కేడర్ ఉద్యోగుల పంపిణీకి ఏర్పాటైన కమలనాథన్ కమిటీ బుధవారం ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర కేడర్ ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలకు తుదిరూపు ఇవ్వనున్నారు. అలాగే రాష్ట్ర పున ర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న పలు అంశాలపై కేంద్రం తీసుకోవాల్సిన అంశాలపై కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే ఈనెల 24న సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలన్నింటిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ప్రసన్నకుమార్ మహంతి పాల్గొననున్నారు. ఇందుకోసం ఆయన సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు.
 
 ఏపీ భవన్ శబరి బ్లాక్ ఆంధ్రాకు,స్వర్ణముఖి తెలంగాణకు
 
 ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ పంపిణీ కోసం రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యాంబాబు, సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్) ప్రత్యేక కార్యదర్శి రమణారెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. వీరు 19 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఏపీ భవన్‌ను సందర్శించి ఇరు ప్రాంతాలకు పంపిణీ చేయాల్సిన బ్లాక్‌లు, గదులపై బ్లూప్రింట్‌ను రూపొందించి, గవర్నర్‌కు ఇవ్వనున్నారు. ఇక్కడి శబరి బ్లాక్‌ను  ఆంధ్రప్రదేశకు, సర్వముఖి బ్లాక్‌ను తెలంగాణకు కేటాయించాలని అధికారులు ప్రతిపాదించారు. గోదావరి బ్లాకులో ఉన్న గదులను జనాభా నిష్పత్తి ప్రకారం ఇరు రాష్ట్రాలకు కేటాయించనున్నారు. అంబేద్కర్ ఆడిటోరియాన్ని ఇరు రాష్ట్రాలు ఉమ్మడిగా వినియోగించుకోవాలని ప్రతిపాదించనున్నారు.
 
 ఆదాయ వనరులపై నేడు కేంద్ర అధికారులతో ఎస్.పి. సింగ్ భేటీ
 
 ఆదాయ వనరుల పంపిణీకి అనుసరించాల్సిన విధానంపై చర్చించేందుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.పి.సింగ్ సోమవారం ఢిల్లీలో కేంద్ర అధికారులతో భేటీ కానున్నారు. అలాగే ఇరు రాష్ట్రాల్లో ఆదాయ వనరుల సమీకరణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై అధ్యయనం చేయడానికి ఆయన 24వ తేదీన పాట్నా, 29న రాయ్‌పూర్ వెళ్లనున్నారు. ఈ మేరకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement