ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆంధ్రజ్యోతిపై ఫిర్యాదు చేస్తున్న విద్యార్థులు
సాక్షి, అమరావతి: గ్రామ,వార్డు సచివాలయ పరీక్షల్లో హార్టీకల్చర్, సెరికల్చర్‌కు సంబంధించిన ప్రశ్నపత్రాలను అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో(ఎస్కేయూ) రూపొందించారని, అక్కడి నుంచే లీక్ చేశారంటూ ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని వర్సిటీ అధికారులు తీవ్రంగా ఖండించారు. సదరు పత్రికపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తమ యూనివర్సిటీలో హార్టీకల్చర్ విభాగమే లేదని, అలాంటప్పుడు ప్రశ్నాపత్రం ఎలా రూపొందిస్తామని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రం తయారు చేయాలంటూ ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సెరికల్చర్ ప్రొఫెసర్ శంకర్ నాయక్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం లక్షల మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తుండడంతో ఓర్వలేక అక్కసుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ఆ పత్రిక కథనంలో ఏమాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు. పత్రికపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తమ వర్సిటీ రిజిస్ట్రార్‌కు వినతి పత్రం ఇచ్చానని అన్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌కు కూడా మెయిల్ పంపించానని తెలిపారు. తప్పుడు వార్తలు రాసి తమ విశ్వవిద్యాలయ ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్నారని శంకర్ నాయక్ మండిపడ్డారు. వార్తల కోసం యూనివర్సిటీని, ప్రొఫెసర్లను వాడుకోవడం దారుణమని అన్నారు. గతంలో యూనివర్సిటీలో ఎన్నో సమస్యలపై విద్యార్థులతో కలిసి పోరాటం చేశానని గుర్తుచేశారు.
తాను గిరిజన తెగకు(ఎస్టీ) చెందినవాడిని కాబట్టి, తనకు చెడ్డపేరు తీసుకురావడానికి కొందరు వ్యక్తులు తనపై అసత్య ప్రచారం చేస్తున్నట్లు అనుమానంగా ఉందని వెల్లడించారు. ప్రొఫెసర్ శంకర్‌నాయక్ ఇచ్చిన వినతిపత్రం విషయంలో పై అధికారులతో చర్చించి, తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్కేయూ రిజిస్ట్రార్ మల్లికార్జున్‌రెడ్డి చెప్పారు. పత్రికల్లో తప్పుడు వార్తలు రాయడం తమ వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగించే విషయమేనని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ప్రశ్నాపత్రాలు రూపొందించాలంటూ తమకు ఎవరూ సంప్రదించలేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment