Sri Krishna Deva Raya University
-
జీతం రూ.70 వేలు ..చదవ లేరు..రాయలేరు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగ నిరక్షరాస్యులు ఎక్కువైపోయారు. జీతం రూ.50వేల నుంచి రూ.70 వేలు తీసుకుంటున్నా... ఇంగ్లిష్‌లో చిన్న పదం కూడా రాయలేని పరిస్థితి. దీంతో పాలనా పరంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పనుల్లో తీవ్ర జాప్యం ఎస్కేయూలో దాదాపు 40 మంది జూనియర్ అసిస్టెంట్లు తమ ‘డిజిగ్నేషన్’ కూడా ఇంగ్లిష్‌లో సరిగా రాయలేని దుస్థితిలో ఉన్నారు. కనీసం ఒక లెటర్‌ను టైప్ చేసి ఉన్నతాధికారులకు పంపడం కూడా వీరికి చేతకాదు. ఒకప్పుడు డైలీ వేజ్ కింద వారంతా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగాన్ని పరి్మనెంట్ చేసుకుని రికార్డు అసిస్టెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి దక్కించుకున్నారు. అయితే అందుకు తగ్గ నైపుణ్యాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఏదైనా ఫైల్ డ్రాఫ్టింగ్ చేసి ఉన్నతాధికారులకు పంపలేకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇటీవలే వీరందరికీ ప్రత్యేకంగా కంప్యూటర్ నైపుణ్యం పెంపొందించేలా శిక్షణ ఇచ్చినప్పటికీ, అభ్యసించలేక వెనుకబడ్డారు. దీంతో వారందరినీ నైపుణ్యం లేని విధుల్లో నియమించాలని ఉన్నతాధికారులు భావించారు. అయితే జూనియర్ అసిస్టెంట్ల కొరత ఏర్పడుతుందనే ఉద్దేశంతో వారిని ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై వర్సిటీ ఉన్నతాధికారులు తర్జన భర్జన పడుతున్నారు. (చదవండి: బాబు పరిటాల శ్రీరామ్.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడ?) -
ఓర్వలేక అక్కసుతో తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి: గ్రామ,వార్డు సచివాలయ పరీక్షల్లో హార్టీకల్చర్, సెరికల్చర్‌కు సంబంధించిన ప్రశ్నపత్రాలను అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో(ఎస్కేయూ) రూపొందించారని, అక్కడి నుంచే లీక్ చేశారంటూ ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని వర్సిటీ అధికారులు తీవ్రంగా ఖండించారు. సదరు పత్రికపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తమ యూనివర్సిటీలో హార్టీకల్చర్ విభాగమే లేదని, అలాంటప్పుడు ప్రశ్నాపత్రం ఎలా రూపొందిస్తామని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రం తయారు చేయాలంటూ ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సెరికల్చర్ ప్రొఫెసర్ శంకర్ నాయక్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం లక్షల మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తుండడంతో ఓర్వలేక అక్కసుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆ పత్రిక కథనంలో ఏమాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు. పత్రికపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తమ వర్సిటీ రిజిస్ట్రార్‌కు వినతి పత్రం ఇచ్చానని అన్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌కు కూడా మెయిల్ పంపించానని తెలిపారు. తప్పుడు వార్తలు రాసి తమ విశ్వవిద్యాలయ ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్నారని శంకర్ నాయక్ మండిపడ్డారు. వార్తల కోసం యూనివర్సిటీని, ప్రొఫెసర్లను వాడుకోవడం దారుణమని అన్నారు. గతంలో యూనివర్సిటీలో ఎన్నో సమస్యలపై విద్యార్థులతో కలిసి పోరాటం చేశానని గుర్తుచేశారు. తాను గిరిజన తెగకు(ఎస్టీ) చెందినవాడిని కాబట్టి, తనకు చెడ్డపేరు తీసుకురావడానికి కొందరు వ్యక్తులు తనపై అసత్య ప్రచారం చేస్తున్నట్లు అనుమానంగా ఉందని వెల్లడించారు. ప్రొఫెసర్ శంకర్‌నాయక్ ఇచ్చిన వినతిపత్రం విషయంలో పై అధికారులతో చర్చించి, తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్కేయూ రిజిస్ట్రార్ మల్లికార్జున్‌రెడ్డి చెప్పారు. పత్రికల్లో తప్పుడు వార్తలు రాయడం తమ వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగించే విషయమేనని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ప్రశ్నాపత్రాలు రూపొందించాలంటూ తమకు ఎవరూ సంప్రదించలేదని పేర్కొన్నారు. -
హాజరు..అలంకారప్రాయం
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర ఉద్యోగుల హాజరు కోసం ఏర్పాటు చేసిన ఆధార్ బయోమెట్రిక్ పరికరాలు అలంకారప్రాయంగా మిగిలాయి. ఉద్యోగుల సమయ పాలన కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన హాజరు యంత్రాలు వినియోగంలోలేకుండా పోయాయి. ఫలితంగా నిధులు దుర్వినియోగమయ్యాయి. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర ఉద్యోగుల హాజరుకోసం రెండేళ్ల క్రితం మొత్తం 40 బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క రోజు కూడా పని చేయలేదు. 40 బయోమెట్రిక్ పరికరాలకు మొత్తం రూ.7.20 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. బయోమెట్రిక్ పరికరాలు కేవలం అలంకారప్రాయంగా గోడలకే పరిమితమయ్యాయి. రూ.లక్షలు వెచ్చించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఉద్యోగులు , విద్యార్థులు సమయపాలన పాటించడం లేదు. రీఛార్జ్ మాత్రం ఫుల్ వర్సిటీలో ఏర్పాటు చేసిన పనిచేయని బయోమెట్రిక్ పరికరాలకు మాత్రం క్రమం తప్పకుండా రీఛార్జ్ చేస్తున్నారు. ప్రతి నెలా 40 సిమ్‌లకు రూ.11,500 రీఛార్జ్ చేయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన బిల్లులను సైతం ప్రతి నెలా విశ్వవిద్యాలయం చెల్లిస్తోంది. ఇప్పటి దాకా రీచార్జ్లకే రూ.2 లక్షలకు పైగా డబ్బులు చెల్లించి వర్సిటీ నిధులు దుర్వినియోగం చేశారు. బయోమెట్రిక్ పరికరాలకు చెల్లించిన మొత్తంతో పాటు రీఛార్జ్ నిధులు దుర్వినియోగమయ్యాయి. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఐడీ కార్డులకు లక్షల్లో నిధులు మంజూరు వర్సిటీలో బోధన, బోధనేతర ఉద్యోగులకు ఐడీ (వ్యక్తిగత గుర్తింపు కార్డులు )లు జారీ చేశారు. అయితే ఇందులోనూ చేతివాటం ప్రదర్శించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది జూలై 10న ఐడీ కార్డులను జారీ చేశారు. 2 వేల మందికి ఐడీ కార్డులు జారీ చేయడానికి కేవలం రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్ష వరకు ఖర్చవుతుంది. కానీ ఏకంగా రూ.4,74,144 ఐడీ కార్డులు జారీ చేసినందుకు చెల్లించారు. ఇందులోనూ మూడింతలు «అధిక మొత్తాన్ని చేతివాటం ప్రదర్శించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐడీ కార్డుల జారీలో క్లాత్ ట్యాక్ ఒక్కొక్కటి నాణ్యత గల వస్తువు మార్కెట్లో రూ.5లు అందుబాటులో ఉండగా, రూ. 9లు చెల్లించారు. మైఫై కార్డులు రూ.7లు అందుబాటులో ఉండగా, రూ.13 చెల్లించారు. ఇలా ప్రతి వస్తువులోనూ అధిక ధరకు కోట్ చేసి స్వాహా చేశారు. ఐడీ కార్డుల ప్రింటర్‌కు రూ. 57 వేలు చెల్లించారు. ఇలా ప్రతి అంశంలోనూ అందినకాడికి దోచుకున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి వర్సిటీ నిధులను స్వాహా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు భావిస్తున్నారు. -
నియామకం.. అక్రమం
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాల నియామకం అక్రమ మార్గంలో సాగుతోంది. అస్మదీయులకైతే ఎలాంటి విధి విధానాలు లేకుండా, నిబంధనలను కూడా పక్కనపెట్టి అందలం ఎక్కిస్తున్నారు. వైస్ ఛాన్స్లర్ ఆదేశాలు లేకుండా నేరుగా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడనే ధోరణితో బరితెగించి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మిగులు ఉద్యోగులు అధికమైన నేపథ్యంలో ఉద్యోగాలు కల్పించడం విమర్శలకు తావిస్తోంది. ఎస్కేయూ ఇంజినీరింగ్ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఓ ఉద్యోగిని డైలీ వేజ్ కింద గత ఏడాది జూన్‌లో విధుల్లోకి తీసుకున్నారు. అయితే వీసీ అనుమతి లేకుండా నేరుగా ఉద్యోగంలోకి తీసుకోవడం వివాదాస్పదమవుతోంది. వాస్తవంగా ప్రతి ఉద్యోగి నియామకానికి వీసీ అనుమతి తప్పనిసరి. ఇందుకు విరుద్ధంగా నియామకం చేపట్టారు. ఆ సమయానికి ఇన్చార్జి వీసీ ఉన్నా.. లెక్క చేయకపోవడం గమనార్హం. ఇప్పటి నుంచి జీతాలు చెల్లించకుండా ఈ ఏడాది మొదటి వారంలో ఏకంగా ఆరు నెలలకు సంబంధించి జీతం ముట్టజెప్పారు. పని చేసిన మొత్తం రోజులకు కాకుండా.. ప్రతి నెలా కేవలం 15 రోజులే పని చేశారని చూపిస్తూ గత జూన్ నుంచి డిసెంబర్ వరకు జీతం చెల్లించారు. కనీసం జీతం చెల్లింపు సమయంలోనూ మాటమాత్రమైనా ఇన్చార్జి వీసీని సంప్రదించలేదని తెలుస్తోంది. కొత్త వీసీని నియమిస్తారనే సమయంలో జీతం చెల్లించడాన్నిచూస్తే అక్రమార్కులు ఈ నియామకం విషయంలో ఎంత పకడ్బందీగా వ్యవహరించారో అర్థమవుతోంది. అవుట్సోర్సింగ్లోనూ అంతులేని అక్రమాలు 2015 ఆగస్టులో తొలిసారిగా అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. అప్పటి ఏజెన్సీకి చెల్లించాల్సిన మొత్తం కంటే అదనంగా చెల్లించి ఉదారత చాటుకుని అక్రమాలకు పాల్పడ్డారు. అనంతరం వచ్చిన ఏజెన్సీకి ఇదే తరహాలోనే అదనపు మొత్తాన్ని చెల్లించారు. వాస్తవానికి కేవలం 72 ఉద్యోగాలకే అనుమతి వచ్చినప్పటికీ.. ఏకంగా 140 ఉద్యోగాలు కట్టబెట్టారు. గార్డెనింగ్, స్వీపర్ కేడర్లతో 100 మందికి పైగా ఉద్యోగం కల్పించారు. వీరంతా ఎక్కడ ఉద్యోగం చేస్తారో.. ఎవరికీ తెలియని పరిస్థితి. కానీ ప్రతి నెలా జీతాలు మాత్రం చెల్లిస్తున్నారు. ఉద్యోగాలకు గైర్హాజరైనా జీతాలు చెల్లిస్తూ అక్రమాలకు ఊతం ఇస్తున్నారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి రూ.9 లక్షలు అదనంగా చెల్లించి అక్రమాలకు పాల్పడ్డారు. అనుమతి లేకుండానే నియామకం వాస్తవానికి అనుమతి లేకుండా నేరుగా ఉద్యోగ నియామకం చేశారు. నేను ఇన్చార్జ్ వీసీగా ఉన్న సమయంలో ఏ ఒక్కరినీ ఉద్యోగంలోకి తీసుకోలేదు. వీసీ ఆదేశాలు లేకుండానే రిజిస్ట్రార్ ఉద్యోగం కల్పించారు. ఈ అంశం గత రెండు రోజుల కిందట నా దృష్టికి వచ్చింది.– ప్రొఫెసర్ ఎంసీఎస్ శుభ,మాజీ ఇన్చార్జ్ వీసీ, ఎస్కేయూ -
వర్సిటీ ఘటనపై మంత్రి ఫైర్
సాక్షి, అమరావతి: ఇటీవల రాయలసీమ విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ పై దాడికి యత్నించిన ఘటనపై స్పందించిన గంటా దాడికి యత్నించిన శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ ఫ్రోపెసర్ రతనప్ప చౌదరిని సస్పండ్ చేయాలని యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీను ఆదేశించారు. ఘటనకు కారకులైన డీఎడ్ కళాశాలల కరస్పాండెంట్ తిరుపతయ్యపై వేటు వేయాలన్నారు. తిరుపతయ్య కళాశాలల అఫిలియేషన్ రద్దు చేయాలని రాయలసీమ వర్సిటీ వీసిని ఆదేశించారు. ఉన్నతాధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే సహించేదిలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. -
దూర..పరీక్ష
డిగ్రీ పరీక్షలు ఎప్పుడుంటాయి..? ఇదేం ప్రశ్న.. ఏటా మార్చిలోనో.. ఏప్రిల్‌లోనో ఉంటాయంటారా..! కానీ ఎస్కేయూ దూరవిద్య అధికారులు మాత్రం కాస్త డిఫరెంట్. రెండేళ్లు..లేదా మూడేళ్లవి కలిపి ఒకేసారి నిర్వహిస్తారు..! పోనీ అదైనా తేదీ చెప్పండని అడిగితే.. అంతా మా ఇష్టం అంటున్నారు. దీంతో విద్యార్థులు అయోమయంలో పడిపోయారు. ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో దూరవిద్య గతితప్పింది. స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తే పరీక్షలు నిర్వహిస్తామని ఓ విభాగం అధికారులు... పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తే స్టడీ మెటీరియల్ అందజేస్తామని మరో విభాగం అధికారులు చెప్పుకుంటూ కాలం వెళ్లదీయడంతో విద్యార్థులకు దిక్కుతోచడం లేదు. ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నప్పటికీ పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కోర్సు గడువు పూర్తయినప్పటికీ, కేవలం ఒక సంవత్సరం పరీక్షలు మాత్రమే అధికారులు నిర్వహించారు. దీంతో డిగ్రీ కోర్సు చదివే విద్యార్థులు రెండు విద్యాసంవత్సరాలు నష్టపోయారు. పీజీ చదివే విద్యార్థులకు 2017లోనే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, 2018 –19 విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికీ.. పరీక్షలు నిర్వహించలేదు. ఫలితంగా డిగ్రీ, పీజీ విద్యార్థులు కోర్సులు పూర్తి చేయలేక నష్టపోతున్నారు. విభజనతోనే సమస్య దూరవిద్య విభాగాన్ని అడ్మిషన్ల విభాగం, పరీక్షల విభాగంగా విభజించారు. ఇలా రెండు విభాగాలుగా విభజిస్తే పరీక్షలు నిర్వహణ, ఫలితాల ప్రకటన వేగవంతం అవుతుందని అందరూ భావించారు. అయితే ఈ నిర్ణయంతో దూరవిద్య విభాగం పూర్తిగా గాడి తప్పడంతో పాటు విద్యార్థులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇబ్బంది పడుతున్న అభ్యర్థులు డిగ్రీ, పీజీ అర్హతతో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్న క్రమంలో సకాలంలో కోర్సులో అడ్మిషన్ పొందినా..ఫలితం లేని పరిస్థితి నెలకొంది. సాధారణంగా దూరవిద్యలో పదోన్నతులు, అర్ధంతరంగా ఆగిన ఉన్నత విద్యను కొనసాగించే వారే ఎక్కువ మంది ఉన్నారు. పదోన్నతి అవకాశం వచ్చినప్పటికీ, డిగ్రీ, పీజీ కోర్సు పూర్తి కాకపోవడంతో కెరీర్ మరింత ఇబ్బందిలో పడే పరిస్థితి నెలకొంది. స్టడీ మెటీరియల్ పంపిణీలో నిర్లక్ష్యం కోర్సులో అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికీ స్టడీ మెటీరియల్ పంపిణీ చేయాలి. కోర్సు ఫీజులోనే స్టడీ మెటిరీయల్‌కు సంబంధించిన మొత్తాన్ని కట్టించుకుంటారు. డిగ్రీ రెండో , మూడో సంవత్సరం విద్యార్థులు మొత్తం 32 వేల మంది, పీజీ రెండో సంవత్సరానికి సంబంధించి 12 వేల మంది విద్యార్థులు కోర్సు ఫీజు చెల్లించారు. వీరిలో సగం మందికి కూడా స్టడీ మెటీరియల్ పంపిణీ చేయలేదని విద్యార్థులు చెబుతున్నారు. స్టడీ మెటీరియల్ విద్యార్థులకు అందితే పరీక్షలు నిర్వహిస్తామని పరీక్షల అధికారులు, పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తే స్టడీ మెటీరియల్ అందేలా చర్యలు తీసుకుంటామని దూరవిద్య అధికారులు ఇరువురు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా విద్యార్థుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. మెటీరియల్ సరఫరా కాంట్రాక్ట్æ ముగిసింది స్టడీ మెటీరియల్ పంపిణీ చేసే కాంట్రాక్ట్ గడువు ముగిసింది. మెటీరియల్ సరఫరాకు తిరిగి టెండర్లు పిలవాలి. స్టడీ మెటీరియల్ ముద్రించే అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాము. పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తే.. మెటీరియల్ పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటాం. – ప్రొఫెసర్ బీవీ రాఘవులు,దూరవిద్య డైరెక్టర్, ఎస్కేయూ -
అంతా రెడీ..
► ఏప్రిల్ రెండో వారంలో నాక్ కమిటీ పర్యటన ► సమాచార సేకరణలో నిమగ్నమైన ఆయా విభాగాల సిబ్బంది ► సోమవారం సమీక్షించనున్న వీసీ ఎస్కేయూ : శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయాన్ని ఏప్రిల్ రెండో వారంలో నాక్ కమిటీ పరిశీలించనుంది. ఇందు కోసం ఇప్పటికే ఏర్పాట్లను ఎస్కేయూ యాజమాన్యం చేపట్టింది. రూసా (రాష్ట్రీయ ఉచ్ఛరతా శిక్షా అభియాన్) పథకం నుంచి రూ.20 కోట్లు నిధులు రానున్నాయి. వీటితో పాటు రాష్ట్రప్రభుత్వ, వివిధ ఫండింగ్ ఏజెన్సీల నుంచి నిధులు మంజూరయ్యేందుకు నాక్ (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడియేషన్ కౌన్సిల్) గ్రేడింగ్ అవసరముంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది నాక్ బృందం పర్యటనకు ఏర్పాట్లు చేపట్టింది. 2010లో చివరి సారిగా నాక్ కమిటీ పర్యటించి ఎస్కేయూకు బీ గ్రేడ్ కట్టబెట్టింది. ఈ దఫా ఏ గ్రేడ్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఎస్కేయూ యాజమాన్యం ఎన్నో సార్లు విశ్వాసం ప్రకటించింది. అందుకు తగ్గట్టు పరిశోధన, వర్సిటీ అభివృద్ధి చెందిందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు నాక్ కమిటీకి సమగ్ర నివేదిక ఇవ్వడానికి ఐక్యూఏసీ (ఇంటర్ క్వాలిటీ అసెస్మెంట్ సెల్) డెరైక్టర్ ఆచార్య శ్రీధర్ బృందం ఏడాది పాటు భారీగా కసరత్తు చేసింది. స్వయానా సమీక్షించనున్న వీసీ నాక్ గ్రేడింగ్ మెరుగుదలకు ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అన్ని విభాగాల్లోనూ జాతీయ సదస్సులు, వర్క్‌షాప్‌లతో పాటు అధ్యాపకులకు వర్క్‌షాప్‌లు నిర్వహించారు. పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకుంటున్నారు. బోధన పోస్టుల భర్తీ తప్ప తక్కిన అన్ని అంశాలపై దృష్టి సారించారు. నాణ్యమైన పరిశోధనలు పెంచడానికి ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఇటీవలే పీహెచ్డీ అడ్మిషన్లు కల్పించారు. సహ పాఠ్య ప్రణాళికలో భాగమైన క్రీడల్లో విద్యార్థులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. వర్సిటీలోని బయోటెక్నాలజీ విభాగానికి పేటెంట్ దక్కడం నాక్ పాయింట్లు పెరుగుదలకు దోహదం కానున్నాయి. ఇప్పటికే అన్ని విభాగాల్లోను అధ్యాపకుల పనితీరు, పేపర్ ప్రజెంటేషన్లు, విద్యార్థులకు ఎన్ని పీహెచ్‌డీలు ప్రదానం చేశారు, విభాగం పురోగతి, కల్పించిన మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు సమాజానికి ఎన్ని ఉపయోగపడ్డాయి అనే అంశాలను నాక్ కమిటీకి వివరించడానికి రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో లోటుపాట్లను సవరించడానికి ఎస్కేయూ వీసీ ఆచార్య కె.రాజగోపాల్ సోమవారం విభాగాల వారీగా పర్యటించనున్నారు. -
డిగ్రీలోనూ సెమిస్టర్ పరీక్షలు
యూనివర్సిటీ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల్లోని కోర్సులకు ఆధునిక హంగులతో సరి కొత్త విధానాలను రూపొందించనున్నారు. సాంప్రదాయ కోర్సులకు విద్యా సంవత్సరం ముగింపున రాత, ప్రాక్టికల్ పరీక్షల ద్వారా ప్రతిభను గుర్తించేవారు. ఇక నుంచి ఈ విధానాలకు స్వస్తి పలికి సెమిస్టర్ విధానాన్ని అమలుపరచనున్నారు. 2015-16 విద్యా సంవత్సరం నుంచే అమలు చేయడానికి సీడీసీ (కళాశాల అభివృద్ధి కమిటీ) కసరత్తు చేస్తోంది. బుధవారం ఎస్కేయూలోని సీడీసీ కార్యాలయంలో జరిగిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ల సమావేశాన్ని సీడీసీ డీన్ ఆచార్య ఎంసీఎస్ శుభ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ , రాష్ర్ట ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు రాష్ర్ట వ్యాప్తంగా డిగ్రీ కోర్సులలో నూతన విధానాన్ని అవలంబించనున్నారు. నిన్న ఎస్వీ యూనివర్సిటీలో 13 జిల్లాలోని విశ్వవిద్యాలయాల సీడీసీ డీన్ల సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గ్రేడింగ్‌తో పాటు మార్కులు : నూతన సెమిస్టర్ విధానం 2015-16 విద్యా సంవత్సరంలో మెదటి సంవత్సరం విద్యార్థులకు వర్తిస్తుంది. ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు కేటాయిస్తారు. 75 మార్కులు రాత పరీక్షలు, 25 మార్కులు సైన్స్ వారికి ప్రాక్టికల్స్ . ఆర్ట్స్ వారికి 25 మార్కులు ఇంటర్నల్ మార్కులు కేటాయించారు. మాదిరి ప్రశ్నాపత్రాలు కూడా ఎస్కేయూలో జరిగిన సమావేశంలో ఆమోదించారు. సిలబస్ రూపకల్పన పూర్తి అయింది. సెమిస్టర్ విధానానికి తగ్గట్టుగా రూపొందించారు. సైన్స్ సబ్జెక్టులలో కొన్ని ఎస్వీ యూనివర్సిటీకి అప్పగించారు. ఆంత్రోపాలజీ, జియాగ్రఫి, జియాలజీ వంటి సబ్జెక్టుల సిలబస్ రూపకల్పన చేయనున్నారు. కార్యక్రమంలో యూజీ డీన్ ఆచార్య ఎ.మల్లి ఖార్జున రెడ్డి, జువాలజీ బీఓఎస్ చైర్మన్ నాగలింగ రెడ్డి, జ్ఞానేశ్వర్ ,బోజప్ప తదితరులు పాల్గొన్నారు.