అంతా రెడీ..
► ఏప్రిల్ రెండో వారంలో నాక్ కమిటీ పర్యటన
► సమాచార సేకరణలో నిమగ్నమైన ఆయా విభాగాల సిబ్బంది
► సోమవారం సమీక్షించనున్న వీసీ
ఎస్కేయూ : శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయాన్ని ఏప్రిల్ రెండో వారంలో నాక్ కమిటీ పరిశీలించనుంది. ఇందు కోసం ఇప్పటికే ఏర్పాట్లను ఎస్కేయూ యాజమాన్యం చేపట్టింది. రూసా (రాష్ట్రీయ ఉచ్ఛరతా శిక్షా అభియాన్) పథకం నుంచి రూ.20 కోట్లు నిధులు రానున్నాయి. వీటితో పాటు రాష్ట్రప్రభుత్వ, వివిధ ఫండింగ్ ఏజెన్సీల నుంచి నిధులు మంజూరయ్యేందుకు నాక్ (నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడియేషన్ కౌన్సిల్) గ్రేడింగ్ అవసరముంది.
ఇందులో భాగంగానే ఈ ఏడాది నాక్ బృందం పర్యటనకు ఏర్పాట్లు చేపట్టింది. 2010లో చివరి సారిగా నాక్ కమిటీ పర్యటించి ఎస్కేయూకు బీ గ్రేడ్ కట్టబెట్టింది. ఈ దఫా ఏ గ్రేడ్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఎస్కేయూ యాజమాన్యం ఎన్నో సార్లు విశ్వాసం ప్రకటించింది. అందుకు తగ్గట్టు పరిశోధన, వర్సిటీ అభివృద్ధి చెందిందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు నాక్ కమిటీకి సమగ్ర నివేదిక ఇవ్వడానికి ఐక్యూఏసీ (ఇంటర్ క్వాలిటీ అసెస్‌మెంట్ సెల్) డెరైక్టర్ ఆచార్య శ్రీధర్ బృందం ఏడాది పాటు భారీగా కసరత్తు చేసింది.
స్వయానా సమీక్షించనున్న వీసీ
నాక్ గ్రేడింగ్ మెరుగుదలకు ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అన్ని విభాగాల్లోనూ జాతీయ సదస్సులు, వర్క్‌షాప్‌లతో పాటు అధ్యాపకులకు వర్క్‌షాప్‌లు నిర్వహించారు. పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకుంటున్నారు. బోధన పోస్టుల భర్తీ తప్ప తక్కిన అన్ని అంశాలపై దృష్టి సారించారు. నాణ్యమైన పరిశోధనలు పెంచడానికి ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఇటీవలే పీహెచ్‌డీ అడ్మిషన్లు కల్పించారు. సహ పాఠ్య ప్రణాళికలో భాగమైన క్రీడల్లో విద్యార్థులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు.
వర్సిటీలోని బయోటెక్నాలజీ విభాగానికి పేటెంట్ దక్కడం నాక్ పాయింట్లు పెరుగుదలకు దోహదం కానున్నాయి. ఇప్పటికే అన్ని విభాగాల్లోను అధ్యాపకుల పనితీరు, పేపర్ ప్రజెంటేషన్లు, విద్యార్థులకు ఎన్ని పీహెచ్‌డీలు ప్రదానం చేశారు, విభాగం పురోగతి, కల్పించిన మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు సమాజానికి ఎన్ని ఉపయోగపడ్డాయి అనే అంశాలను నాక్ కమిటీకి వివరించడానికి రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో లోటుపాట్లను సవరించడానికి ఎస్కేయూ వీసీ ఆచార్య కె.రాజగోపాల్ సోమవారం విభాగాల వారీగా పర్యటించనున్నారు.