Nock Committee
-
మాజీ సైనికుల పేరిట దోచేశారు!
సాక్షి, విశాఖపట్నం : మాజీ సైనికులను పుట్టించారు. వారి పేరిట ఎప్పుడో పట్టాలు పొందినట్టుగా రికార్డులు సృష్టించారు. దర్జాగా ఎన్వోసీలు సంపాదించారు. వాటిని అడ్డంపెట్టుకుని తమ పేరిట మార్చేసుకున్నారు. వందల కోట్ల విలువైన భూములను కాజేశారు. మాజీ సైనికుల పేరిట విశాఖ కేంద్రంగా సాగిన భూకబ్జాలు జిల్లా వాసులనే కాదు.. రాష్ట్ర ప్రజలనే నివ్వరపోయేలా చేశాయి. అడ్డగోలు ఆర్డర్లే కాదు.. లేని వార్ని ఉన్నట్టుగా చూపించి పట్టాలు సృష్టించడంలో కానీ. వాటికి అడ్డంపెట్టుకుని ఎన్వోసీలు జారీ చేయించడంలో మన వాళ్లు అందవేసిన చేయి. అధికారులను అడ్డంపెట్టుకుని వందల.. వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేయడంలో అధికార టీడీపీ నేతలు లీలలు అన్నీ ఇన్నీ కావు. వాటిలో ఇవి కొన్ని మచ్చుతునకలే. విశాఖపట్నం రూరల్ మండలం(చినగదిలి) కొమ్మాదిలో సర్వే నంబర్ 28/2లో 10.18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. విలువ సుమారు 150 కోట్లు పైమాటే. ఈ భూమిని దాకవరపు రాములు అనే స్వాతంత్య్ర సమరయోధుడు పేరిట 1978 జూన్ 8న విశాఖపట్నం రూరల్ మండల తహశీల్దార్ జారీ చేసినట్టుగా పట్టా పుట్టించారు. ఆయన చనిపోయారని చూపిస్తూ అతని కుటుంబ సభ్యుల నుంచి 7.68 ఎకరాలను రూ.6.02 కోట్లు చెల్లించి హైదరాబాద్‌కు చెందిన జి.శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చేశారు. ఈ మేరకు మధురవాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ నెం. 4439/2012గా రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. మిగిలిన 2.50 ఎకరాల భూమిని విశాఖకు చెందిన ఎం.సుధాకర్‌రావు పేరిట రిజిష్టరు చేయించారు. ఈ బాగోతంపై లోతైన పరిశీలన చేయగా అనేక వాస్తవాలు వెలుగు చూశాయి. 1983 వరకు తాలూకా వ్యవస్థ ఉండేది. ఎన్టీఆర్ హయాంలో తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చారు. కానీ ఇక్కడ విచిత్రమేమిటంటే దాకవరపు రాములుకు 1978లోనే రూరల్ మండల తహశీల్దార్ జారీ చేసినట్టుగా పట్టా పొందడం, ఇదే విషయాన్ని రిజిస్టర్డ్ డాక్యుమెంట్ 346/87లో కూడా చూపడంతో ఈ బాగోతం బండారం బట్టబయలైంది. పైగా ఈ డాక్యుమెంట్లో పేర్కొన్న రాములు కుమారులు, కుమార్తెలంతా విశాఖపట్నం ఎండాడ గ్రామంలోని ఇంటి నెం.1–55 డోర్ నంబర్లో నివాసముంటున్నట్లు పేర్కొనగా, ఆ ఇంట్లో ఆ పేరు గలవాళ్లే లేరని తేలింది. దాకవరపు రాములు వారసులమని చెప్పి సేల్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన దాకవరపు సత్యారావు తదితరులపై విచారణ చేశారు. సిట్‌కు ఫిర్యాదుల వెల్లువ ఈ భూమిలోని 7.68 ఎకరాలు జీపీఏ ద్వారా పొందిన జి.శ్రీనివాసరెడ్డిని, 2.50 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఎం.సుధాకర్‌రావును క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిట్‌కు సైతం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సీపీఐ జిల్లా కార్యదర్శి ఏజే స్టాలిన్ సిట్‌కు ఫిర్యాదు చేశారు. సీపీఐతో పాటు వైఎస్సార్ సీపీ ఇతర విపక్షాలన్నీ ఈ భూబాగోతంపై సిట్‌కు ఫిర్యాదులు కూడా చేశాయి. ఎన్వోసీలపై ప్రత్యేకంగా దర్యాప్తు చేసిన సిట్ 69ఎన్‌వోసీల్లో ఇదొక తప్పుడిదిగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. అసలు ఈ భూమిని ఏ మాజీ సైనికుడికి కేటాయించలేదని సిట్ దర్యాప్తులో తేటతెల్లమైందని తెలుస్తోంది. ఈ మేరకు జరిగిన రిజిస్ట్రేషన్స్ అన్నీ రద్దు చేయడమే కాకుండా ఇందుకు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిట్ సిఫార్సు చేసినట్టు తెలిసింది. అయినా కొమ్మాదిలో నకిలీ ఎన్వోసీ ద్వారా కొనుగోలు చేసిన భూముల చుట్టూ ఇంకా ప్రహరీ మాత్రం కూల్చే సాహసం చేయలేడం లేదు. ఆ భూములను అధికారులు స్వాధీనం చేసుకోలేకపోతున్నారు. కారణం సిట్ దర్యాప్తు వెలుగులోకిరాకపోవడమే. సిట్ నివేదిక వెలుగులోకివస్తే కానీ కబ్జారాయుళ్ల చేతిలో ఉన్న ఇలాంటి వందల కోట్ల విలువైన భూములు వారి చెర నుంచి బయట పడే సూచనలు కన్పించడం లేదు. -
అంతా రెడీ..
► ఏప్రిల్ రెండో వారంలో నాక్ కమిటీ పర్యటన ► సమాచార సేకరణలో నిమగ్నమైన ఆయా విభాగాల సిబ్బంది ► సోమవారం సమీక్షించనున్న వీసీ ఎస్కేయూ : శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయాన్ని ఏప్రిల్ రెండో వారంలో నాక్ కమిటీ పరిశీలించనుంది. ఇందు కోసం ఇప్పటికే ఏర్పాట్లను ఎస్కేయూ యాజమాన్యం చేపట్టింది. రూసా (రాష్ట్రీయ ఉచ్ఛరతా శిక్షా అభియాన్) పథకం నుంచి రూ.20 కోట్లు నిధులు రానున్నాయి. వీటితో పాటు రాష్ట్రప్రభుత్వ, వివిధ ఫండింగ్ ఏజెన్సీల నుంచి నిధులు మంజూరయ్యేందుకు నాక్ (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడియేషన్ కౌన్సిల్) గ్రేడింగ్ అవసరముంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది నాక్ బృందం పర్యటనకు ఏర్పాట్లు చేపట్టింది. 2010లో చివరి సారిగా నాక్ కమిటీ పర్యటించి ఎస్కేయూకు బీ గ్రేడ్ కట్టబెట్టింది. ఈ దఫా ఏ గ్రేడ్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఎస్కేయూ యాజమాన్యం ఎన్నో సార్లు విశ్వాసం ప్రకటించింది. అందుకు తగ్గట్టు పరిశోధన, వర్సిటీ అభివృద్ధి చెందిందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు నాక్ కమిటీకి సమగ్ర నివేదిక ఇవ్వడానికి ఐక్యూఏసీ (ఇంటర్ క్వాలిటీ అసెస్మెంట్ సెల్) డెరైక్టర్ ఆచార్య శ్రీధర్ బృందం ఏడాది పాటు భారీగా కసరత్తు చేసింది. స్వయానా సమీక్షించనున్న వీసీ నాక్ గ్రేడింగ్ మెరుగుదలకు ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అన్ని విభాగాల్లోనూ జాతీయ సదస్సులు, వర్క్‌షాప్‌లతో పాటు అధ్యాపకులకు వర్క్‌షాప్‌లు నిర్వహించారు. పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకుంటున్నారు. బోధన పోస్టుల భర్తీ తప్ప తక్కిన అన్ని అంశాలపై దృష్టి సారించారు. నాణ్యమైన పరిశోధనలు పెంచడానికి ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఇటీవలే పీహెచ్డీ అడ్మిషన్లు కల్పించారు. సహ పాఠ్య ప్రణాళికలో భాగమైన క్రీడల్లో విద్యార్థులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. వర్సిటీలోని బయోటెక్నాలజీ విభాగానికి పేటెంట్ దక్కడం నాక్ పాయింట్లు పెరుగుదలకు దోహదం కానున్నాయి. ఇప్పటికే అన్ని విభాగాల్లోను అధ్యాపకుల పనితీరు, పేపర్ ప్రజెంటేషన్లు, విద్యార్థులకు ఎన్ని పీహెచ్‌డీలు ప్రదానం చేశారు, విభాగం పురోగతి, కల్పించిన మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు సమాజానికి ఎన్ని ఉపయోగపడ్డాయి అనే అంశాలను నాక్ కమిటీకి వివరించడానికి రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో లోటుపాట్లను సవరించడానికి ఎస్కేయూ వీసీ ఆచార్య కె.రాజగోపాల్ సోమవారం విభాగాల వారీగా పర్యటించనున్నారు.