మాజీ సైనికుల పేరిట దోచేశారు! | Former Soldiers Have Been Robbed | Sakshi
Sakshi News home page

మాజీ సైనికుల పేరిట దోచేశారు!

Published Sun, Jun 17 2018 11:35 AM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM

Former Soldiers Have Been Robbed - Sakshi

లేని మాజీ సైనికుల పేరిట పట్టా, ఎన్‌వోసీలు పొంది చెరబట్టిన భూములివే.. 

సాక్షి, విశాఖపట్నం : మాజీ సైనికులను పుట్టించారు. వారి పేరిట ఎప్పుడో పట్టాలు పొందినట్టుగా రికార్డులు సృష్టించారు. దర్జాగా ఎన్‌వోసీలు సంపాదించారు. వాటిని అడ్డంపెట్టుకుని తమ పేరిట మార్చేసుకున్నారు. వందల కోట్ల విలువైన భూములను కాజేశారు. మాజీ సైనికుల పేరిట విశాఖ కేంద్రంగా సాగిన భూకబ్జాలు జిల్లా వాసులనే కాదు.. రాష్ట్ర ప్రజలనే నివ్వరపోయేలా చేశాయి. అడ్డగోలు ఆర్డర్లే కాదు.. లేని వార్ని ఉన్నట్టుగా చూపించి పట్టాలు సృష్టించడంలో కానీ. వాటికి అడ్డంపెట్టుకుని ఎన్‌వోసీలు జారీ చేయించడంలో మన వాళ్లు అందవేసిన చేయి. అధికారులను అడ్డంపెట్టుకుని వందల.. వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేయడంలో అధికార టీడీపీ నేతలు లీలలు అన్నీ ఇన్నీ కావు. వాటిలో ఇవి కొన్ని మచ్చుతునకలే.


విశాఖపట్నం రూరల్‌ మండలం(చినగదిలి) కొమ్మాదిలో సర్వే నంబర్‌ 28/2లో 10.18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. విలువ సుమారు 150 కోట్లు పైమాటే. ఈ భూమిని దాకవరపు రాములు అనే స్వాతంత్య్ర సమరయోధుడు పేరిట 1978 జూన్‌ 8న విశాఖపట్నం రూరల్‌ మండల తహశీల్దార్‌ జారీ చేసినట్టుగా పట్టా పుట్టించారు. ఆయన చనిపోయారని చూపిస్తూ అతని కుటుంబ సభ్యుల నుంచి 7.68 ఎకరాలను రూ.6.02 కోట్లు చెల్లించి హైదరాబాద్‌కు చెందిన జి.శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ రాసిచ్చేశారు. ఈ మేరకు మధురవాడ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ నెం. 4439/2012గా రిజిస్ట్రేషన్‌ కూడా చేయించారు. మిగిలిన 2.50 ఎకరాల భూమిని విశాఖకు చెందిన ఎం.సుధాకర్‌రావు పేరిట రిజిష్టరు చేయించారు.

ఈ బాగోతంపై లోతైన పరిశీలన చేయగా అనేక వాస్తవాలు వెలుగు చూశాయి. 1983 వరకు తాలూకా వ్యవస్థ ఉండేది. ఎన్టీఆర్‌ హయాంలో తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చారు. కానీ ఇక్కడ విచిత్రమేమిటంటే దాకవరపు రాములుకు 1978లోనే రూరల్‌ మండల తహశీల్దార్‌ జారీ చేసినట్టుగా పట్టా పొందడం, ఇదే విషయాన్ని రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ 346/87లో కూడా చూపడంతో ఈ బాగోతం బండారం బట్టబయలైంది. పైగా ఈ డాక్యుమెంట్‌లో పేర్కొన్న రాములు కుమారులు, కుమార్తెలంతా విశాఖపట్నం ఎండాడ గ్రామంలోని ఇంటి నెం.1–55 డోర్‌ నంబర్‌లో నివాసముంటున్నట్లు పేర్కొనగా, ఆ ఇంట్లో ఆ పేరు గలవాళ్లే లేరని తేలింది. దాకవరపు రాములు వారసులమని చెప్పి సేల్, జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఇచ్చిన దాకవరపు సత్యారావు తదితరులపై విచారణ చేశారు.


సిట్‌కు ఫిర్యాదుల వెల్లువ
ఈ భూమిలోని 7.68 ఎకరాలు జీపీఏ ద్వారా పొందిన జి.శ్రీనివాసరెడ్డిని, 2.50 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఎం.సుధాకర్‌రావును క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సిట్‌కు సైతం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సీపీఐ జిల్లా కార్యదర్శి ఏజే స్టాలిన్‌ సిట్‌కు ఫిర్యాదు చేశారు. సీపీఐతో పాటు వైఎస్సార్‌ సీపీ ఇతర విపక్షాలన్నీ ఈ భూబాగోతంపై సిట్‌కు ఫిర్యాదులు కూడా చేశాయి. ఎన్‌వోసీలపై ప్రత్యేకంగా దర్యాప్తు చేసిన సిట్‌ 69ఎన్‌వోసీల్లో ఇదొక తప్పుడిదిగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. అసలు ఈ భూమిని ఏ మాజీ సైనికుడికి కేటాయించలేదని సిట్‌ దర్యాప్తులో తేటతెల్లమైందని తెలుస్తోంది.

ఈ మేరకు జరిగిన రిజిస్ట్రేషన్స్‌ అన్నీ రద్దు చేయడమే కాకుండా ఇందుకు బాధ్యులైన అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సిట్‌ సిఫార్సు చేసినట్టు తెలిసింది. అయినా కొమ్మాదిలో నకిలీ ఎన్‌వోసీ ద్వారా కొనుగోలు చేసిన భూముల చుట్టూ ఇంకా ప్రహరీ మాత్రం కూల్చే సాహసం చేయలేడం లేదు. ఆ భూములను అధికారులు స్వాధీనం చేసుకోలేకపోతున్నారు. కారణం సిట్‌ దర్యాప్తు వెలుగులోకిరాకపోవడమే. సిట్‌ నివేదిక వెలుగులోకివస్తే కానీ కబ్జారాయుళ్ల చేతిలో ఉన్న ఇలాంటి వందల కోట్ల విలువైన భూములు వారి చెర నుంచి బయట పడే సూచనలు కన్పించడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement