Ex soldiers
-
శిఖం భూములనెలా కేటాయించారు?
సాక్షి, హైదరాబాద్: మాజీ సైనికులకు చెరువు శిఖం భూములను ఎలా కేటాయిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యానికి మాజీ సైనికులెందుకు ఇబ్బందులు పడాలని నిలదీసింది. దేశ సరిహద్దుల్లో సైనికులు లేకపోతే మనకు రక్షణ ఎక్కడుందంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం మండిపడింది. తదుపరి విచారణలోగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించాలని గురువారం ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది. మాజీ సైనికుడు పి.లక్ష్మీనారాయణ రెడ్డికి వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కుమ్మర్‌పల్లి గ్రామ సమీపంలోని సర్వే నెంబర్ 55లో నాలుగు ఎకరాల భూమిని 2010 మే 12న కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పాస్ పుస్తకాన్ని ఇచ్చినా భూమిని మాత్రం అప్పగించలేదు. తనకు భూమిని అప్పగించాలని పలుమార్లు కోరినా స్పందించలేదు. అయితే భూమిని కేటాయించి మూడేళ్లయినా సాగు చేయడం లేదు కాబట్టి కేటాయింపులను రద్దు చేసి ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామంటూ రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులను సవాల్‌చేస్తూ లక్ష్మీనారాయణ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా రెవెన్యూ అధికారుల తీరును తప్పుబడుతూ వెంటనే భూమిని అప్పగించాలని 2017 డిసెంబర్లో ఆదేశించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. లక్ష్మీనారాయణ రెడ్డికి కేటాయించినవి శిఖం భూములని, వాటిని అసైన్మెంట్ కింద ఇవ్వడానికి వీల్లేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. శిఖం భూములని తెలిసినా ఎలా కేటాయించారని, భూమిని అప్పగించాలంటూ పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా ఐదేళ్లు ఎందుకు కాలయాపన చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. శిఖం భూమిని అప్పగించే అవకాశం లేకపోతే వెంటనే ప్రత్యామ్నాయ భూమిని అప్పగించాలని, ఈ విషయాన్ని 11న తెలియజేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
మాజీ సైనికుల పేరిట దోచేశారు!
సాక్షి, విశాఖపట్నం : మాజీ సైనికులను పుట్టించారు. వారి పేరిట ఎప్పుడో పట్టాలు పొందినట్టుగా రికార్డులు సృష్టించారు. దర్జాగా ఎన్వోసీలు సంపాదించారు. వాటిని అడ్డంపెట్టుకుని తమ పేరిట మార్చేసుకున్నారు. వందల కోట్ల విలువైన భూములను కాజేశారు. మాజీ సైనికుల పేరిట విశాఖ కేంద్రంగా సాగిన భూకబ్జాలు జిల్లా వాసులనే కాదు.. రాష్ట్ర ప్రజలనే నివ్వరపోయేలా చేశాయి. అడ్డగోలు ఆర్డర్లే కాదు.. లేని వార్ని ఉన్నట్టుగా చూపించి పట్టాలు సృష్టించడంలో కానీ. వాటికి అడ్డంపెట్టుకుని ఎన్వోసీలు జారీ చేయించడంలో మన వాళ్లు అందవేసిన చేయి. అధికారులను అడ్డంపెట్టుకుని వందల.. వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేయడంలో అధికార టీడీపీ నేతలు లీలలు అన్నీ ఇన్నీ కావు. వాటిలో ఇవి కొన్ని మచ్చుతునకలే. విశాఖపట్నం రూరల్ మండలం(చినగదిలి) కొమ్మాదిలో సర్వే నంబర్ 28/2లో 10.18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. విలువ సుమారు 150 కోట్లు పైమాటే. ఈ భూమిని దాకవరపు రాములు అనే స్వాతంత్య్ర సమరయోధుడు పేరిట 1978 జూన్ 8న విశాఖపట్నం రూరల్ మండల తహశీల్దార్ జారీ చేసినట్టుగా పట్టా పుట్టించారు. ఆయన చనిపోయారని చూపిస్తూ అతని కుటుంబ సభ్యుల నుంచి 7.68 ఎకరాలను రూ.6.02 కోట్లు చెల్లించి హైదరాబాద్‌కు చెందిన జి.శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చేశారు. ఈ మేరకు మధురవాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ నెం. 4439/2012గా రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. మిగిలిన 2.50 ఎకరాల భూమిని విశాఖకు చెందిన ఎం.సుధాకర్‌రావు పేరిట రిజిష్టరు చేయించారు. ఈ బాగోతంపై లోతైన పరిశీలన చేయగా అనేక వాస్తవాలు వెలుగు చూశాయి. 1983 వరకు తాలూకా వ్యవస్థ ఉండేది. ఎన్టీఆర్ హయాంలో తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చారు. కానీ ఇక్కడ విచిత్రమేమిటంటే దాకవరపు రాములుకు 1978లోనే రూరల్ మండల తహశీల్దార్ జారీ చేసినట్టుగా పట్టా పొందడం, ఇదే విషయాన్ని రిజిస్టర్డ్ డాక్యుమెంట్ 346/87లో కూడా చూపడంతో ఈ బాగోతం బండారం బట్టబయలైంది. పైగా ఈ డాక్యుమెంట్లో పేర్కొన్న రాములు కుమారులు, కుమార్తెలంతా విశాఖపట్నం ఎండాడ గ్రామంలోని ఇంటి నెం.1–55 డోర్ నంబర్లో నివాసముంటున్నట్లు పేర్కొనగా, ఆ ఇంట్లో ఆ పేరు గలవాళ్లే లేరని తేలింది. దాకవరపు రాములు వారసులమని చెప్పి సేల్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన దాకవరపు సత్యారావు తదితరులపై విచారణ చేశారు. సిట్‌కు ఫిర్యాదుల వెల్లువ ఈ భూమిలోని 7.68 ఎకరాలు జీపీఏ ద్వారా పొందిన జి.శ్రీనివాసరెడ్డిని, 2.50 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఎం.సుధాకర్‌రావును క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిట్‌కు సైతం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సీపీఐ జిల్లా కార్యదర్శి ఏజే స్టాలిన్ సిట్‌కు ఫిర్యాదు చేశారు. సీపీఐతో పాటు వైఎస్సార్ సీపీ ఇతర విపక్షాలన్నీ ఈ భూబాగోతంపై సిట్‌కు ఫిర్యాదులు కూడా చేశాయి. ఎన్వోసీలపై ప్రత్యేకంగా దర్యాప్తు చేసిన సిట్ 69ఎన్‌వోసీల్లో ఇదొక తప్పుడిదిగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. అసలు ఈ భూమిని ఏ మాజీ సైనికుడికి కేటాయించలేదని సిట్ దర్యాప్తులో తేటతెల్లమైందని తెలుస్తోంది. ఈ మేరకు జరిగిన రిజిస్ట్రేషన్స్ అన్నీ రద్దు చేయడమే కాకుండా ఇందుకు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిట్ సిఫార్సు చేసినట్టు తెలిసింది. అయినా కొమ్మాదిలో నకిలీ ఎన్వోసీ ద్వారా కొనుగోలు చేసిన భూముల చుట్టూ ఇంకా ప్రహరీ మాత్రం కూల్చే సాహసం చేయలేడం లేదు. ఆ భూములను అధికారులు స్వాధీనం చేసుకోలేకపోతున్నారు. కారణం సిట్ దర్యాప్తు వెలుగులోకిరాకపోవడమే. సిట్ నివేదిక వెలుగులోకివస్తే కానీ కబ్జారాయుళ్ల చేతిలో ఉన్న ఇలాంటి వందల కోట్ల విలువైన భూములు వారి చెర నుంచి బయట పడే సూచనలు కన్పించడం లేదు. -
ఏదీ గౌరవం?
సాక్షి, అనంతపురం : వారంతా దేశ రక్షణకు పాటుపడ్డారు. సరిహద్దుల్లో కంటిమీద కునుకు లేకుండా శత్రువుల బారి నుంచి దేశాన్ని కాపాడారు. రెండో ప్రపంచ యుద్ధంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి సేవలందించారు. అలాంటి వారు ప్రభుత్వం నుంచి రావాల్సిన గౌరవ వేతనం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రత్యర్థి సైనికులతో ఎదురొడ్డి పోరాడిన వీరులు వృద్ధాప్యంలో అష్టకష్టాలు పడుతున్నారు. అనారోగ్యం వెంటాడుతుంటే కనీసం మందులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడిన సైనికుల్లో మన రాష్ట్రానికి చెందిన వారు మూడు వేల మంది ఉన్నారు. వీరిలో చిత్తూరు, గుంటూరు జిల్లాల నుంచి అధికంగా ఉన్నారు. అనంతపురం జిల్లాకు సంబంధించి 93 మంది ఉన్నారు. అనారోగ్యం, వృధాప్యంతో జిల్లాలో 86 మంది మృతి చెందగా ఏడుగురు మృత్యువుతో పోరాడుతున్నారు. చనిపోయిన సైనికుల్లో 55 మందికి (మిగిలిన వారి భార్యలు మృతి చెందారు) చెందిన గౌరవ వేతనం వారి భార్యలకు చెల్లిస్తుండగా ఏడుగురు మాజీ సైనికులు గౌరవ వేతనాన్ని తీసుకుంటున్నారు. వీరిలో అనంతపురానికి చెందిన ఖాజా మొహిద్దీన్, హెచ్.రామారావు, బి.రామస్వామి, మహమ్మద్ షరీఫ్, తుముకూరుకు చెందిన టీఎల్ ప్రకాష్ రామారావు, బ్రహ్మసముద్రానికి చెందిన హనుమంతు, గుత్తి జండా వీధికి చెందిన జేఎం అలెగ్జాండర్ ఉన్నారు. సాధారణంగా ప్రభుత్వం అందజేసే పథకాలు ఇతర ప్రయోజనాలకు సైన్యంలో పూర్తి కాలం పనిచేసిన సిపాయిలకు మాత్రమే అర్హులు. కానీ.. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వీరికి రెండు..మూడేళ్లు పనిచేసినా రిటైర్మెంటు డాక్యుమెంటుతో పాటు గుర్తింపు కార్డును అందజేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రాడ్యుటీ పేరుతో వారికి నెలనెలా గౌరవవేతనం ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.70 నుంచి రూ.100, రూ.200 ఇలా అంచలంచెలుగా ఎదిగి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.3 వేలకు చేరుకుంది. వేతనం పెరిగిందే కానీ నెల వారీ సక్రమంగా అందకపోవడంతో మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం బడ్జెట్లో కేటాయిస్తున్న నిధుల్లో నాలుగు విడతలుగా ఒక్కో క్వార్టర్‌కు రూ.9వేలు చొప్పున విడుదల చేస్తున్నట్లు బడ్జెట్ మార్గదర్శకాల్లో పొందుపరిచారు. అయితే ఆ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో ప్రతి ఏటా కేటాయించిన నిధులు మురిగిపోతూ చివరకు వెనక్కు వెళ్లిపోతున్నాయి. దీంతో మరో ఏడాది వచ్చే ఐదారు నెలలకు కలిపి బకాయిల కింద విడుదల చేస్తున్నారు. కాగా 2012-13 ఆర్థిక సంవత్సరానికి గాను పది నెలలుగా నిధులు విడుదల కాలేదు. మాజీ సైనికుల గౌరవ వేతనానికి రూ.10 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు పైసా కూడా అందలేదు. కేటాయింపులు పేపర్లకే పరిమితం కావడం తప్ప బాధితులకు అందడం లేదు. అధికారులు స్పందించి నెలనెలా వేతనం విడుదల చేసి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఉద్యమం వల్ల ఆలస్యమైంది సమైక్య ఉద్యమం కారణంగా ప్రభుత్వం నుంచి నిధులు ఆలస్యం కావడంతో పాటు ట్రెజరీలు పనిచేయక సైనికులకు వేతనాలు చెల్లించలేకపోయాము. నిధులు సిద్ధంగా ఉంటే ఎప్పటికప్పుడు చెల్లిస్తాము. ప్రస్తుతం రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొని జీవించి ఉన్న సైనికులు, వారి భార్యల లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలని సూచించాము. వారు సర్టిఫికెట్లు ఇచ్చిన వెంటనే వేతనాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తాం. - ప్రకాష్, జిల్లా ఇన్చార్జ్ సైనికాధికారి