ఏదీ గౌరవం? | No pensions to Ex soldiers | Sakshi
Sakshi News home page

ఏదీ గౌరవం?

Published Tue, Nov 19 2013 3:41 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

No pensions to Ex soldiers

సాక్షి, అనంతపురం :  వారంతా దేశ రక్షణకు పాటుపడ్డారు. సరిహద్దుల్లో కంటిమీద కునుకు లేకుండా శత్రువుల బారి నుంచి దేశాన్ని కాపాడారు. రెండో ప్రపంచ యుద్ధంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి సేవలందించారు. అలాంటి వారు ప్రభుత్వం నుంచి రావాల్సిన గౌరవ వేతనం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రత్యర్థి సైనికులతో ఎదురొడ్డి పోరాడిన వీరులు వృద్ధాప్యంలో అష్టకష్టాలు పడుతున్నారు. అనారోగ్యం వెంటాడుతుంటే కనీసం మందులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడిన సైనికుల్లో మన రాష్ట్రానికి చెందిన వారు మూడు వేల మంది ఉన్నారు. వీరిలో చిత్తూరు, గుంటూరు జిల్లాల నుంచి అధికంగా ఉన్నారు. అనంతపురం జిల్లాకు సంబంధించి 93 మంది ఉన్నారు.

అనారోగ్యం, వృధాప్యంతో జిల్లాలో 86 మంది మృతి చెందగా ఏడుగురు మృత్యువుతో పోరాడుతున్నారు. చనిపోయిన సైనికుల్లో 55 మందికి (మిగిలిన వారి భార్యలు మృతి చెందారు)  చెందిన గౌరవ వేతనం వారి భార్యలకు చెల్లిస్తుండగా ఏడుగురు మాజీ సైనికులు గౌరవ వేతనాన్ని తీసుకుంటున్నారు. వీరిలో అనంతపురానికి చెందిన ఖాజా మొహిద్దీన్, హెచ్.రామారావు, బి.రామస్వామి, మహమ్మద్ షరీఫ్, తుముకూరుకు చెందిన టీఎల్ ప్రకాష్  రామారావు, బ్రహ్మసముద్రానికి చెందిన హనుమంతు, గుత్తి జండా వీధికి చెందిన జేఎం అలెగ్జాండర్ ఉన్నారు. సాధారణంగా ప్రభుత్వం అందజేసే పథకాలు ఇతర ప్రయోజనాలకు సైన్యంలో పూర్తి కాలం పనిచేసిన సిపాయిలకు మాత్రమే అర్హులు.

 కానీ.. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వీరికి రెండు..మూడేళ్లు పనిచేసినా రిటైర్‌మెంటు డాక్యుమెంటుతో పాటు గుర్తింపు కార్డును అందజేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రాడ్యుటీ పేరుతో వారికి నెలనెలా గౌరవవేతనం ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.70 నుంచి రూ.100, రూ.200 ఇలా అంచలంచెలుగా ఎదిగి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.3 వేలకు చేరుకుంది. వేతనం పెరిగిందే కానీ నెల వారీ సక్రమంగా అందకపోవడంతో మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధుల్లో నాలుగు విడతలుగా ఒక్కో క్వార్టర్‌కు రూ.9వేలు చొప్పున విడుదల చేస్తున్నట్లు బడ్జెట్ మార్గదర్శకాల్లో పొందుపరిచారు. అయితే ఆ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో ప్రతి ఏటా కేటాయించిన నిధులు మురిగిపోతూ చివరకు వెనక్కు వెళ్లిపోతున్నాయి.

దీంతో మరో ఏడాది వచ్చే ఐదారు నెలలకు కలిపి బకాయిల కింద విడుదల చేస్తున్నారు. కాగా 2012-13 ఆర్థిక సంవత్సరానికి గాను పది నెలలుగా నిధులు విడుదల కాలేదు. మాజీ సైనికుల గౌరవ వేతనానికి రూ.10 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు పైసా కూడా అందలేదు.  కేటాయింపులు పేపర్లకే పరిమితం కావడం తప్ప బాధితులకు అందడం లేదు. అధికారులు స్పందించి నెలనెలా వేతనం విడుదల చేసి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
 ఉద్యమం వల్ల ఆలస్యమైంది
 సమైక్య ఉద్యమం కారణంగా ప్రభుత్వం నుంచి నిధులు ఆలస్యం కావడంతో పాటు ట్రెజరీలు పనిచేయక సైనికులకు వేతనాలు చెల్లించలేకపోయాము. నిధులు సిద్ధంగా ఉంటే ఎప్పటికప్పుడు చెల్లిస్తాము. ప్రస్తుతం రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొని జీవించి ఉన్న సైనికులు, వారి భార్యల లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలని సూచించాము. వారు సర్టిఫికెట్లు ఇచ్చిన వెంటనే వేతనాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తాం.
  - ప్రకాష్, జిల్లా ఇన్‌చార్జ్ సైనికాధికారి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement