దూర..పరీక్ష | Suspense On Open Degree Time Table In Sri Krishnadevaraya University | Sakshi
Sakshi News home page

దూర..పరీక్ష

Published Thu, Jun 7 2018 10:34 AM | Last Updated on Thu, Jun 7 2018 10:34 AM

Suspense On Open Degree Time Table In Sri Krishnadevaraya University - Sakshi

డిగ్రీ పరీక్షలు ఎప్పుడుంటాయి..? ఇదేం ప్రశ్న.. ఏటా మార్చిలోనో.. ఏప్రిల్‌లోనో ఉంటాయంటారా..! కానీ ఎస్కేయూ దూరవిద్య అధికారులు మాత్రం కాస్త డిఫరెంట్‌. రెండేళ్లు..లేదా మూడేళ్లవి కలిపి ఒకేసారి నిర్వహిస్తారు..! పోనీ అదైనా తేదీ చెప్పండని     అడిగితే.. అంతా మా ఇష్టం అంటున్నారు. దీంతో విద్యార్థులు అయోమయంలో పడిపోయారు.

ఎస్కేయూ:  శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో దూరవిద్య గతితప్పింది. స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేస్తే పరీక్షలు నిర్వహిస్తామని ఓ విభాగం అధికారులు... పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేస్తే స్టడీ మెటీరియల్‌ అందజేస్తామని మరో విభాగం అధికారులు చెప్పుకుంటూ కాలం వెళ్లదీయడంతో విద్యార్థులకు దిక్కుతోచడం లేదు. ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నప్పటికీ పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కోర్సు గడువు పూర్తయినప్పటికీ, కేవలం ఒక సంవత్సరం పరీక్షలు మాత్రమే అధికారులు నిర్వహించారు. దీంతో డిగ్రీ కోర్సు చదివే విద్యార్థులు రెండు విద్యాసంవత్సరాలు నష్టపోయారు. పీజీ చదివే విద్యార్థులకు 2017లోనే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, 2018 –19  విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికీ.. పరీక్షలు నిర్వహించలేదు. ఫలితంగా డిగ్రీ, పీజీ విద్యార్థులు కోర్సులు పూర్తి చేయలేక నష్టపోతున్నారు. 

విభజనతోనే సమస్య
దూరవిద్య విభాగాన్ని అడ్మిషన్ల విభాగం, పరీక్షల విభాగంగా విభజించారు. ఇలా రెండు విభాగాలుగా విభజిస్తే పరీక్షలు నిర్వహణ, ఫలితాల ప్రకటన వేగవంతం అవుతుందని అందరూ భావించారు. అయితే ఈ నిర్ణయంతో దూరవిద్య విభాగం పూర్తిగా గాడి తప్పడంతో పాటు విద్యార్థులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.

ఇబ్బంది పడుతున్న అభ్యర్థులు
డిగ్రీ, పీజీ అర్హతతో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్న క్రమంలో సకాలంలో కోర్సులో అడ్మిషన్‌ పొందినా..ఫలితం లేని పరిస్థితి నెలకొంది. సాధారణంగా దూరవిద్యలో పదోన్నతులు, అర్ధంతరంగా ఆగిన ఉన్నత విద్యను కొనసాగించే వారే ఎక్కువ మంది ఉన్నారు. పదోన్నతి అవకాశం వచ్చినప్పటికీ, డిగ్రీ, పీజీ కోర్సు పూర్తి కాకపోవడంతో కెరీర్‌ మరింత ఇబ్బందిలో పడే పరిస్థితి నెలకొంది.

స్టడీ మెటీరియల్‌ పంపిణీలో నిర్లక్ష్యం
కోర్సులో అడ్మిషన్‌ పొందిన ప్రతి విద్యార్థికీ స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేయాలి. కోర్సు ఫీజులోనే స్టడీ మెటిరీయల్‌కు సంబంధించిన మొత్తాన్ని కట్టించుకుంటారు. డిగ్రీ రెండో , మూడో సంవత్సరం విద్యార్థులు మొత్తం 32 వేల మంది, పీజీ రెండో సంవత్సరానికి సంబంధించి 12 వేల మంది విద్యార్థులు కోర్సు ఫీజు చెల్లించారు. వీరిలో సగం మందికి కూడా స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేయలేదని విద్యార్థులు చెబుతున్నారు. స్టడీ మెటీరియల్‌ విద్యార్థులకు అందితే పరీక్షలు నిర్వహిస్తామని పరీక్షల అధికారులు, పరీక్షల షెడ్యూల్‌ ప్రకటిస్తే స్టడీ మెటీరియల్‌ అందేలా చర్యలు తీసుకుంటామని దూరవిద్య అధికారులు ఇరువురు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా విద్యార్థుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది.

మెటీరియల్‌ సరఫరా కాంట్రాక్ట్‌æ ముగిసింది  
స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేసే కాంట్రాక్ట్‌ గడువు ముగిసింది. మెటీరియల్‌ సరఫరాకు తిరిగి టెండర్లు పిలవాలి. స్టడీ మెటీరియల్‌ ముద్రించే అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాము. పరీక్షల షెడ్యూల్‌ ప్రకటిస్తే.. మెటీరియల్‌ పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటాం.  – ప్రొఫెసర్‌ బీవీ రాఘవులు,దూరవిద్య డైరెక్టర్, ఎస్కేయూ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement