కూలిన శ్లాబ్ నిర్మాణం
గాజువాక:గాజువాకలోని ఓ షాపింగ్ మాల్‌కు సంబంధించిన భవన నిర్మాణంలో అపశ్రుతి చోటు చేసుకుంది. వేసిన కొన్ని గంటలకే భవనం రెండో అంతస్తు శ్లాబు కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న 8 మంది కార్మికులు గాయపడ్డారు. గాజువాక పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..
స్థానిక చైతన్యనగర్ దరి జాతీయ రహదారికి ఆనుకొని సీఎంఆర్ షాపింగ్ మాల్‌కు సంబంధించిన ఐదంతస్తుల భవనం నిర్మాణంలో ఉంది. మొదటి దశ పనుల్లో భాగంగా గురువారం రాత్రి రెండో అంతస్తు శ్లాబు వేశారు. పనులు పూర్తయిన కొద్ది గంటలకే ఒకపక్క శ్లాబుకు సంబంధించిన డెకింగ్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న ఎనిమిది మంది కార్మికులు గాయాలపాలయ్యారు. శ్రీకాకుళానికి చెందిన ఎం.అప్పారావుకు కాలు విరిగ్గా, ఒడిశాకు చెందిన లక్ష్మీనారాయ్, దినేష్ యాదవ్, శ్రీకాకుళానికి చెంది న టి.రామకృష్ణ, టి.నారాయణ, ఎం.రాంబాబు, ఎం.శ్రీపతినాయుడు, మార్తూర్ యాద వ్ స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అధికారుల పరిశీలన
ప్రమాద స్థలాన్ని గాజువాక ఇన్‌చార్జి తహసీల్దార్ చేతన్ కుమార్, జీవీఎంసీ జోనల్ కమిషనర్ వి.చక్రధరరావు పరిశీలించారు. అనంతరం బాధితులను పరామర్శించి వారి వివరాలను తెలుసుకున్నారు. సైట్ ఇన్‌చార్జులతో మాట్లాడి భవనం పనులకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా గాజువాక జోనల్ కమిషనర్ సాక్షితో మాట్లాడారు.సంబంధిత భవనానికి ఆఫ్‌లైన్ ప్లాన్ ఉందన్నారు. నిర్మాణదారుడు కార్మికులకు బీమా కూడా చేయించారన్నారు. బీమా కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో కూడా తాను మాట్లాడానని తెలిపారు. ఒక్కో బాధితునికి రూ.2 లక్షల చొప్పున పరిహారం మంజూరయ్యే అవకాశం ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment