Slab collapses
-
కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం
సాక్షి, గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్ రోడ్డులో విషాదం చోటు చేసుకుంది. భవనం మొదటి అంతస్తులో నిద్రిస్తున్న కుటుంబంపై ప్రమాదవశాత్తూ స్లాబ్ పెచ్చులు ఊడి పడటంతో భార్య లక్ష్మి మృతి చెందగా, భర్త నాగేశ్వరరావు, కుమారులు సాయిచంద్, సూర్యతేజ గాయపడ్డారు. నీటి పారుదల శాఖలో ఏఈగా పని చేస్తున్న నాగేశ్వరరావు కుటుంబం గత కొన్నాళ్లుగా మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. గతరాత్రి పిల్లలతో సహా గదిలో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా స్లాబ్ పెచ్చులు ఊడి పడ్డాయి. దీంతో మహిళకు తీవ్ర గాయాలు కాగా, మిగిలిన ముగ్గురు కుటుంబ సభ్యులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ లక్ష్మి మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వేసిన గంటల్లోనే.. కూలిన శ్లాబ్
గాజువాక:గాజువాకలోని ఓ షాపింగ్ మాల్‌కు సంబంధించిన భవన నిర్మాణంలో అపశ్రుతి చోటు చేసుకుంది. వేసిన కొన్ని గంటలకే భవనం రెండో అంతస్తు శ్లాబు కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న 8 మంది కార్మికులు గాయపడ్డారు. గాజువాక పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. స్థానిక చైతన్యనగర్ దరి జాతీయ రహదారికి ఆనుకొని సీఎంఆర్ షాపింగ్ మాల్‌కు సంబంధించిన ఐదంతస్తుల భవనం నిర్మాణంలో ఉంది. మొదటి దశ పనుల్లో భాగంగా గురువారం రాత్రి రెండో అంతస్తు శ్లాబు వేశారు. పనులు పూర్తయిన కొద్ది గంటలకే ఒకపక్క శ్లాబుకు సంబంధించిన డెకింగ్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న ఎనిమిది మంది కార్మికులు గాయాలపాలయ్యారు. శ్రీకాకుళానికి చెందిన ఎం.అప్పారావుకు కాలు విరిగ్గా, ఒడిశాకు చెందిన లక్ష్మీనారాయ్, దినేష్ యాదవ్, శ్రీకాకుళానికి చెంది న టి.రామకృష్ణ, టి.నారాయణ, ఎం.రాంబాబు, ఎం.శ్రీపతినాయుడు, మార్తూర్ యాద వ్ స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారుల పరిశీలన ప్రమాద స్థలాన్ని గాజువాక ఇన్చార్జి తహసీల్దార్ చేతన్ కుమార్, జీవీఎంసీ జోనల్ కమిషనర్ వి.చక్రధరరావు పరిశీలించారు. అనంతరం బాధితులను పరామర్శించి వారి వివరాలను తెలుసుకున్నారు. సైట్ ఇన్చార్జులతో మాట్లాడి భవనం పనులకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా గాజువాక జోనల్ కమిషనర్ సాక్షితో మాట్లాడారు.సంబంధిత భవనానికి ఆఫ్‌లైన్ ప్లాన్ ఉందన్నారు. నిర్మాణదారుడు కార్మికులకు బీమా కూడా చేయించారన్నారు. బీమా కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో కూడా తాను మాట్లాడానని తెలిపారు. ఒక్కో బాధితునికి రూ.2 లక్షల చొప్పున పరిహారం మంజూరయ్యే అవకాశం ఉందని చెప్పారు. -
పాఠశాల స్లాబ్ కూలి తెలుగు విద్యార్థులకు గాయాలు
థానే: మహారాష్ట్ర థానే జిల్లా భీవండి పట్టణం పద్మా నగర్లో తెలుగు పాఠశాల తరగతి గది పై కప్పు కుప్ప కూలింది. ఆ ఘటనలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. మంగళవారం ఉదయం ఎప్పటిలాగే పాఠశాల ప్రారంభమైంది. ఎనిమిదో తరగతి విద్యార్థులు తరగతి గదిలో కుర్చుని ఉండగా గదిపై కప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో వారిని హుటాహుటిన పట్టణంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఆ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, పోలీసులు, మున్సిపల్ ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని స్కూల్ నుంచి విద్యార్థులను ఖాళీ చేయించారు. -
కాన్వెంట్లో ఊడిపడ్డ శ్లాబ్
ముక్తేశ్వరం కోనసీమ విద్యాశ్రమ్ కాన్వెంట్కు చెందిన భవనంలో శ్లాబ్ శనివారం ఊడిపడింది. ఈ ప్రమాదంలో పరీక్ష రాస్తున్న విద్యార్థికి, ఓ ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలవ్వగా, కొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆ గదిలో సుమారు 20 మంది విద్యార్థులున్నారు. ఎంఈఓ బీర హనుమంతరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గాయాల పాలైన ఉపాధ్యాయుడు ఎస్పీఎస్ఎస్ మూర్తి, విద్యార్థి బిళ్ల నర్సింహలను పరామర్శించారు. పురాతన భవనంలో స్కూలు నిర్వహించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాసంస్థ నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురాతన భవనంలో స్కూలు నిర్వహణకు ఎలా అనుమతించారంటూ విద్యాశాఖ అధికారులను నిలదీశారు. దీనిపై ఎంఈఓ బీర హనుమంతరావును వివరణ కోరగా, స్కూలు నిర్వహిస్తున్నది పురాతన భవనం కావడం వల్ల శ్లాబు పెచ్చులుగా ఊడి పడిందన్నారు. ఈ క్రమంలో అక్కడున్న విద్యార్థులకు , ఉపాధ్యాయులకు గాయాలయ్యాయన్నారు. స్కూలు భవనం అనుమతులను పరిశీలిస్తున్నామన్నారు. ఈ భవనంలో స్కూలు నిర్వహణను నిలిపి వేస్తున్నామని తెలిపారు.