అమలాపురం, న్యూస్‌లైన్ : గోదావరి డెల్టాలో రబీ సాగు ఊహించినట్టే ఆలస్యమవుతోంది. సాగు షెడ్యూలు మొదలై రోజులు గడుస్తున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయి. హెలెన్ తుపాను వల్ల ఖరీఫ్ వరి చేలు నేలనంటడంతో కోతలు ఆలస్యమవడం, పెట్టుబడులు సైతం రాక రైతులకు అప్పులు పుట్టకపోవడంతో రబీ నారుమడులు ఆలస్యమవుతున్నాయి. సాగునీటి పంపిణీపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఈ ఆలస్యం వల్ల మొదటికే మోసమొస్తుందని వ్యవసాయ, ఇరిగేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డెల్టాలో అధికారిక లెక్కల ప్రకారం 4.80 లక్షల ఎకరాల్లో రబీసాగు జరగాల్సి ఉంది. అయితే వాస్తవ సాగు 4.20 లక్షల ఎకరాల్లో మాత్రమే. తూర్పు డెల్టాలో 2.60, మధ్య డెల్టాలో 1.20 లక్షల ఎకరాల్లో సాగు జరగాలి. గత నెలలో జరిగిన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో డిసెంబర్ ఒకటి నుంచి ఫిబ్రవరి 28 వరకూ మాత్రమే సాగునీరు సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించారు. సాగు కాలం 130 రోజులైతే 90 రోజులు మాత్రమే నీరు సరఫరా చేస్తామడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఁతప్పుడు లెక్క* పేరుతో గత నెల 10న ఁసాక్షి*లో వచ్చిన కథనం-ఇరిగేషన్ శాఖ షెడ్యూలు ప్రకారమే గోదావరి డెల్టాలో రబీ షెడ్యూలు డిసెంబర్ ఒకటిన మొదలై, మార్చి 15 వరకూ ఉంటుందనే విషయాన్ని వెలుగులోకి తెచ్చి, అధికారులను ఆలోచింపజేసింది. దీంతో గడువు మార్చి 15 వరకు పెంచాలని నిర్ణయించినా రైతులు సాగు ఆలస్యం చేస్తారనే ఉద్దేశంతో గడువు పెంచిన విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.
అయితే- కారణాలేమైనా అధికారులు భయపడుతున్నట్టే రబీ సాగు ఆలస్యవుతోంది. డిసెంబర్ ఒకటిన షెడ్యూలు మొదలైనా ఇప్పటి వరకు 5 శాతం కూడా నాట్లు పూర్తి కాలేదు. తూర్పు డెల్టా పరిధిలోని ఆలమూరు, రామచంద్రపురం సబ్ డివిజన్లలో మాత్రమే 30 నుంచి 50 శాతం నారుమడులు పడ్డాయి. మధ్య డెల్టాలో కొత్తపేట సబ్ డివిజన్ మాత్రమే 25 శాతం నారుమడులయ్యాయి. ఎక్కువగా వరి సాగు జరిగే పెద్దాపురం, పిఠాపురం, కరప, అమలాపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం, రాజోలు సబ్ డివిజన్ల పరిధిలో ఇంతవరకూ ఐదు శాతం కూడా నారుమడులు వేయలేదు.
ఆలస్యానికి కారణాలెన్నో..
గత నెలలో సంభవించిన హెలెన్ తుపాను వల్ల రెండు డెల్టాల పరిధిలో శివారు మండలాలున్న వ్యవసాయ సబ్ డివిజన్లలో ఖరీఫ్ వరి కోతలు ఆలస్యమయ్యాయి. కోతలు మొదలయ్యే సమయంలో తుపాను రావడంతో ఈదురు గాలులు, వర్షాలకు చేలు నేలకొరిగి నీట మునిగాయి. వెనువెంటనే లెహర్ తుపాను రావడంతో రైతులు చేలవైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీని ప్రభావం లేకున్నా వర్షం పడడంతో వరి కోతలు మరింత ఆలస్యమయ్యాయి.
డెల్టాల్లో డిసెంబర్ ఐదు నుంచి వరి కోతలు జోరందుకున్నాయి. కూలీలు అందుబాటులో లేకపోవడం వల్ల కూడా కోతలు ఆలస్యమవుతున్నాయి. ఈ కారణంగా రబీ నారుమడులు వేయలేని పరిస్థితి నెలకొంది.
ఖరీఫ్ సాగు భారీ వర్షాలు, తుపాన్ల వల్ల తుడిచిపెట్టుకుపోవడంతో రబీ సాగుకు పెట్టుబడి పెట్టేందుకు రైతుల చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా పోయింది.
దక్కినకాడికి పంట ఒబ్బిడి చేసుకున్నా రంగుమారి, మొ లకవచ్చి, తాలుతప్ప ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం ఇంతవరకూ కొనుగోలు చేయకపోవడం, దళారులు అయినకాడికి కొనడం వల్ల పలువురు రైతులు అమ్మకాలు నిలిపివేశారు. కళ్లాల నుంచి ధాన్యం కదిలితే కనీసం రబీ సాగు ఆరంభించేవారు. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది.
వృథాగా కడలిలోకి..
రబీ సాగు ఆలస్యం కావడం వల్ల ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి నీటిని వృథాగా వదిలేయాల్సి వస్తోంది. బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్‌ఫ్లో 10,096 క్యూసెక్కులు ఉంది. దీనిలో తూర్పు డెల్టాకు 1,500, మధ్య డెల్టాకు 1,400, పశ్చిమ డెల్టాకు 4 వేల క్యూసెక్కుల చొప్పున ప్రధాన పంట కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. మిగిలిన 3,196 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. కాలువలకు నీటి విడుదల పెంచాల్సి ఉన్నా డెల్టాలో వరి కోతలు జరుగుతున్నందున పంట దెబ్బతింటుందని భావిస్తున్న అధికారులు మరో దారిలేక నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ ఏడాది గోదావరి నుంచి సముద్రంలోకి రికార్డుస్థాయిలో నీరు విడుదలైనా ఊహించినట్టే డిసెంబర్‌లో ఇన్‌ఫ్లో పడిపోయింది.
ఇప్పుడొస్తున్న ఇన్‌ఫ్లోలో సీలేరు పవర్ డ్రాప్ నుంచి వస్తున్న సుమారు మూడు వేల క్యూసెక్కుల నీటిని తీసేస్తే సహజ జలాలు 7,096 క్యూసెక్కులే కావడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితి చూ స్తుంటే ఇన్‌ఫ్లో వేగంగా తగ్గుతుండగా, నారుమడులు ఆలస్యం కావడంతో సాగు కాలం పెరిగిపోనుంది. నిపుణుల అంచనా ప్రకారం మార్చి 15 వరకూ కాకుండా ఏప్రిల్ 15 వరకూ సాగునీరు ఇవ్వాల్సి వస్తుంది. అదే జరిగితే రబీ వరి చేలు పాలు పోసుకుని, గింజ గట్టిపడే సమయంలో నీటి ఎద్దడితో రైతులు పడరాని పాట్లు పడక తప్పని పరిస్థితి తలెత్తనుంది.
ఆరంభమే ఆలస్యం
Published Fri, Dec 13 2013 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement
Advertisement