davaleswaram barrage
-
ధవళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి వరద
-
ధవళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి వరద
సాక్షి, తూర్పుగోదావరి : ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద నీరు ఉధృతి స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. బ్యారేజ్ వద్ద వరద 17.7 అడుగులకు తగ్గింది. దావరి వరద తగ్గుముఖం పట్టడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరికను తొలగించారు. ప్రస్తుతం అధికారులు బ్యారేజ్ గేట్లు ఎత్తి 18 లక్షల 99వేల క్యూసెక్కల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.ఇప్పటికే వరద నీటిలోనే 27 లంక గ్రామాలు మగ్గుతున్నాయి. భద్రాచలంలో 44 అడుగులకు చేరి గోదావరి నీటి మట్టం ప్రవహిస్తోంది. భద్రాచలంలో వరద నీటిమట్టం తగ్గడంతో ఈ రోజు రాత్రికి మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పనపల్లి బాలాజీ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. ఆంధ్ర అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన డొక్కా సీతమ్మ ఇంటిని వరద ముంచెత్తింది. కాగా రంపచోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దేవీపట్నం, తోయ్యరు, గొందురు వరద బాధితులకు ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే ధనలక్ష్మీ సందర్శించారు. అక్కడి భోజనం వసతిని గురించి ఆడిగి తెలుసుకున్నారు. -
రికార్డులు నేల'మట్టం'
కొవ్వూరు: 14ఏళ్ల తర్వాత గోదావరి వరద మరోసారి రికార్డు స్థాయిలో నమోదైంది. 2006లో ఆగస్టు ఏడో తేదీన గరిష్టంగా ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 22.80 అడుగుల నీటిమట్టం నమోదైంది. మళ్లీ ఆ స్థాయిలో వరద రాలేదు. ఆ తర్వాత 19 అడుగుల నీటిమట్టం నమోదు కావడం ఇది రెండోసారి. మొదట 2013లో గరిష్టంగా 19.0 అడుగుల నీటి మట్టం నమోదైంది. ఇప్పుడు ఆ రికార్డును దాటి 19.90 అడుగులకు నీటిమట్టం చేరింది. మంగళవారం సాయంత్రం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 19.90 అడుగులుగా నమోదైంది. ఆ తర్వాత కొద్దిగా నెమ్మదించి 19.80 అడుగులకు చేరింది. 2013 తర్వాత మూడోప్రమాద హెచ్చరిక స్థాయిలో వరద రాలేదు. ఏడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు మూడోప్రమాద హెచ్చరిక చేశారు. -
గోదారే.. సాగరమైనట్టు
గలగల సవ్వడితో.. ఎంతో నిర్మలంగా ప్రవహించే పావన గోదావరి.. వరుణుడు తోడవడంతో.. ప్రళయ స్వరూపిణిగా రూపుదాల్చింది. మార్గం మధ్యలో ఉన్న ఉప నదులను, వాగులను కలుపుకొని, శక్తిని పెంచుకొని.. నడకలే పరుగులై.. పరుగులే ఉరకలై.. వడి పెంచి.. ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు వరకూ ఒరుసుకుంటూ పారుతూ.. తీరంలోని పల్లెలను, తనలోని లంకలను చుట్టుముట్టి.. ముంచెత్తుతూ.. సాగర సంగమం దిశగా ఉధృత వేగంతో పరుగులు తీస్తోంది. వారం రోజులుగా గోదావరికి పోటెత్తుతున్న వరద ఆదివారం మరింత ఉధృతమైంది. దీంతో ఎగువన విలీన మండలాలు మొదలు, దేవీపట్నం, కోనసీమలోని లంక గ్రామాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. వరద బాధితులను ఆదుకొనేందుకు ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. సాక్షి, తూర్పుగోదావరి(అమలాపురం) : నాలుగైదు రోజులుగా ఉగ్రరూపమెత్తిన గోదావరి ఆదివారం ప్రళయస్వరూపిణిగా మారింది. ఎగువన స్వల్పంగా తగ్గుతున్న గోదావరి వరద దిగువన కోనసీమ లంక గ్రామాలను చుట్టుముట్టింది. అక్కడ నిలకడగా ఉండగా ఇక్కడ ఉగ్రరూపం దాల్చింది. గడచిన 24 గంటల్లో ఏజెన్సీలో వరద అడుగు మేర తగ్గగా, కోనసీమలో రెండు మూడడుగులు పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 14.20 అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. బ్యారేజి నుంచి 13,50,363 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తెలంగాణలోని దుమ్ముగుడెం, భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పడుతూండడంతో సోమవారం ఉదయం రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకునే అవకాశముందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి వరద ఏజెన్సీలో నిలకడగా ఉంది. అయితే కాఫర్ డ్యామ్ కారణంగా వరద నీరు తీయడానికి మరింత సమయం పట్టనుంది. దీంతో దేవీపట్నం మండలంలోని గ్రామాలు మరో రెండు మూడు రోజులు ముంపులోనే ఉండే అవకాశముంది. ఈ మండలానికి చెందిన సుమారు 3,800 మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఐదు వేల మందికి పైగా భోజనాలు చేస్తున్నారు. గండిపోచమ్మ అమ్మవారు ఇంకా ముంపునీటిలోనే ఉన్నారు. లంకలను ముంచెత్తుతూ.. ఏజెన్సీలో వరద తగ్గుతూండగా కోనసీమలో దీని ప్రభావం పెరుగుతోంది. గంటగంటకూ గోదావరి నీటిమట్టం పెరగడంతో లంక గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకువస్తోంది. పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరి నది మధ్య ఉన్న గ్రామాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మామిడికుదురు, ముక్తేశ్వరం, కనకాయలంక, గంటిపెదపూడి కాజ్‌వేలు మునిగిపోవడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాజ్‌వేల వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పడవల ద్వారా లంక వాసులను, రైతులను, వ్యవసాయ ఉత్పత్తులను అధికారులు దాటిస్తున్నారు. ముందస్తుగా సహాయ పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. అయితే వరద తగ్గుతున్న సూచనలు ఉండడంతో వీటి అవసరం ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. వరద ప్రభావిత గ్రామాలకు ఇప్పటికే నిత్యావసర వస్తువులను చేరవేసిన అధికారులు.. వాటిని స్థానికులకు అందజేస్తున్నారు. వరద తీవ్రతకు గోదావరి నదీ కోత ఉధృతమవుతోంది. ముఖ్యంగా ముమ్మిడివరం మండలం కమిని, సలాదివారిపాలెం, లంకాఫ్ ఠాణేలంక, కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంక, అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం, కొండుకుదురులంక, పి.గన్నవరం మండలం గంటి పెదపూడి వంటిచోట్ల నదీ కోత ఎక్కువగా ఉంది. 10,354 ఎకరాల్లో నీట మునిగిన వరి జిల్లాలోని సుమారు 10,354 ఎకరాల్లో వరి చేలు నీట మునిగినట్టు అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా అంతకంటే అధికంగానే చేలు ముంపులో ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం రామరాజులంక వంటి ప్రాంతాల్లో వరిసాగు చేస్తూంటారు. వీటితో పాటు డెల్టాలో చేలు సహితం ముంపు బారిన పడ్డాయి. గోదావరి వరద ఉధృతి అధికంగా ఉండడంతో తూర్పు, మధ్య డెల్టాల పరిధిలోని ప్రధాన డ్రెయిన్ల నుంచి ముంపు నీరు దిగడం లేదు. పైగా రెండు రోజుల నుంచి నదుల నుంచి వస్తున్న నీరు డ్రెయిన్ల ద్వారా చేలల్లోకి చొచ్చుకువస్తోంది. దీనివల్ల ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, తూర్పు డెల్టాలోని రామచంద్రపురం, కరప, కాకినాడ సబ్ డివిజన్ల పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో వరిచేలు ముంపు బారిన పడ్డాయి. ఈ ప్రాంతాల్లోని తుల్యభాగ, బండారులంక కౌశిక, గొరగనమూడి, ఓల్డ్ అయినాపురం, నార్త్ అడ్డాల్. పెరుమళ్లరాజుకోడు, గొంది నోవా, శంకరగుప్తం, వేపచెట్టు, అంతర్వేది రాళ్ల కాలువల నుంచి కూడా ముంపు నీరు నదుల్లోకి దిగడం లేదు. దీనికితోడు ఆదివారం వరద ఉధృతి పెరగడంతో ముంపు మరింత పెరిగింది. పరిస్థితి చూస్తే మరో రెండు మూడు రోజులు చేలు ముంపులోనే ఉండనున్నాయి. ఇదే పరిస్థితి ఉంటే చేలు కుళ్లిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోపక్క వరదల వల్ల సుమారు 2,061 ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపు బారిన పడ్డాయి. లంక గ్రామాల్లోని అరటి, తమలపాకు, కూరగాయల పంటలకు సహితం ముప్పు వాటిల్లనుంది. ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి పర్యటించారు. కోనసీమలోని మలికిపురం, అల్లవరం మండలాల్లో ముంపు తీవ్రతను పరిశీలించిన ఆయన స్థానిక అధికారులతో వరద పరిస్థితిపై సమీక్ష జరిపారు. -
ఉగ్రగోదావరి
సాక్షి, పోలవరం(పశ్చిమగోదావరి) : ధవళేశ్వరం గోదావరి నీటిమట్టం 9 అడుగులకు చేరింది. బుధవారం సుమారు ఏడు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. ఉభయగోదావరి జిల్లాల మధ్య పోలవరం కాఫర్ డ్యామ్ నిర్మాణంతో గిరిజన నిర్వాసిత గ్రామాలు వరద ముంపునకు గురవుతున్నాయి. ఫలితంగా నిర్వాసిత గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పోలవరం నుంచి ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం జలమయమైంది. దీంతో పోలవరం కుక్కునూరు మండలాల్లోని 29 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వీటికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని గ్రామాల చుట్టూ వరదనీరు చేరడంతో ఆ గ్రామాల ప్రజలు కొండపైకి ఎక్కి తాత్కాలికంగా గుడారాలు వేసుకుంటున్నారు. ఇంట్లోని సామగ్రి, పశువులను వెంట పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యత్నించినా.. వరదలు వస్తే పోలవరం మండలంలోని 19 గ్రామాల నిర్వాసితులను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం ముందుగానే ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఒక్కసారిగా వరదలు పెరగడంతో రోడ్డు మార్గాల్లోకి వరదనీరు చేరింది. వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో నిర్వాసితులను అత్యవసర పరిస్థితుల్లో మండల కేంద్రం పోలవరం చేర్చేందుకు టూరిజం బోట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బోట్ల సింగన్నపల్లి రేవు నుంచి గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. ఫలితంగా పోలవరం, కుక్కునూరు మండలాల్లో 22 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏజెన్సీకి వెళ్లే ప్రధాన రహదారులు నీటమునిగాయి. పోలవరం ప్రాజెక్టు ప్రాంతమూ ముంపునకు గురైంది. వెళ్లే పరిస్థితి లేదు. ప్రాజెక్టు ప్రాంతం నుంచి సింగన్నపల్లి వెళ్లే రోడ్డు మార్గం కూడా వరదనీటిలో మునిగిపోయింది. ముందస్తుగా అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిర్వాసితులు రాకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. నిర్వాసితుల కోసం పోలవరం, గూటాల, పట్టిసీమ, చేగొండిపల్లి ప్రాంతాల్లో షెల్టర్లను గుర్తించారు. వరదలు పూర్తిగా తగ్గి, రోడ్డు మార్గాలు బయటపడితే తప్ప నిర్వాసిత గ్రామాల ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి కానరావడం లేదు. గోదావరి వరద పెరుగుతుండటంతో ప్రాజెక్టు స్పిల్‌వేలోని రివర్స్ స్లూయిజ్ ద్వారా నీరు దిగువకు చేరుతోంది. గ్రావిటీ ద్వారా నీరు ఇచ్చేందుకు ప్రయత్నించిన మార్గాల్లో పనులు చేపట్టి నీరు వెళ్లే విధంగా ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. 8 రివర్స్ స్లూయిజ్‌ల నుంచి నీరు స్పిల్వేలోకి చేరుతోంది. స్పిల్ ఛానల్ మీదుగా గోదావరిలోకి నీరు చేరేందుకు ఏర్పాటు చేశారు. కాఫర్ డ్యామ్ వద్ద 27.20 మీటర్ల నీటిమట్టం పోలవరం కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 27.20మీటర్లకు చేరింది. ప్రస్తుతం 6 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తోంది. 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం దాటితే స్పిల్‌వే రివర్స్ స్లూయిజ్ నుంచి స్పిల్ ఛానల్ ద్వారా నీరు విడుదల చేయాలని సీడబ్ల్యూసీ అధికారులు సూచించినట్లు ప్రాజెక్టు ఈఈ డి.శ్రీనివాసరావు తెలిపారు ఈ మేరకు స్పిల్ వే ఎగువ ప్రాంతం నుంచి దిగువకు నీరు వెళ్లే విధంగా మార్గాలు ఏర్పాటు చేశారు. రివర్స్ స్లూయిజ్ ద్వారా 50వేల క్యూసెక్కుల నీరు స్పిల్ ఛానల్ నుంచి గోదావరి నదిలోకి కలిసే పరిస్థితి ఉంది. నిర్వాసిత గ్రామాలకు రెవెన్యూ సిబ్బంది తరలింపు ప్రత్యేక బోట్లు ఏర్పాటు చేసి నిర్వాసిత గ్రామాలకు రెవెన్యూ సిబ్బందిని పంపినట్లు పోలవరం ఇన్చార్జ్ తహసిల్దార్ జి.అర్జునరావు తెలిపారు. మూడు టూరిజం బోట్లు, ఒక స్పీడు బోటు, రెండు ఇంజిన్ పడవలు ఏర్పాటు చేశామన్నారు. వరద పరిస్థితిని పోలవరం సీఐ ఏఎన్‌ఎన్‌మూర్తి, ఎస్సై ఆర్.శ్రీను పరిశీలించారు. అవసరమైన చోట పోలీసు సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్నామని సీఐ తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి భారీగా ఇన్‌ఫ్లో వరద నీటితో గోదావరి ఉరకలెత్తుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి భారీగా 6,98,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లొ వచ్చి చేరుతోంది. వశిష్ట గోదావరిపై విజ్జేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకు ఉన్న కాటన్ బ్యారేజీ సామర్థ్యానికి మించి వరద నీరు రావడంతో మిగులు జలాలను ధవళేశ్వరం జలవనరుల శాఖ హెడ్‌వర్క్స్ అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ 175 గేట్లను 01 మీటరు వరకు ఎత్తి బుధవారం 6,87,362 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలలను సముద్రంలోకి వదిలారు. భద్రాచలం వద్ద బుధవారం సాయంత్రం నుంచి నీటి మట్టం తగ్గుతోందని, దీనివల్ల గురువారం 8 లక్షల క్యూసెక్కుల వరదనీటిని వదిలే అవకాశం ఉందని ధవళేశ్వరం హెడ్ వర్క్స్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సాయంత్రం 7 గంటలకు 9.00 అడుగుల నీటి మట్టం నమోదైంది. భద్రాచలం వద్ద 38.80 అగుగుల నీటి మట్టం నమోదవగా రాత్రి నుంచి తగ్గుముఖం పట్టింది. పోలవరం వద్ద 11.70 మీటర్లు, రాజమహేంద్రవరం బ్రిడ్జి వద్ద 15.47 మీటర్లు నీటి మట్టాలు పెరుగుతూ వస్తున్నాయి. సముద్రంలోకి భారీగా వరద నీటిని వదలడంతో ప్రస్తుతం గోదావరి నది సరాసరి నీటి మట్టం 13.41 మీటర్లుగా నమోదైంది. డెల్టాలకు నీటి విడుదల తగ్గింపు ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు నీటి విడుదలను తగ్గించారు. పశ్చిమడెల్టాకు 3,500 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2,000 క్యూసెక్కులు, తూర్పు డెల్టాకు 2,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పశ్చిమ డెల్టా పరిధిలోని ఏలూరు కాలువకు 627 క్యూసెక్కులు, నరసాపురం కాలువకు 991 అత్తిలి కాలువకు 196, తణుకు కాలువకు 488 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. -
ఆరంభమే ఆలస్యం
అమలాపురం, న్యూస్‌లైన్ : గోదావరి డెల్టాలో రబీ సాగు ఊహించినట్టే ఆలస్యమవుతోంది. సాగు షెడ్యూలు మొదలై రోజులు గడుస్తున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయి. హెలెన్ తుపాను వల్ల ఖరీఫ్ వరి చేలు నేలనంటడంతో కోతలు ఆలస్యమవడం, పెట్టుబడులు సైతం రాక రైతులకు అప్పులు పుట్టకపోవడంతో రబీ నారుమడులు ఆలస్యమవుతున్నాయి. సాగునీటి పంపిణీపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఈ ఆలస్యం వల్ల మొదటికే మోసమొస్తుందని వ్యవసాయ, ఇరిగేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెల్టాలో అధికారిక లెక్కల ప్రకారం 4.80 లక్షల ఎకరాల్లో రబీసాగు జరగాల్సి ఉంది. అయితే వాస్తవ సాగు 4.20 లక్షల ఎకరాల్లో మాత్రమే. తూర్పు డెల్టాలో 2.60, మధ్య డెల్టాలో 1.20 లక్షల ఎకరాల్లో సాగు జరగాలి. గత నెలలో జరిగిన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో డిసెంబర్ ఒకటి నుంచి ఫిబ్రవరి 28 వరకూ మాత్రమే సాగునీరు సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించారు. సాగు కాలం 130 రోజులైతే 90 రోజులు మాత్రమే నీరు సరఫరా చేస్తామడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఁతప్పుడు లెక్క* పేరుతో గత నెల 10న ఁసాక్షి*లో వచ్చిన కథనం-ఇరిగేషన్ శాఖ షెడ్యూలు ప్రకారమే గోదావరి డెల్టాలో రబీ షెడ్యూలు డిసెంబర్ ఒకటిన మొదలై, మార్చి 15 వరకూ ఉంటుందనే విషయాన్ని వెలుగులోకి తెచ్చి, అధికారులను ఆలోచింపజేసింది. దీంతో గడువు మార్చి 15 వరకు పెంచాలని నిర్ణయించినా రైతులు సాగు ఆలస్యం చేస్తారనే ఉద్దేశంతో గడువు పెంచిన విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. అయితే- కారణాలేమైనా అధికారులు భయపడుతున్నట్టే రబీ సాగు ఆలస్యవుతోంది. డిసెంబర్ ఒకటిన షెడ్యూలు మొదలైనా ఇప్పటి వరకు 5 శాతం కూడా నాట్లు పూర్తి కాలేదు. తూర్పు డెల్టా పరిధిలోని ఆలమూరు, రామచంద్రపురం సబ్ డివిజన్లలో మాత్రమే 30 నుంచి 50 శాతం నారుమడులు పడ్డాయి. మధ్య డెల్టాలో కొత్తపేట సబ్ డివిజన్ మాత్రమే 25 శాతం నారుమడులయ్యాయి. ఎక్కువగా వరి సాగు జరిగే పెద్దాపురం, పిఠాపురం, కరప, అమలాపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం, రాజోలు సబ్ డివిజన్ల పరిధిలో ఇంతవరకూ ఐదు శాతం కూడా నారుమడులు వేయలేదు. ఆలస్యానికి కారణాలెన్నో.. గత నెలలో సంభవించిన హెలెన్ తుపాను వల్ల రెండు డెల్టాల పరిధిలో శివారు మండలాలున్న వ్యవసాయ సబ్ డివిజన్లలో ఖరీఫ్ వరి కోతలు ఆలస్యమయ్యాయి. కోతలు మొదలయ్యే సమయంలో తుపాను రావడంతో ఈదురు గాలులు, వర్షాలకు చేలు నేలకొరిగి నీట మునిగాయి. వెనువెంటనే లెహర్ తుపాను రావడంతో రైతులు చేలవైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీని ప్రభావం లేకున్నా వర్షం పడడంతో వరి కోతలు మరింత ఆలస్యమయ్యాయి. డెల్టాల్లో డిసెంబర్ ఐదు నుంచి వరి కోతలు జోరందుకున్నాయి. కూలీలు అందుబాటులో లేకపోవడం వల్ల కూడా కోతలు ఆలస్యమవుతున్నాయి. ఈ కారణంగా రబీ నారుమడులు వేయలేని పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ సాగు భారీ వర్షాలు, తుపాన్ల వల్ల తుడిచిపెట్టుకుపోవడంతో రబీ సాగుకు పెట్టుబడి పెట్టేందుకు రైతుల చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా పోయింది. దక్కినకాడికి పంట ఒబ్బిడి చేసుకున్నా రంగుమారి, మొ లకవచ్చి, తాలుతప్ప ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం ఇంతవరకూ కొనుగోలు చేయకపోవడం, దళారులు అయినకాడికి కొనడం వల్ల పలువురు రైతులు అమ్మకాలు నిలిపివేశారు. కళ్లాల నుంచి ధాన్యం కదిలితే కనీసం రబీ సాగు ఆరంభించేవారు. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. వృథాగా కడలిలోకి.. రబీ సాగు ఆలస్యం కావడం వల్ల ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి నీటిని వృథాగా వదిలేయాల్సి వస్తోంది. బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్‌ఫ్లో 10,096 క్యూసెక్కులు ఉంది. దీనిలో తూర్పు డెల్టాకు 1,500, మధ్య డెల్టాకు 1,400, పశ్చిమ డెల్టాకు 4 వేల క్యూసెక్కుల చొప్పున ప్రధాన పంట కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. మిగిలిన 3,196 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. కాలువలకు నీటి విడుదల పెంచాల్సి ఉన్నా డెల్టాలో వరి కోతలు జరుగుతున్నందున పంట దెబ్బతింటుందని భావిస్తున్న అధికారులు మరో దారిలేక నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ ఏడాది గోదావరి నుంచి సముద్రంలోకి రికార్డుస్థాయిలో నీరు విడుదలైనా ఊహించినట్టే డిసెంబర్లో ఇన్‌ఫ్లో పడిపోయింది. ఇప్పుడొస్తున్న ఇన్‌ఫ్లోలో సీలేరు పవర్ డ్రాప్ నుంచి వస్తున్న సుమారు మూడు వేల క్యూసెక్కుల నీటిని తీసేస్తే సహజ జలాలు 7,096 క్యూసెక్కులే కావడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితి చూ స్తుంటే ఇన్‌ఫ్లో వేగంగా తగ్గుతుండగా, నారుమడులు ఆలస్యం కావడంతో సాగు కాలం పెరిగిపోనుంది. నిపుణుల అంచనా ప్రకారం మార్చి 15 వరకూ కాకుండా ఏప్రిల్ 15 వరకూ సాగునీరు ఇవ్వాల్సి వస్తుంది. అదే జరిగితే రబీ వరి చేలు పాలు పోసుకుని, గింజ గట్టిపడే సమయంలో నీటి ఎద్దడితో రైతులు పడరాని పాట్లు పడక తప్పని పరిస్థితి తలెత్తనుంది.